Saturday 12 April 2014

వసంతగానం

                                                                   వసంత గానం
                                                                              విరించి

శీతలా నిలముల శిశిరంబు మరుగాయే
                        మండు వేసంగియే మరలి వచ్చె
అభిసారికై ధాత్రి అందాల ప్రియుడైన
                        వరుణు కై వేచియే వ్రయ్యలయ్యె
కొదమ తేటుల ధాటు మధువు నన్వేషింప
                        పూదోట దిరుగంగ పూవు పూవు
బంబరంబుల పక్ష భ్రమర నాదాలతో
                       భూపాల రాగాలు పోటులెత్తె
       భాను తప్త మైన వాయువుల్ చెలరేగి
       వేడి వడిన వీచు వేళ ఇదియె
       వసుధ నే రమింప వడగండ్ల వానయై
       వరుణ దేవు డిలకు వచ్చు నిపుడు
నిరుడు కూసిన పిట్ట సరిగమ రాగాల
                     తిరిగి యాలాపించు వేళ ఇదియె
నవ పల్లవంబుల నవ నవోణ్ మేషంబు
                     నేలనే మురిపించు వేళ ఇదియె
ఖగ జాతి కువ కువల్ కమనీయ దృశ్యాల్
                     మేళవింపుల మేటి వేళ ఇదియె
మంచు తెరల్ తొల్గి మరులు గొల్పెడు రీతి
                    కౌముదుల్ విరిసేటి కాలమిదియె
          పడతి తనువు జేరు పరువాల వాలేను
          వంపు సోంపు లన్ని వసుధకమరి
          కులుకు లీనుచుండె కువలయ మీవేళ
          మదిని దోచు మాస మాగ మించె


పల్ల వించిన నవ పల్లవంబుల చేత
          పాదపముల శోభ పరిడ విల్లె
విరియ కాసిన ఫల బరువుచే మావిళ్ళు
          నిండు చూలాలున్న నెలత లయ్యె
పూప పల్లవముల పొట్టార భుజియింప
           కలకంటి కంటాన కలిమి నిండె
మురిపాన గళమెత్తి మోహన రాగాన
           స్వాగాతాల్ పల్కె వసంతమునకు


           పులుగు పాటతోడ పులకరించిన నీవు
           వసుధ మురియు నిండు వర్ష మిచ్చి
           పాడి పంటల నిచ్చి పసిడి రాశుల నిచ్చి
           శాంతి నొసగు మో వసంత కాంత   
            
 

No comments:

Post a Comment