Friday, 3 April 2015

లంకిణిపై విజయము

ధర్మమెరిగినట్టి కర్మయోగి హనుమ 
            కుడ్యమున్ దాటగన్  గోడనెక్క
లంకాధిదేవత  లంకరాక్షసచట
            కాపుకాచుచు నుండే  కపిని గాంచె
ఎవడవీవు యిటకు  యేలవచ్చితివీవు
           ప్రాణాలపై యాశ  వదలుకొమ్ము
చావుమూడెను నీకు  సత్యాన్ని వచియింపు
           మనుచు  లంఖిని  వచ్చె  నతని  కడకు

ఏల  కోపమమ్మ  ఇలలోన ఇంపైన
పట్టణంబకాంచ వచ్చితేను
వీధి  వీధి గాంచి వెడలిపోదును నేను
అనుమతించవమ్మ అసురమాత

అనెడు  హనుమ  మాట  నాలకించక లంక
చాచి పెట్టి ఒక్క చరుపు చరిచె
ఆడవారిపైన ఆగడ మేలంచు
వదలినాడు ఇంత వరకు  నతడు

అసుర ముష్ఠి ఘాత మాగ్రహంబును పెంచ
కనులు యెరుపు దాల్చె  తనువు  బిగిసె
పడతి పైన నేల  బలముచూ పడమంచు
ముష్థిని విసిరెనామె  ముఖము పైకి

పవన సుతుని  దెబ్బ  ప్రాణాంతకం బాయె
గావుకేక తెచ్చె  చావు  తెలివి
కరములోడ్తు  నీకు  కపివరుండా  నీదు
దర్శనంబు  నాకు  ధన్యతొసగు

రామ పత్నిని వెదుకుచూ  రామబంటు
కపియె వచ్చును శ్రీలంక  కడలి దాటి
నిన్ను గెలుచును  కదనాన  నిజము  సుమ్ము
అసుర  జాతియె యవనిపై నంతరించు

ధాత తెలిపెను  నాకు దయతోడ నొకనాడు
పురము రక్ష జేయు  తరుణమందు
నన్ను  గెలుచు  వాడు  నాశనమొనరించు
లంకపట్టణమును  రక్కసులను

((మిత్రులకు హనుమజ్జయంతి  శుభాకాంక్షలు))

Thursday, 2 April 2015

ప్రియనేస్తం

మరణమా!  నా  ప్రియనేస్తమా!!
నేను పుట్టిన  నాటినుండి...
అనుక్షణం  నన్నంటి పెట్టుకుని
నాతోనే  నీడలా  వెంటాడుతున్నావే ...

అనునిత్యం  మనఇద్దరికీ  జరిగే
సంఘర్షణలో  నేనే  ప్రతీసారీ
గెలుస్తున్నానే ... ... అయినా...
నీ యత్నం  మానవుకదా!

నాకు  తెలుసు
ప్రతీరోజూ  నేనే నిన్నోడించి గెలుస్తున్నా
ఏదో  ఒకనాడు  నీవు నన్నోడించక  మానవని
ఇక  నీవు గెలిచాక  నాకిక మరో యవకాశం
ఇవ్వవనీ తెలుసు....

నిన్ను  తప్పించుకోవాలని  నేననుకున్నా
ఈ  సృష్టిలో నీకు తెలియని స్థావరం
యెక్కడుందని వెళ్ళను..... అందుకే
నువ్వు  గెలిచే వరకూ  నేనే గెలుస్తూ
గెలిచానన్న  భ్రాంతిలో బ్రతుకుతుంటా

దేవుడికే బదులుదొరకని ప్రశ్న

కడుపులో  బిడ్డ ఆడదని తెలిస్తే చాలు
కడతేర్చాలని  చూసే కసాయిలోకంలో
నా కెందుకు  జన్మనిస్తున్నావ్  దేవుడా!

కడుపులో నేనూపిరి పోసుకున్నానని
తెలిసిన్నాడు నా తల్లికెంతటి మన్ననలో!
నేనాడదని తెలిసి.... భ్రూణ హత్య వద్దన్ననాడు
ఆమెనెంతలా  హింసిస్తున్నారో! తెలిసి  కుములుతున్నా

ఓ... దేవుడా!!

ధర్మభూమి  కర్మభూమని ఘనంగా చెప్పుకునే
ఈ నా మాతృభూమిలో  ఇంతటి  యమానుషమా!
ముగ్గురమ్మలనీ! మువ్వురమ్మల మూలపుటమ్మ
యని లక్ష్మీ పార్వతీ శారదలనారాధించే పవిత్ర
నేలమీదే  నేలతకు అడుగడుగున  అవమానాలా?

ఓ దేవుడా! ఈ సృష్టీలో స్త్రీ  జన్మయే  లేకుంటే
రేపటి తరానికి  రూపమెక్కడిదని అడుగుతున్నా!
బదులివ్వ లేవుకదూ నీకూ జవాబందని  సమస్యేనా
నారీలోకమంటే!!

ప్రార్థన

నా  కనులు  వెదుకుతున్నాయి
తనివి  తీరా  నిన్ను  కాంచాలని
కానీ... వాటికా అవకాశం చిక్కనే లేదు
ఏనాడూ  నువ్వగుపించనే  లేదు.

నా హృదయం  యేనాడు  నీ  కొరకై
పరితపించనే  లేదు,  నిజానికి
దానికా  అవసరం  రానే  రాదు,  యెందుకంటె
నువ్వక్కడే  కదా  స్థిరమై  యున్నావ్

ఓ ... ప్రభూ....  ....  ....

సతతం  నా  మదిలోనే  నీ  వున్నా
యెందుకో  నీ  కోసం  నా  ఈ  అణ్వేషణ
నీవున్నా వని  అంతరంగమామోదించినా
లేవేమో  నన్న  చిన్న  శంక  వెంటాడుతూ  నే వుంది

నా  కోసం  కాకున్నా!  నీ  కోసమైనా
నువ్వున్నావన్న  నిజాన్ని  చాటుకోడానికైనా
ఓ సారి  నా  ఈ అజ్ఞానాంధకారంలో  చిక్కుకు
పోయిన నా జనాల కోసమైనా భువికి దీగిరమ్మని
ప్రార్థిస్తున్నా!!

Wednesday, 1 April 2015

హనుమద్దౌత్యం

https://docs.google.com/file/d/0B9I1jK_Lql13dnJ5N09NYzRSYkFkMVNJODFkcnNPTzFwaXkw/edit?usp=docslist_api

ప్రణతి ప్రణతి ప్రమదా!

సృష్టిలో  నీ జాతి  అస్తిత్వానికి
ప్రమాద ఘంటికలు  మ్రోగకుండా
కాపాడుతూ  ....  ....  ....  ....

అనంత స్రవంతిలా  నీజాతి
జీవన  గమనానికి  మూలమువై
నీ భావి జాత్యాంకురాలకు
క్షేత్రమువై ....  ....  ....

జాతీ సుమాలను  జగతి కందిస్తూ
ధరణిపై  నీ  జాతిని  సజీవంగా
నిలుప గలుగుతున్న ఓ అమృతమూర్తీ

నీ కిదే  నా  కైదండలు  మోడ్చి 
సాష్టాంగములతో  సదా
ప్రణతులంద జేస్తున్నాను