Sunday, 30 March 2014

మానవత్వం

     మానవత్వం పరిమళించిన మహా మనిషి

  ఇది కలియుగం మానవ బంధాలన్నీ ధన బంధాలే అంటారు, ఒక్కోసారి అవి వాస్తవాలే అనిపిస్తాయి, క్షమించండి  ఒక్కోసారి కాదు ప్రతీ సారీ అదే నిజమని రుజువవుతుంది.

   ఒకప్పుడు మానవులు అర్తిగత ప్రాణులు, తర్వాత అన్నగత ప్రాణులు గా మారారు, మరి ఇప్పుడు ధన గత ప్రాణులుగా మారారు. ఇదే నిజం ఇదే కలియుగ   ధర్మం

    కాని ఇంకా ఈ భూమి పై మానవత్వం మిగిలి వుందని మనుషులు మనుషులు గా వ్యవహరిస్తూ సాటి మనుషుల పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగాలను చూపించి, సాటి వారిని కేవలం మాటల సాయమే కాదు ఆర్ధిక, మానసిక, భౌతిక, సాయాన్నందించిన ఒకరి గురించి న వాస్తవం ఇది.

    దిల్ సుఖ్ నగర్ లో వుండే  శివ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒకరు తన విశాల హృదయాన్ని ప్రదర్శించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.

      కృష్ణ అనే 22 సంవత్సరాల వయసు అబ్బాయ్ అనారోగ్య సమస్య ఎదురై హాస్పిటల్ కెళ్ళాడు అక్కడ సుమారు నలబై ఐదు వేల ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడం తో చిరు వ్యాపారం చేసుకునే కృష్ణ అంత డబ్బు తన వద్ద లేదని ఆపరేషన్ చేసుకోవడాన్ని మానుకున్నాడు, ఈ విషయం తెలిసి శివ  తాను యాభై మూడు వేల రూపాయలని ఖర్చు చేసి కృష్ణకి ఆపరేషన్ చేయించాడు
 
     శివకి కృష్ణ బంధువా?......కాదు  కేవలం పరిచయస్తుడు మాత్రమే, కేవల పరిచయానికే అతను చూపిన త్యాగం మానవత్వం  ఎంతో గొప్పదే కదా అతనికి అతనిలోని మంచితనానికి పరిమళించే మానవత్వానికి హాట్సాప్ చెబుదాం మనందరికీ అతని మానవత్వం మార్గదర్శకం కావాలి.         

Thursday, 27 March 2014

జయ ఉగాదీ

                 జయ నామ సంవత్సర శుభాకాంక్షలు
                                   
                                                      విరించి

    శ్రియమున్ గూర్చగ వచ్చెనో జనుల సంక్షేమంబు నే గోరెనో
    పయనంబై తన చెల్లితో దెనుగు సౌభాగ్యంబు పెంచంగనొ
    జయనామంబను వత్సరం బిటకు యే సత్కార్య మాశించియో
    దయతో జేరెను వత్సరాంబ, కడు మోదంబౌను యీ ధాత్రి కిన్
    పల్లవించిన నవ పల్లవంబుల తోడ
                    పాదపముల శోభ పరిడ విల్లె
     విరగ కాసిన ఫల బరువుచే తరువులు
                     ప్రకృతికే అందాల రమ్య తొసగె
     పూప పల్లవముల పొట్టార భుజియింప
                      కలకంటి గాత్రాన కలిమి చేర
      మురిపాన గొంతెత్తి మోహన రాగాన
                      స్వాగతాల్ పల్కె వసంతమునకు
      స్వాగతించుమోయి వత్సరాంగన వచ్చి
      తెలుగు గుమ్మమందు నిలిచి యుండె
      జయము గూర్చ మనకు జయనామమను పేర
      కదలి వచ్చె నదియు కలిమి తోడ. 

