Saturday, 13 June 2015

నువ్వే నువ్వే ముమ్మాటికి నువ్వే

నువ్వే...నువ్వే...నువ్వే...ముమ్మాటికినువ్వే!

రాజకీయాలకు అవినీతి డిఫాల్టు
అన్యాయాక్రమాలు డౌనులోడులు
అవినీతన్నదే లేనినాడు రాజకీయానికి
అస్తిత్వం లేదు....మనం ఒప్పుకోము

బురదగుంట బురదగుంట అంటూనే
మనమే దానిని రొచ్చుగుంటను చేస్తున్నాం
పొరపాటున నీతిమంతులీ రంగాన కాలిడీతే
బురదలోకి లాగుతున్నాం లేదంటే
శంకరగిరి మాన్యాలకు పంపేస్తున్నాం

ఐదు నిమిషాలైనా ఆలోచించి వేసే
ఓటు కావాలి ...అది అవినీతికి వేటు....
కాని ఆలోచిస్తున్నామా మనం!!
లేదే....,,మనకంత తీరికెక్కడిది!

మనఓటు కాకూడదు అపాత్రదానం
ఉందా యెవరికైనా ఈ మాత్రపు జ్ఞానం
వేసే ప్రతీఓటూ అర్హత నెరుగని అర్భకునికైతే
అది అపాత్రత కాకుంటే పాత్రతెలా అవుతుంది?

ఉచితంగా నువ్వేయాల్సిన ఓటుకే
నోటునాశిస్తుంటే.... అవినీతి కి
ఆరంభమదే......
మూలంలోనే నీతి మృగ్యమైతే  ఇంకా
అవినీతి అంటూ ప్రేలాపన లెందుకో!!

ఏనేత చరిత్ర చూసినా యేమున్నది
గర్వకారణం
అడుగడుగున అవినీతి అక్రమాల
సంచితం
యెందెందు వెదకి చూచిన అందందే
గలరు
అవినీతి పరాక్రమ వీరాగ్రేసాసురులు

నీతి నీతి అనుచు నీవు
అవమానించకు.........
ఈ రాజకీయ వ్యవస్థని

ఓటునమ్ముకున్న నాడే
ఊడెను నీకా అధికారం 

భ్రష్టుపట్టిన వ్యవస్థకు
ఫస్టు కారణమే.... నీవు


వనిత విశ్వరూపం

వనిత విశ్వరూపం

నవతరానికి నాందియై
భావి తరాలకు పునాదియై
నవ జీవన శకానికి ప్రాణాలూదే
మమతాను రాగాల మూలవిరాట్టుయై
త్యాగానికి చిరునామాగా నిలిచే
అపర దైవ స్వరూపం అతివ స్వరూపం

నవ జీవన రూపకల్పనా క్షేత్రమై
జీవామృత సుధా రసధారా విలాసమై
మమతానురాగాంకుర ప్రదీపమై
త్యాగానికీ పర్యాయ పదమై
దైవానికి ప్రతి రూపమై
ఇలలో వెలసిన దివ్య స్వరూపం
ఇంతి స్వరూపం

అమ్మదనం లోని మాధుర్య మకరందపు
కమ్మదనాన్ని పంచే అమృత వాహిని
అనురాగ జలధిలో ఓలలాడించి
ఆప్యాయతానురాగాలను నేర్పే అక్షయప్రదీప్తి
సృష్టికే అమరత్వాన్నందించి సకల చరాచర
సృష్టి జీవన గమనానికి ప్రాణదాత ఈ ప్రణవ మూర్తి

Friday, 12 June 2015

మదిలో వెలిగే దేవుడు

మదిలొ నిలిచిన దేవుడు

నాన్నా!
నాలోని నా అన్న వ్యక్తిత్వాన్ని
పెంచేవాడవనే కదా నిన్ను నాన్నా
అని పిలిచింది

ప్రతీ మనిషికి అమ్మ
దేవత నాన్న దేవుడు
ప్రాణి పుట్టుకకి అమ్మ
క్షేత్రమైతె నాన్న బీజం
బీజమే లేని ఏ క్షేత్రం
ఫలించదు కదా నాన్నా!

అమ్మ పదినెలలు కడుపులో
పెట్టుకు కాపాడితే
నువ్ జీవితమంతా భుజాలపై
మోస్తూ కంటిపాపలా కాపాడావే
నీ యెదపై భారమైనా
యేనాడూ అలసటన్నది
నీదరికీ రానీయనే లేదే

నా పొట్ట నింపడానికి 
ఆరాటపడేది అమ్మైతే
నలుగురి పొట్టలు నింపగలిగే
శక్తీనీ నాకిచ్చే యత్నానికే గా నువ్
తాపత్రయ పడింది

భగవంతుడిచ్చినవి మాకు రెండైతే
మూడోకన్నునిచ్చిందీ నీవుకాదా
దేవుడిచ్చినవి రెండూ అమ్మానాన్న
లైతే నువ్వించిన అదృష్యాక్షువు
జ్ఞానం కాదా నాన్నా!!

