Friday, 22 May 2015

ఋతుచక్రం

తెచ్చువసంతమున్ పిదప తిగ్మకరంబగు గ్రీష్మమా  తరిన్
వచ్చును నిండు హర్షముల వర్షములిచ్చెడి కాలమా పయిన్
స్వచ్ఛత కూర్చు కౌముదుల శారదరాత్రుల కాంతి కాలమున్
వచ్చు తుషార బిందు హిమపాతము పై శిశిరంబు తోడుగన్  

Sunday, 3 May 2015

మానవ మేధస్సుకందనిదిదే సుమా!

కన్నులతో కాంచిన దృశ్యం
కలతలనేసృష్టిస్తుంటే
కలకలమై గెండెన లోతున
కలవరమై విజృంభిస్తే

కనుకొలుకుల నిలిచిన అశృవు
ఆణిముత్యమై మిలమిల మెరిసి
చెంపలపై జాలువారుతూ
మరకలుగా మిగిలే పోతే

గరిటెడు నీరే మరకలు తుడిచే
అద్దెకుతెచ్చిన ఆనందాల
చిరుచిరు కాంతుల
కృత్రిమ వెలుగులు

అంతరాలలో తనలో తననే
సమాధిచేసిన సామాన్యున్ని
అంచనా వేసె కొలమానాల్లేక
కూలి పోయెగా మానవమేధ

అంతరిక్షపు నౌకను కనుగొని
అఖండులమన్నా మేధావుల్లారా
మానవాంతరాలలో జరిగే మథనం
ఆవిష్కరించగల మొనగాడెవ్వడు?

ప్రభూ! నా మొరనాలకించవా!!

అమ్మ అంటే నాకిష్టం
అమ్మ భాషంటే మరీ ఇష్టం
అమృత తుల్యమైన వాక్సాగరాన
పదతరంగాల పదనిసలతో
భావవాహినీ ఆటుపోట్లతో ఊగిసలాడుతూ
కవితా వ్యసంగమనే నా నావ
ముందు ముందుకు కదులు తుంటే
ఏ సుదూర తీరాలకో చేరాలని లేదు
ఈ సాగరమధ్యమాన నా నావతోసహా
మునిగి పోవాలనుంది....

ఓ భగవంతుడా...
నీ అస్తిత్వమే నిజమైతే
నా భాషాప్రియత్వమే వాస్తవమైతే
ఓ చేతిలో కలం మరో చేతిలో కాగితం
భావాలలో నూతనత్వం మలయానిలమై
వీస్తున్న వేళ
నన్ను నీ లోకానిక్ తీసుకొని పో...

పుట్టిన నాడే కవిత్వం చెప్పగల ధీరత్వం ఎలాగూ లేదు
కనీసం చావైనా కవిత్వాన్ని రాస్తూ రాస్తూ
చావాలన్న నా కాంక్షని తీర్చవా ప్రభూ!....


కవి హృదయం

నా యదలో చెలరేగే భావావేశానికి
అక్షరరూపం ఇవ్వాలను కున్నా.....
కలంకదలదు.... అక్షరం రాలదు
యదలోని భావాలు మదిలోనే
సుశుప్తావస్తలో మాగన్నుగా నిద్రిస్తున్నాయ్........

నా ఆలోచనా తరంగాలు మాత్రం
సాగరకెరటాలకంటే వేగంగా
ఉవ్వెత్తున ఎగసిపడుతూనే ఉన్నాయ్.....కానీ,,,,

ఆలోచనలకొక రూపం ఉంటేనా
భావావేశానికొక ఆకారం రావడానికి
దృశ్యం వెనుక దృశ్యం మంచితనాల అదృశ్యం
మనోఫలకంపై మంచితనానికి సమాధి దృశ్యం

ఆకలిచే అలమటించు అన్నర్థుల పొట్టలపై
తండరగని బలవంతుడి బలిసిన పాదం
బాధాతప్త హృదయంతో చావుకేక వేయకుండ
కావెక్కిన రూపాయ్ నోటుతొ గొంతునొక్కే వింతదృశ్యం
మతమౌఢ్యం గోడలుగా కులతత్వం ఊచలుగా
బందిఖానా నిర్మించి బలహీనుల బందించి
స్వేచ్చా విహంగమై వికట్టాట్టహాసం చేయు
స్వార్థపరుల చేతులకే స్వర్ణకంకణాలయ్యే