    

ఉగాది శుభాకాంక్షలు

                        జయ నామ సంవత్సర శుభా కాంక్షలు
                                                                   విరించి

    శ్రియమున్ గూర్చగ వచ్చెనో జనుల సంక్షేమంబు నే గోరెనో
    పయనంబై తన చెల్లితో దెనుగు సౌభాగ్యంబు పెంచంగనొ
    జయనామంబను వత్సరం బిటకు యే సత్కార్య మాశించియో
    దయతో జేరెను వత్సరాంబ, కడు మోదంబౌను యీ ధాత్రి కిన్

    పల్లవించిన నవ పల్లవంబుల తోడ
                    పాదపముల శోభ పరిడ విల్లె
     విరగ కాసిన ఫల బరువుచే తరువులు
                     ప్రకృతికే అందాల రమ్య తొసగె
     పూప పల్లవముల పొట్టార భుజియింప
                      కలకంటి గాత్రాన కలిమి చేర
      మురిపాన గొంతెత్తి మోహన రాగాన
                      స్వాగతాల్ పల్కె వసంతమునకు
      స్వాగతించుమోయి వత్సరాంగన వచ్చి
      తెలుగు గుమ్మమందు నిలిచి యుండె
      జయము గూర్చ మనకు జయనామమను పేర
      కడలి వచ్చె నదియు కలిమి తోడ. 
    

పాతసీసాలో..........

                                  పాత సీసాలో .....
                                     విరించి

         ఈ కథ చదువుతుంటే అక్కడక్కడ కాస్త పాత వాసన వస్తుంది, కాని ఇది ఆ పాత కథ కాదు, అలా అని చెప్పి ఈ కథ పూర్తి కొత్తది అని చెప్పను.

       మన తరాని కంటే ముందుతరాల నాడే పుట్టిన ఈ కథను ....తరువాత తరాలకు కాలమాన పరిస్థితుల కనుగుణంగా కాస్త పుటం పెట్టి మెరుగులు దిద్ది తెలుగు పాటకుల కందించాలన్న చిన్న ప్రయత్నం ......పాత కథకు కాస్త పొడిగింపు. అంతే...

       రంగయ్య   ఉరఫ్  రంగడు ఓ పేదవాడు,  ఎంత పెదవాదంటే  ఏ సి గదుల్లో కూర్చొని బర్గర్లు పిజ్జాలు తినలేనంత,... ఘుమ ఘుమ లాడే బిర్యానీ పులిహోరాలు తినలేనంత ...వేడి వేడి నీళ్ళతో మైసూర్ శాండల్, పీయర్స్ సబ్బుతో రుద్దుకుని స్నానం చేయలేనంత... శ్రీచందనాది కలపతో తయారు చేసిన పట్టె మంచం పై హంస తూలికా తల్పం వేసుకుని హాయిగా నిదురించ లేనంత,...పట్టు పీతాంబరాలు కట్టుకుని చందనాది లేపనాలని శరీరానికి పూసుకోలేనంత,... ఇమ్పాలా డాడ్జ్ కార్లలో తిరగలేనంత, పేదవాడు.

       దొడ్డుబియ్యం, జోన్నరొట్టే లతో కడుపు నింపుకుంటూ ఇంటి కి దగ్గరలో ఉన్న ఓ చిన్న చెరువులో స్నానం చేస్తూ , అక్కడక్కడ చిరుగులున్న ముతక బట్టలనే అపురూపంగా వేసుకుంటూ ఓ పన్నెండు చదరపు గజాల వైశాల్యంలో ఎండా వానలనుండి రక్షించే స్థాయిలో ఉన్న ఓ చిన్న గుడిసెలో నివసిస్తూ తన జీవితమనే రైలు బండిని మరణమనే గమ్యాన్ని చేరడానికి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న బహు దూరపు బాటసారి రంగడు.

        ఆ రంగాని జీవితమనే రైలు బండిలోకి  పెండ్లి అనే ఒకానొక మజిలీలో ప్రవేశించిన మరో బాటసారి మంగ.

     మంగ, రంగడు భార్యాభర్తలై కలిమికి లోటైనా ప్రేమకు ఏమాత్రం లోటు లేకుండా ఇరుకైన ఆ ఇంట్లో విశాలమైన మనసులతో సంతృప్తిగా జీవించ సాగారు.