నాన్నా! ప్రత్వక్ష దైవానివై
నా రూపానికి మనసుకు
మూలకారకునివై అనుక్షణం
నాయెదుగుదలకు హార్మ్యానివై
కనుసైగలతో మము నడిపించావ్

నీ చేతి స్పర్షచాలు ఈ విశ్వాన్నే
జయించే విశ్వాసం....
నీ పలుకు చాలు అఖండ సామ్రాజ్యాన్ని
జయించగల నవొత్తేజాంకుర భావం

నీవు మము వీడిపోయావని
అందరూ అంటున్నా
యెక్కడికీ వెళ్ళలేదని
వెళ్ళలేవని నామనసుకు
తెలుసు
నామది జ్ఞాపకాల దొంతరవై
హృదయ తరంగ రవళివై
నా ప్రతి కదలికకూ రక్షవై
నా భవితకు సోపానానివై
నిలిచివున్నావని లొకానికి
యెలుగెత్తి చాటాలనుంది

నువ్వు మము వీడి వెళ్ళావు నువ్వు
నువ్వు తప్ప తక్కినవన్ని వున్నాయ్ !
కానీ నీకక్కడ యెవరున్నారు నాన్నా
ఒంటరివై యెంతటి క్షొభననుభ విస్తున్నావో!!

నువ్వున్నన్నాళ్ళు మా కళ్ళని
చెమర్చనీయనే లేదు
నువులేని నేడు కంటిలో చెమ్మ
ఆగడమే లేదు
కొండంత అండను కోల్పోయి
దిక్కులేని పక్షులమే అయినా
నువ్ నేర్పిన సంస్కారం నీవిచ్చిన
ఆత్మస్థైర్యం మాకు యెల్లకాలం రక్ష.



Thursday, 11 June 2015

పోతుటీగలున్నాయ్ జాగ్రత్త

పోతుటీగలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త

మమతల మాగాణిలో విరబూసిన
పరిపుష్ఠ మకరంద మందారాలను
గాంచి, మధుర మకరందాన్ని గ్రోల వచ్చె
కొదమతేటులెన్నో...యెన్నెన్నో.........

బంబరాల భ్రమరనాదాలు
సప్తస్వరాల నొలికిస్తూ
మైమరపిస్తాయి.......
రకరకాల విన్యాసాలతో
నిను పరవశింప జేసి
మత్తులో ముంచెత్తుతాయ్ ...
విరులనితమ మధురనాదాలతో
మురిపించి మైమరపించి
మకరంద స్వాదనానంతరం
నినువీడి మరో సుమానికై
వెదుకుతూ  సాగిపోయే
పోతుటీగ లెన్నో .......యెన్నెన్నో......

కుసుమ కోమలమైన పుష్ప
రాజములారా! పూబంతులారా!!
తస్మాత్ జాగ్రతో జాగ్రతా!!

పైపై మెరుగులు మత్తుగొలపే మాటలు
మేకవన్నె పులులు మేధినిపై కోకొల్లలు
కాలికి గాయమైతే మందుపూయను వచ్చు
గాయాన్ని మాన్పనూ వచ్చు.....
మనసుకే గాయమైతే మానిపే మందేది?
బతుకుకే చిల్లు పడితే పూడ్చే మాకేది?

పైపై మెరుగులు కాదు ....
దేవుడిచ్చిన ఆకారం కంటే
సాధనచే సాధించుకున్న సంస్కారం సద్గుణాల కాంచు
అంది పుచ్చుకున్న ఆ  కరం  ఆసాంతం తోడుగా
వుండేలా గమనించు...హృదయాన్నే పరికించూ

అస్తమించిన అమ్మానాన్నలకో లేఖ

అస్తమించిన అమ్మా నాన్నలకో లేఖ

ఓ అమ్మా! ఓ నాన్నా!!

బ్రతికున్నన్నాళ్ళు
పలకరించని వాడు
ఇప్పుడీ ఉత్తరం రాయడమేంటనీ
ఆశ్చర్యమా?

నేనానాడు మిమ్మెల్నెంత
అనాదరించానో
నాకీనాడే అర్థమైంది,
తప్పుతెలుసుకుని
మీ పాదాలపైబడి
ప్రాయశ్చిత్తం చేసుకోవాలని
ఉన్నా నాకందనంత దూరంలో వున్నారే!!

ఒక్క సారి మీ ఒడిలొ
తలవాల్చి బోరుమని
ఏడవాలని వుంది
నాకన్నుల్లోంచి వచ్చే
పశ్చాత్తాపాశ్రువులతో
మీ పాదాలను కడిగీ
ఆనీటినీ తలపై జల్లుకోవాలనీ వుంది.......