గుమ్మికింద పందికొక్కు గుమ్మిలోన కందిపప్పు గమ్మున మేసేసి గుమ్మిని ఖాళీసేసి
ముసి ముసి నవ్వులతో మూతులనేతుడుచుకునెడు బలిసిన పందుల గాంచగ భగ భగ యదనే మండగ
పదం పదం కూర్చి నేను ప్రతిఘటించ యత్నిస్తే
కదలదాయె కలమెంతకు....
అడుగడుగున అన్యాయం అధికారిక ముద్రతోడ
ఇంతింతై వటుడింతై చందంబున పెరిగినట్టి
అన్యాయమే న్యాయమయ్యె
పదవినడ్డు పెట్టుకొన్న దొంగకేమొ జైళ్ళల్లో
ప్రత్యేకమైన గదులాయే పట్టెమంచాలాయె
కూటికొరకు జేబుకొట్టూ దొంగకేమొ శిక్షలాయె
యాడున్నది సమానత్వం సమ సమానత్వం

మమ్ము మరచావా బాపూ

బాపు నీ చిత్రాలే మా
యదలోని బాధలు బాపు

ఇక నీవు లేవని తెలిసి నా కంట
వర్షించిన అశ్రుధారల ను తుడిచే
వారెవరూ  లేరయ్యే !

ఇక అందాలొలికే అచ్చ తెనుగు
కొమ్మల బొమ్మలు
అద్భుతమైన కార్టూ నులను
రమణీయ కళాఖండాలైన
తెలుగు చిత్రాలను కాంచగలమా

మీ ఒక్క స్నేహితుని ఎడబాటు ని తట్టుకోలేకఅతన్ని వెతుక్కుంటూ
వెళ్ళావే....మరి ఇక్కడ ఇంతమంది
నిన్ను కోరుకునే నీ స్నేహితుల
హృదయాల్లొ విషాదాన్ని నింపావే
ఇది న్యాయమా ప్రియ నేస్తమా? 

Saturday, 2 May 2015

ఆఖరి ప్రేమలేఖ

[అర్థాంతరంగా కనుమూసిన ఓ ప్రియుడు చనిపోయేముందు తన ప్రియురాలికి రాసిన చిట్టచివరి లేఖ]

ఓ ప్రియా..........

కనులముందు కదలాడే నేను
కల్లనై పోయానని కలతచెందకు
చల్లనైన నీ యదగదిలో శాశ్వతమై
నీ మదిలో నిల్చిపోనా తరం తరం

మరువబోకు జీవితాంతం
నీ హృదిలో ఉంటా కాంతినై
నీ కనులముందు నేనొక భ్రాంతినై
సుధారసంతో తొణికిసలాడే
నీ అధరామృతాన్నిగ్రోలిన నాకు
మరణమేల దరి చేరగవచ్చు
మరణానికె మరణంబొచ్చు
నే లేనను మాటను వీడు
నీ మదిలో నిల్చితి చూడు
బాహ్యంగా కానరాకున్నా
నీ కన్నుల్లో నేనే లేనా

నాకొరకై విలపించకు
నను జేరగ యత్నించకు
నా ఆశల పల్లకివై నా కోసం
నీ జీవన యానం సాగించు

Friday, 1 May 2015

ప్రణయం

నీ యద పై  నా ఊసులు
నడయాడుచు నీయదలో
గీలిగింతలు కలిగించక మానునా
ప్రతి పదము విరిబాణము
యదనాటక వీడునా

ఓ నా నీలవేణీ నీ మదీలో
నా రూపము కనుపాపలొ
నా బింబము కాంచినానని
పొంగి పోయితి

అడ్డు తెరలను
త్రెంచు కొనుచు
అరమరికల
తృంచుకొనుచు
సాగిపోవలే
స్వర్గ  పథముకు