       ప్రొద్దున్నే తన పనులన్నీ ముగించుకుని రంగడు ఓ గొడ్డలిని భుజాన వేసుకుని  క్షత్రీయులని   చంప ప్రతిన బూనిన పరశు రాముని వలె  దగ్గరలోని అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి ఊళ్ళల్లో అమ్మి ఇంటికవసరమైన సరకులని తెచ్చేవాడు, రంగనితో బాటు బయలుదేరి ఆ ఊరి మునసబు గారి తోటలో పనికి వెళ్ళేది మంగ, సాయంత్రం వచ్చేపుడు ఆ తోటలోంచి కాసిని మల్లెపూలు కోసుకోచ్చేది,

    రాత్రి ఆ మల్లెలని సిగలో ముడుచుకుని ఇరుకైన ఆ ఇంట్లో చిరిగినా చాపపై వేసిన ఓ ముతక బొంత పై భర్త సరసన చేరి సరసాలతో ఓటమి లేని క్రీడలో క్రీడించి స్వర్గం అంచులదాకా వెళ్లి అలసి స్వేదంతో తడిసిన శరీరాలతో వేడి వేడి నిట్టూర్పులతో హాయిగా నిదురించే వారు.  

       ఒక రోజు ఎప్పట్లాగే గొడ్డలి చేత బూని అడవికి వెళ్లి ఓ చెరువు గట్టు మీద వున్న ఎండిన చెట్టును కొట్టసాగాడు, మిట్ట మధ్యాహ్నం ఎండా తీవ్రగా ఉండడంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి, అరచేతులని కూడా వదలలేదు, దానితో గొడ్డలి జారి పోయింది చెరువులో పడిపోయింది.  దిగి గొడ్డలిని తీసుకోవచ్చు కాని తీసుకోలేదు, అలా తీసుకుంటే మన కథ ఇక్కడే ముగిసేది. గొడ్డలి చెరువులో పడిందని ఏడుస్తూ చెరువు గట్టుపై కూర్చుంది పోయాడా అమాయకుడు.

       మనవాడి ఏడుపు విన్న జలదేవతకు  హృదయం కరిగింది, వెంటనే అతని ఎదురుగా ప్రత్యక్షం అయి " రంగయ్యా! ఎందుకేడుస్తున్నావ్?" అని అడిగింది.
  
      రంగడు విషయం చెప్పగానే ఆ దేవత చెరువులో మునిగి తళ తళ లాడే వజ్రపు గొడ్డలితో పైకొచ్చి రంగయ్యకు అందించింది, దాన్ని చూసి రంగయ్య తనది కాదని తిరస్కరించాడు, ఆ తర్వాత మిల మిల లాడే బంగారు గొడ్డలిని అందించ బోయింది, అదీ కాదనడం తో దగద్దగాయ మానంతో ప్రకాశిస్తున్న వెండి గొడ్డలిని తీసుకొచ్చింది, అదికూడా తనకక్కర లేదని తనది కానిది ఏది తాను తీసుకోనని చెప్పడం   తో ఈసారి పాతది తుప్పు పట్టిన ఇనుప గొడ్డలిని తెచ్చింది, దాన్ని చూడగానే సంతోషం తో తీసుకున్నాడు, అతనిలోని నిజాయతికి మెచ్చిన జల దేవత ఆ నాలుగు గొడ్డళ్ళని రంగనికే ఇచ్చి అంతర్ధాన మైంది.

         రంగాని ఆనడానికి అవధులు లేవు వజ్ర బంగారు వెండి ఇనుప గొడ్డళ్ళని   అందుకుని మార్కెట్లోకి పరుగెత్తి అమ్మడం ప్రారంభించాడు, అతనికి బంగారం వెండి ఎక్కడ అమ్మాలో ఎలా అమ్మాలో ఇంతకు అమ్మాలో తెలియదు, చిన్నప్పుడెప్పుడో అంగళ్ళలో రత్నాలు అమ్మినారట ఇచట అన్న పాట విని ఉన్నాడు కనుక అంగట్లోకే వెళ్ళాడు, ఒకడీ అమాయకుని అమాయకత్వాన్ని బాగానే సొమ్ము చేసుకొని ఎంతో కొంత ఇచ్చి నాలుగింటిని హస్తగతం చేసుకున్నాడు.