జ్ఞానమనే  ముసుగును
కప్పుకున్న అజ్ఞానిని
అద్దంలాంటి మీ మనసుల్లొ
నన్ను నేను చూసుకుని
మీరే అజ్ఞానులని భావించిన అహంభావిని నేను

అనుభవాల పొత్తాలైన
మీ మంచి మాటలని
చాదస్తాలని యెగతాళి
చేసిన అవివేకిని నేను

నా భార్యా బిడ్డలే
నా లోకమని మీరంతా
వయసుడిగిన
అక్కరకురాని వృద్ధ జీవులని
అడుగడుగునా కించపరచిన
కిరాతకుడిని నేను

ఏ ఒక్క నాడూ మీతో
నవ్వుతూ   మాటాడలేదు
ఏ ఒక్క నిర్ణయాన్నీ మీతో
చర్చించి గైకొనలేదు
ఏ ఒక్కనాడూ మీతో కలిసి
భోజనమూ చేయలేదు

మీరిచ్చినదే ఈ జన్మని మరిచి....
మీరు యిప్పించిన జ్ఞానాన్ని విడిచి..
.మీరు నేర్పించిన సంస్కారాన్నీ కాదని
యౌవనపు కోరికల బందీనై.........

మీకిష్టం లేని ప్రేమవివాహం చేసుకుని
మిమ్మల్నే శత్రువులుగా భావించి
అనుక్షణం ద్వేషించాను... నాసుఖం
కోరేమీరు నా పెండ్లిననుమతించి కోడలిని
ఆశీర్వదించిన నాడు అవమానించాను.

నాకొరకు నా భార్యను
కొడలిగా స్వాగతించారు
అభిమానించారు ఆదరించారు

యెక్కడా దిక్కులెక దిగివచ్చారని
తూ  లనాడాను
అమ్మానాన్నలన్న ఇంగితాన్ని
మరిచాను...
మీ మనో వేదన గూర్చి ఆలొచించని
పెను రాయినయ్యాను
పశువునయ్యాను.....

చరిత్ర పునరావృతమౌతుంది
భూమి గుండ్రంగా వుండి తన
చుట్టు తానే తిరుగుతుంది.కదూ!

నా కొడుకులూ కోడళ్ళు మము
నిర్లక్ష్యం చేస్తుంటే.... నా మనసు
పడుతున్న ఆవేదనలొ
జ్ఞానోదయమైంది
నేనూ మిమ్మల్నెంత అవమానించానో

మేడలడగ లేదు మీకున్నదే మాకిచ్చారు
మూటలడగ లేదు మీ సంపాదనే నాకిచ్చారు
కేవలం ప్రేమ పంచమన్నారు
మనిషిగా చూడమన్నారు

ఆనాడా మాటల విలువ నెరగలేదు
కాని తెలివొచ్చేసరికి అంతా అయిపోయింది
పశ్చాత్తాపంతో కుములుతున్నా....

అమ్మా ! నాన్నా!! క్షమించమని అడిగే
అర్హతను సైతం కోల్పోయిన దుర్మార్గున్ని
అమృతమయమైన మీ మనసుతో క్షమించరూ!

కొడుకుల ప్రవర్తన చూసి బుద్ధి
తెచ్చుకోకండనీ ఈ తరానికీ చెబుతున్నా
మీరూ మారండీ అమ్మా నాన్నల్ని
గౌరవిస్తేనే మీ పిల్లలు మిమ్మూ
ప్రేమిస్తారని గుర్తుంచుకొండనీ
చెబుతున్నానమ్మా ఇదే నేను
మీపట్ల ఒనరించిన పాపానికి
ప్రాయశ్చిత్తం అమ్మా! నాన్నా!

వివక్షలేని లోకాలకై

వివక్ష లేని లొకాలకై అణ్వేషిస్తున్నా!!

వ్యధాభరితమై  బాధాతప్తమై
భావాభావమై ఎడారిగా మారిన
నా ఎదలోకి సైమానువై
ప్రవేశించావు ప్రేమ ఊసులతో

వ్యధలను సమాధి చేసి కరుణ వర్షాన్ని
కురిపించి, నిర్భావ ఎడారినే
అనంతభావాల ప్రేమ
సాగరంగా మార్చావు

ఘనీభవించి నిశ్చలమైన
భావపాషాణాన్ని నీ అమృత వాక్కులతో
కరిగించి ద్రవింప జేసావు.........

భావవాహినీ తరంగాలు
ఎగసిపడుతున్న నా హృదయ
సాగరంలో ప్రేమ సునామీనే
సృష్టించావు

ఎగసిపడే
ఆ ప్రేమతరంగాలలో
తడిసీ ముద్దయ్యాను

ఓ సఖీ!!