       ఇంకేం ఆ వచ్చిందే ఎక్కువనుకున్నాడు గుడిసె స్థానం లో మెడ, ముతక బట్టలు పోయి మురిపాల వస్త్రాలు టేకు మంచం యుఫాం బెడ్డు బిపిటి బాస్మతి బియ్యం ఫియర్స్ సబ్బులు ఫేర్ అండ్ లవ్లీ ఫేర్అండ్ హ్యాండ్సం లు వచ్చేసాయ్

     దంపతులు పనుల్లోకి వెళ్ళడం లేదు హానీ మూన్ లే హానీమూన్ లు దేశం లోని అన్ని ప్రాంతాలను చూసొచ్చారు,

     ఇల్లంతా ఏ సి చేయించారు, మల్లెల స్థానంలో కృత్రిమ సెంట్ వచ్చింది               
          
      ఇంతైనా వారి హృదయ వైశాల్యాలు చెక్కు చెదర లేదు.

     ఒకరికి ఒకరి ఇద్దరొకటై జీవిస్తున్నారు.

      ఇంతకు ముందు ప్రతి రాత్రి స్వర్గతీరాలకు వెళ్లి వచ్చేవారు, ఇప్పుడు ప్రతీ రాత్రి స్వర్గాన్ని గదిలోకి తెచ్చుకుంటున్నారు.

      వారి అనురాగంలో మార్పు రాలేదు, ఆప్యాయతలో తేడా రాలేదు ప్రేమ కుదించుకు పోలేదు.ఆనందాల ననుభవించడంలో భేదం రాలేదు.

       మంగ లేనిది రంగడు, రంగడు లేనిదే మంగ ఒక్క క్షణం ఉండేవారు కాదు.

      అందుకే పనులు మానుకున్నారు, శ్రమ సౌఖ్యాన్ని వీడారు, శారీరక సౌఖ్యాల వెంట పరుగు తీసారు.

      గాలిలో ఉంచిన కర్పూరం ఆవిరవక మానదు, కూర్చుని తింటుంటే సిరి కొండంతున్నా కరగక మానదని పెద్దలేనాడో  చెప్పారు, ఇక్కడా అదే జరిగింది, కొన్నాళ్ళకే ఆస్తులు కరిగి పోయాయ్, తిరిగి చిన్నా చితక పనుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది.

        తినే నోరు తిరిగే కాలు ఆగవుగా ..........  కొన్నాళ్ళకు గోదావరి పుష్కరాలు వచ్చాయ్, జనులు తండోప తండాలుగా గోదావరి తీరానికి వెళ్లి స్నానాలు చేసి వస్తున్నారు, ఈ విషయం తెలిసి మన ఆదర్శ దంపతులు సైతం వెళ్లాలని అనుకోని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని డబ్బులు అప్పు తీసుకొని బాసర్ ప్రయాణమయ్యారు. బాసరలో జనసంద్రాన్నే చూసారు.

         అక్కడే ఉన్న పురోహితున్ని మాట్లాడుకుని  జనాలను చేదిస్తూ నదిలోకి దిగి పురోహితుడు మంత్రాలు చదువుతుంటే దంపతులు సరిగంగ స్నానాలు చేయసాగారు, విపరీతమైన రద్దీ ఉండడం వాళ్ళ ఎవరో నెట్టడం తో మంగ నదిలో పడిపోయింది, ప్రవాహం విపరీతమైన వేగంతో ప్రవహించడం తో చాలా వేగంగా కొట్టుకు పోసాగింది మంగ, క్షణ క్షణానికి దూరం పెరగ సాగింది,  అక్కడున్న వాళ్ళు కాపాడడానికి ఎంతో ప్రయత్నించి చాలించుకున్నారు.

       కర్తవ్య మూడుడై కిం కర్తవ్యం అన్నట్లుగా నిలబడిపోయిన రంగనికి భార్య నీటి పాలవడం తో ఏడుపు ముంచుకొచ్చి  బావురు మని ఏడ్చాడు.

       రంగాని ఏడుపు వింటేనే కరిగిపోయే జలదేవత అతని ముందు ప్రత్యక్షమై " ఎందుకొరకు ఏడుస్తున్నావ్ రంగా!" అని ఆప్యాయంగా అడిగి విషయం తెలుసుకుని వెంటనే గోదావరిలో మునిగి రెండు క్షణాలలో అనుష్క లాంటి అందమైన అమ్మాయితో తిరిగి ప్రత్యక్షమైంది , ఇదిగో నీ భార్య అంటూ ఆ అమ్మాయ్ ని ముందుకు నెట్టింది, రంగడు అయోమయంగా కాసేపు చూసి ఆ వెంటనే ఆ అమ్మాయ్ చేయిపట్టుకొని తనవైపు లాక్కున్నాడు.

         ఈసారి అవాక్కవడం దేవత వంతైంది, రంగని చర్యకు కోపంతో ఉడికిపోతూ  " ఇదేంటి రంగయ్యా! ఈవిడ నీ భార్య మంగ కాదుగదా, ఎలా స్వీకరించావ్?.........నీలోని నిజాయతి చచ్చి పోయిందా  లేక నీ భార్య మీద మోజు తగ్గి కొత్త రుచులకోసం కొత్త పెళ్ళాం కావలిసోచ్చిండా?" అని అడిగింది.

        ఆ మాటలకు రంగయ్య  " తల్లీ! నా నిజాయతి చావలేదు నా భార్య పై ప్రేమ తగ్గలేదు, కాని నీవు తెచ్చిన ఈ అమ్మాయ్ నా భార్య కాదూ అన్నానే అనుకో అప్పుడు మరో ఇలియానా లాంటి అమ్మాయ్ ని తేస్తావ్ ఆ తర్వాత సమంత చివరికి గంగను తేస్తావ్ ఆ పిమ్మట నా నిజాతతికి మెచ్చి  ఈ నలుగురిని నాకే అప్పగిస్తావ్, పేదవాన్ని నలుగురు భార్యలని పోషించే శక్తి సామర్థ్యాలు నాకు లేక మొదటమ్మాయ్ తోనే సరిపెట్టుకుందామనుకున్నా!" అంటూ చెబుతున్న రంగని మాటలకు నవ్వుతూ అంతర్దానమై రెండు క్షణాల తర్వాత మంగతో ప్రత్యక్షమైంది జలదేవత.           

  
   

Wednesday, 26 March 2014

ఓ మనిషీ మేలుకో

                                                  ఓ మనిషీ మేలుకో                                                         విరించి

అంకురించిన జీవులన్నిటి  గమ్యమొక్కటి తెలుసుకో
రాజు పేదల భేదమెంచక రాలిపోవుటే, మేలుకో!
ఎప్పుడే విధి చావు చేరునో  చెప్పడెవ్వ డీ సత్యమూ
మరణ దేవత నీకు నీడై  వెంట తిరుగును నిత్యమూ,

బుద్భుదంబిది జీవితమ్మని బుద్ధి జీవులు చెప్పినన్
బుద్ధి హీనత చేత మనుజులు భ్రమను వీడక బ్రతుకుచున్
నాది నాదను స్వార్థ చింతన రోజు రోజుకు మించగన్
సాటివారిని దోచుకొనుచు సొంత ఆస్తులు పెంచిచున్

మిద్దెలేమో మెడ లౌతయి మెదలే కద కోటలౌతయి
కన్నవారే భారమౌతరు కాన్తకేమో దాసులౌతరు
కోట్ల కొరకై ప్రాకు లాడుతు కోట మేడల బ్రతుకు కొరకు
కాంచనంబె  సర్వమంటరు  మంచి తనమును అమ్ముకుంటరు

కోట్లు కూడగబెట్టిన  కోటలెన్నో గట్టినా
నీవు చచ్చిన రోజు వెంటనే ఇంటి బయటకి ఈడ్చి వేతురు
మారు బట్టయు నీకు ఇవ్వక మరు భూమి కేమో మొసుకెల్దురు
పెద్ద కర్మ జరిపి పిమ్మట పెదవి విప్పరు నీదు పేరు           

భారతసిపాయి

                                                భారత సిపాయి
                                                     విరించి

త్యాగము చేసినావు కద ధన్యుడ వోయి సిపాయి మాతృ భూ
భాగపు రక్ష సేయ కడు భారపు దీక్ష వహించి నావు నీ
వా గిరి కానలందున నివాసము జేసి విదేశ వేగులా
డేగలబోలు శాత్రువుల డీకొను నీకు జయంబు నిత్యమౌ