జీవచ్ఛవాన్ని స్పృషించి
పునరుజ్జీవితున్ని జేసి
కనపడకుండా పోయావు

అనంత వాహినీ కెరటాల ఝరులకి
తట్టుకోలేక కొట్టుకు పోతున్న నేను
నీ ఆసరాకై చేయి జాపుతున్నా.......
నిర్దయగా చూస్తున్నావే తప్ప
నాచేయి నందుకొని నన్ను కాపాడవెందుకు

కుల మత జాతీ వివక్షలే
నను నీ నుండి వేరుచేస్తే
ఈ అనంతాంతరాలున్న
అనంత విశ్వాన్నే నేను
బహిష్కరిస్తున్నా....
ఈ వివక్షలే లేని లోకాలకు
పయనమౌతున్నా
ఉన్నదో లేదో తెలియని
మరోజన్మలో నీకై వేచివుంటా

Wednesday, 10 June 2015

మత్తు వదలరా! నిద్దుర మత్తువదలరా!!

మత్తు వదలరా నిద్దురమత్తు వదలరా!

ప్రభాత వీచికలు మీటిన
మౌన విపంచి కమరిన
మయూఖ తంత్రుల మౌన
రాగాలకనుగుణంగా కువకువ
రాగాలతో జగతిని జాగృత
మొనరించాలని తహతహలతో
తమ శక్తికి మించి యత్నిస్తున్నాయ్
పక్షిరాజులు.....

తమకంతో తమను తాము మరచిన
అండజాల ఆలాపనలు అర్థంలేని
భూపాల రాగాలై గాలిలో కలిసి
పోతూ నే వున్నాయ్ .....,,,
బలిసిన వాడి పాదాల కింద
నలిగే అన్నార్థుల ఆక్రందనలా

ఆకటి కోసం అలమటించె
బడుగు జీవులు భానుని కంటే
ముందే బద్దకాన్ని వీడి పనుల్లో
పడిపోయారు....జానెడుదరాన్ని
నింపే ధ్యాసతో....పిడికెడు పిట్టల
మేలుకొలుపులపై ఆధారపడకుండానే....

వారసత్వమో! అన్యాయార్జితమో!
మితిమీరిన సంపద బహూకరించిన
అజీర్తి రోగంతో అలమటించే
ఆదివిష్ణు హృదయ సామ్రాజ్య
మహారాజ్ఞి  ఇష్టసుతులు
మద్యపుమత్తూ   నిద్రమత్తునుండి
ఇంకా  తేరుకోనేలేదు.....,,,,

శీతొష్ణానిల చిరుచీకటి ముసిరిన
అద్దాల సౌదంలో....శేషతల్పాన్ని
తలదన్నే హంసతూ లికా తల్ప సమ
విలాసవంతమైన పానుపు పై తమ
గురకలే తమకు జోలపాడుతుంటే
ఆ మాధుర్యాన్నాస్వాదిస్తూ
నిద్రిస్తున్న సుసంపన్నుల చెవికి
విహంగాల సుప్రభాత గీతికలు గానీ
బాల భానుని కవోష్ణ కిరణాలుగాని
చేరలేవు ....వాటికా ధైర్యమూ లేదు

ఎవడాకలి చావు చచ్చినా
ఎవడప్పుల బాధకు పోయినా
ఏ అబల పురుషుని కామాగ్నులకు
బలైతేనేం...,,ఏ కోడలు అత్తల ఆరళ్ళకు
ఆరిపోతేనేం.,,,ఏ నిరుద్యోగి విసిగి
వేసారి పోయినా

సమస్యల వలయంలో మానవాళి
సతమతమౌతున్నా....పట్టించుకునే
తీరిక మెలకువ లేని ఓ స్థిత ప్రజ్ఞుడా!!
మేలుకో ! కొట్టుమిట్టాడే దీనుల నాదుకో

ఇనుప బీరువాలలో దాచిన ధనాన్ని
అప్పనంగా అందరికీ పంచబోకు
ఆ నల్లధనాన్ని శ్వేతవర్ణానికి మార్చు
కార్ఖానాల నెలకొల్పి ఉద్యోగావకాశాలు
కల్పించు.... నీవింకా ధనాన్నార్జించు
ఎండె డొక్కల కింత కూడు కల్పించు
వ్యర్థమౌతున్న శ్రామిక శక్తికి పనికల్పించు

నీవు తినడమే కాదు నీ సాటివారికి తిండి నిప్పించు
అందుకు సమర్థుడవని నిన్ను నీవు తెలుసుకో
సమసమాజ నీర్మాణానికీ ఆద్యుడవీవే కావాలి
మానవసేవలొనె పరమార్థముందని తలుసుకో!!