భారత భూమి రక్షణపు బాధ్యత చేకొని తల్లిదండ్రులన్
దార సుతాదులన్ విడిచి ధారణి యంచున కొండ కోనలన్
జేరిన త్యాగ మూర్తులు యజేయ పరాక్రమ శీలులౌ మహా
ధీరులు వారి త్యాగధన దీప్తుల కాంతి మహోజ్వలంబులౌ

శ్రీకర భారతావనిని శ్రీగని కానల రత్నగర్భయౌ
సాకరమొప్పు సంస్కృతుల సంచిత శోభల భారతావనిన్
పోకిరి మ్లేచ్చులీ యవని పుణ్య ధరీత్రిని మ్రుచ్చలింపగా
పోకిరి చేష్టలన్ అణచ పోరిది వారి మదంబు ద్రుంచుమా

ఇమ్మహి పాలకుండవయి ఇద్ధరణీ పరి రక్షకుండవై
కమ్మని యమ్మ నీడన సుఖంబుగా లోకులు సేద తీరు యా
కమ్మని వీలునే జనుల కందగ జేసిన వాడ వోయి యే
యమ్మ సుగర్భ వాసమున యంకురా మొందితి వోయి ధీరుడా

ఆరడి పెట్టు దుర్జనుల నంతము చేయగ రుద్రమూర్తి వై
పోరును సల్పు, రక్కసుల పోకిరి మూకల నాశనంబు నే
కోరితి, నుగ్రవాదమును కూకటి వ్రేలుల సంహరించుమా
భారతి కీవు రక్ష జయ భారతి నీకు సదా సురక్ష యౌ

భారము కాదు నీకు భావ బంధములన్ విడనాడి ద్రోహులన్
మారణ కాండ సల్పుదువు మాన్యుడ వైన సిపాయి వోయి సం
హారము జేసి శాత్రు పరిహారము జేయుము సింగమొప్పగన్
తీరదు ణీ ఋణం బెప్పుడు తీర్చగ జాలరు భారతీయులున్                         

Monday, 24 March 2014

హాస్యం

                                        హాస్యం                                                విరించి

నవరసాలలోన నాణ్యమై విలసిల్లు
రసము కలదె హాస్య రసము కన్న
రసము లందు హాస్య రసముయే రారాజు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

మంచి నవ్వు యొకటె మనుజుని సర్వంబు
లేమి లోటు కదియు క్షామ కరము
సిరులు లేని వేళ చిరునగవే చాలు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

ఉగ్గుపాల తోడ ఊయలందు శిశువు
కబ్బినట్టి విద్య హాస్య మొకటి
చాట నాటి వరము కాటి వరకె కదా
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

నెయ్యమున్న చోట కయ్యాలు కలగని
మిత్రు డైన మారి శత్రు వవని
హాస్య మెపుడు యప హాస్యంబు కారాదు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

వలచినట్టి కాంత వదనాన చిరు నవ్వు
కాంచనెంచు ప్రియుడు కాంక్ష తోడ,
చెలియ నవ్వు కన్న సిరులు గొప్పవి కావు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

భాష లోని భేద భావంబు పలుకుచు
నత్తి మాటలాడి నరులు ఇలను
హాస్య మొలుకు ననుచు యత్నాలు చేసేరు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మన్నదదియు అక్షయంబిలలోన
నశ్వరంబు లేదు నవ్వుకిలను
తాను శాశ్వతంబు ధన ధాన్యముల కన్న
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

విఫణి వీధులందు విక్రయింపగలేరు
దాన మడగ బోవ ధనము కాదు
ఇలను హాస్యమన్న ఈశ్వర తత్వంబు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

గంతు లేసి యొకడు గమ్మత్తు సేయును
అలవి గాని పనులు హాస్య మనుచు
రోత పనులు సల్ప రుగ్మతే హాస్యమా?
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

పదుగురొక్కసారి పాక పకా యని నవ్వ
పరిసరంబులన్ని పరవశించు
పెళ్లి మండపమున వెళ్లి విరియు నవ్వు
కాంతు లీన జేయు కన్నె యదన

నేత నవ్వు గాంచి దూతలు నవ్వేరు
 తల్లి నవ్వినంత పిల్ల నవ్వు
పెద్ద వారి నగవు పిల్లల మురిపించు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

సరస మేల  చిట్టిమరదళ్ల తో బావ
చిలిపి మాటలేల చేష్ట లేల?
హాస్య రసము యన్న యభిమాన మదికాద,
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

దవడ కండరముల దారుడ్యమును పెంచు
మదిన కుత్సితంబు మట్టు పెట్టు
మనసు శాంత పరచు మందురా నవ్వంటె
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

అపరిచితుల తోడ హాస్య మాడెడువాడు
ఆత్మ బంధువగును అవని జనుల
హాస్య మన్నదొకటె ఆప్యాయతను పెంచు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

కలువ రేకులంటి  కనులు సైతము చూడ
మూసికోనును హాస్య మూల మదియు
హాస్య మిచ్చు సుఖము అంతరాత్మ యె  గాంచు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

నవ్వ లేని వారు నరలోక మందున
ఇమడ లేక మొదట ఇల్లు,పిదప
సతిని వీడి చివర సన్యాసు   లయ్యేరు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

పదుగురున్నచోట పక పక వినిపించు
జ్ఞాని యొక్క డున్న మౌనముగను
వెల్లి విరియు నవ్వు విపుల పుడమి యందు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

దాన మందు యన్న దానంబు మిన్ననీ
అవని జనులు పొగడి యాచరింత్రు
హాస్య మున్న చోట అన్నదానములేల
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

భాషలోన భేద భావాలు యున్నను
తీరు తెన్నులందు తేడయున్న
హాస్య మందు యెట్టి అంతరాలుండవు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

చెలియ నవ్వు గాంచి చెంగలించని వాడు
ఉండబోడు  నిజము యుర్వి యందు
ప్రేమ పంచు నవ్వు కామంబు కాదురా!
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మన్న నేమి? అవహేలనా?  కాదు,
హాస్య మన్న బూతు యసలు కాదు,
హాస్య మన్న యదియు అపురూప యోగంబు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

యోగ సాధనంబు రోగ నాశన కారి
హాస్య మనెడు క్రియయే యవని యందు
హాస్య మొక్కటున్న అవని నే గెలవొచ్చు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మవదు ఎపుడు యవనికి భారంబు
మీదు జనుల కదియు మేలు సేయు
జనుల హృదయ మందు జాగృతౌ హాస్యంబు
  హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము 

భువన విజయ మందు భూరి సాహితి సేవ
జరుపు వేళ యచట జనులు మెచ్చు
కవిత జెప్పు వికట కవిదిరా హాస్యంబు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

స్మిత వదనుని చుట్టు స్నేహితులుండేరు
నవ్వ నాడు కాడు నాయకుండు
నవ్వు వాడి బతుకు నగుబాటు కాదురా
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

తెల్ల దొరల తోడ ధీరుడౌ మన గాంధి
పోరు సల్పి స్వేచ్ఛ  కోరనేల
నవ్వు మరచినట్టి నా జాతి కోసమే
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

సఖియ తోడ ప్రియుడు సరస సంభాషణ
చేయు వేళ యతని చేష్ట లందు
హాస్య ముండు గాని అన్యమెక్కడయుండు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

విశ్వ జనులు మెచ్చు వీరుఁడు మెచ్చును
భిక్షుకుండు మెచ్చు బీద మెచ్చు
సర్వ జగతి మెచ్చు సాధనే హాస్యంబు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మొలుకు చోట ఆనంద   వర్షంబు
కురిసి మురియు నంట కువలయంబు
బాధలన్ని మాపి భాగ్యాల పండించు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

మానవత్వమున్న మనిషిలో సతతంబు
సురులు మెచ్చు హాస్య సుధలు కురియు
మంచి హాస్య మన్న మాధవుండే మెచ్చు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము 

సిగ్గు పడెడు వేళ చిన్నదానికి నవ్వు
శోభ నిచ్చి యామె షోకు పెంచు
చిత్రమైన యట్టి చిరునవ్వె యందము
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

కలువ రేకులంటి చిలిపి తనము నిండి 
కాన్తులూరు తుండు కలికి కనులు
తెలుపు భాష హాస్య మలరించు జగతిని
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము