Tuesday 20 June 2023

నియంత

 .                       నియంత 

.                        (విరించి)


ఏకచ్ఛత్రాధి పతిగా 

లోకాలనేనలాలను కున్నాడేమో!

భారత రాజకీయనాయకుల

కుటిల కుతంత్రపు టెత్తుగడలను 

బాగానే ఆకళింపు చేసుకున్నాడు


తానేం చేసినా తానుచితంగా అందించే

ఉష్ణరాశికి, పాదపములకందించే 

పత్రహరితానికి, సౌరశక్తికి మురిసిపోయే

అమాయకులు తన ధాష్టికాన్ని గుర్తించరని

తలపోసాడేమో.....


తన శక్తిని తగ్గించి తొలకరితో ఆరంభమై

జనాలకు హర్షాన్ని కూర్చే వర్షాలను

కురిపించి జనామోదాన్ని పొందుతాడేమో

నని వరుణున్నెక్కడో బంధించేసాడు


బల్లిదులై సామూహికంగా తనచుట్టు చేరి

తనని శక్తిహీనున్ని చేసి తమ ప్రతాపాన్ని

చూపించే జలధరాలనుా పారిపోయేలా చేసాడు


ఇక తనకెవరు ఎదురులేరని

చండప్రచండుడై నిప్పులు చెరుగుచూ

ధరనేలుతున్నాడు

భూ అంతర్జలాలను మూడోకంటివాడికి

సైతము తెలియకుండా జుర్రుకుంటున్నాడు

తనతాపానికి వడదెబ్బసోకి ప్రాణాలు

కోల్పోతున్నా తానిచ్చే ఉచితాలకు 

బానిసలైన జనాలు మౌనంగా 

భరిస్తున్నారేకాని నోరెత్తి ప్రశ్నించరు

ప్రశ్నిస్తే కనుమరుగవుతామని 

తెలుసుకదా! ...... 


కశ్యపాత్మజుడని ప్రత్యక్షనారాయణుడని

ఆనాటినుండి తనకున్న ప్రఖ్యాతిని

అలుసుగా తీసుకొని ఈనాడొక నియంతగా

మారి లోకాన్ని తన తీక్ష్ణ మయూఖాలతో 

కాలంగాని కాలంలోనూ బాధిస్తున్నాడు

సప్తాశ్వరథారూఢుడు.


Saturday 17 June 2023

కరుణించు కంధరమా

             కరుణించు కంధరమా

.                       (విరించి) 


తొలకరి పలకరింపగ
పులకించిన పుడమితల్లి
పరిమళ తావులీనెడి 
తరుణము కొరకై వేచిన
హాలికుల యాశలన్నియు
యడియాశలు చేయుచున్న
యంబరవీధిని దాగిన
యంభోదములవిగో
యులకక పలకక
ఉరుములు మెరుపుల ఊసెత్తక
రెట్టించిన ఉత్సాహముతో 
ప్రచండుడై రేగుచున్న
రాగుడి ప్రతాపాగ్నికి
ఆజ్యంపోస్తూ ... తన కర్తవ్యాన్ని
మరచిపోయిన మేఘాల్లారా!
కదనోత్సాహము చూపుచు 
కణకణలాడే కాంకుని జోరు
తగ్గించుచు మీకే తెలియని
మీ శక్తి సామర్థ్యాలను 
వెలికితీసి ....
ఎండి బీటలు బారుతున్న 
ధరణీతలముపై 
హర్షము నిచ్చే వర్షపు నీటి
కళ్ళాపి జల్లగ కురియవెందుకు?
వేదనతో నీ కరుణని కురిపించమని
వేడుకునే హాలికుల వ్యధను బాపవెందుకు?

Thursday 30 March 2023

శ్రీరామనవమి శుభాకాంక్షలు

 .                    *సుప్రభాతం*


. *శ్రీ రామనవమిశుభాకాంక్షలు*


ఆకాశమంత పందిరి

భూలోకమే పీటగా సేసి

భక్తజనాల మనోభావనే

పవిత్రాక్షతలు గా జేసి

వేదపండితుల గళాలు

వేదపనసలు ఘోషిస్తుంటే


భువనైక మోహనుడు

జగదేక మాత కరగ్రహణం

చేసెడు వేళ.........


జగన్మోహన జంట కళ్యాణాన్ని

కన్నులారా చూసినవారిదే

అసలు సిసలైన భాగ్యమని

ఆ భాగ్యాన్ని తానూ సొంతం

చేసుకోవడానికి

తన వంశోన్నతికి మూల పురుషుడైన

ఇనకుల తిలకుడు పరమ

మర్యాద పురుషోత్తముని

పెండ్లిని తిలకించాలని

వచ్చేస్తున్నాడినుడు.


మిత్రమా.....ఉదయించే

ఆ భానున్ని తిలకించుమా.....

నీకిదే *శుభోదయం*


నేస్తమా...నీకూ  *శ్రీ రామ నవమి శుభాకాంక్షలు*

......  ......  ......  .........  ... విరించి 


శుభోదయం

 🌸🌸🌸🌸  శుభోదయం  🌸🌸🌸🌸     


  

నీరజ బంధువాతడు దినేంద్రుడు తానొక యేక చక్రమున్ 

వారము లేడుగాగలుగు వాహ్యమనూరుడు తోలుచుండగా

చేరును ప్రాగ్దిశాద్రులని క్షేమమొసంగెడి వాని రాకకై

వారిజముల్ ద్విపక్షములు పారగతుండ్రును వేచి రెల్లరుల్.        1.


కోటి శరముల దాల్చిన కుతపు డిపుడె

రక్తవర్ణపు పీతాంబ రమును గట్టి

శక్రదిశనుదయించె కింజల్కమందు

మేలుకొనుమింక దినమంత మేలు కలుగు.  2



🌺🌺🌺🌺శుభోదయం 🌺🌺🌺🌺 

శుభోదయం

 ........ 🌺🌅 *శుభోదయం* 🌅🌺 ......


ధారుణి గర్భవాసమున దాగిన భానుని రమ్మటంచు నా

సారస జాతి యంఘ్రియపు శాఖల జేరుచు బిల్చినంతనే 

తూరుపు కొండనెక్కి రవి ద్యోతక మందుచు నుద్భవించె   తా

బేరిమి వీడకుండ భువి వెల్గుల నింపెడు చిత్తమందునన్  


చీకటదియె తొలగె చిరుకాంతి యేజేరె 

పద్మములవి విరిసె పపినిగాంచి

నిదుర వీడుమికను నీకు శుభోదయ

మంచు తెలుపుచుంటి నంటు వనుచు


 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺         

Tuesday 14 March 2023

నాటునాటు ఆస్కారు

 ఘనుడు చంద్రబోసు రచించె కవనమదియె

కీరవాణి యందింప సంగీతమునకు

రామ్ చరణ్ నందమూరియె రమ్యముగను

గెంతు లేసిన పాటయే గెలిచె నేడు

నుత్తమమగు నాస్కారు నీ యుర్వియందు.


పేటపేటను మారు మ్రోగుచు విశ్వమందున గాంచగన్  

నాటునాటను పాటయే కద నాణ్యమై యిల వెల్గెరా

సాటిలేనిది మేటి యంచును సన్నుతింపగ లోకులే 

తేటతెన్గుకు నిట్టిపాటయె తెచ్చెకీర్తిని గాంచరా!!


నాటు నాటంటు పాడిన పాటజూచి

పెదవి విరిచిరి నాడేమొ విజ్ఞులెల్ల

నదియె సాధించె నాస్కారు నద్భుతముగ

తెలుగు పాటకదియె తెచ్చె వెలుగు నిజము.


Monday 6 March 2023

అమృతవాహిని

 🌹🌹🌹 అమృత వాహినీ 🌹🌹🌹    .           ..                                 (విరించి) 


ఆడది అంటే అమ్మతనానికి చిరునామా

అమృత వాహినీ ఉత్తంబిత తరంగమే అమ్మ


రేపటి తరానికి ఊపిరినందించే

ఉదాత్త రూపమే అమ్మ


అనుగ్రహించడమే తప్ప ఆగ్రహించడ 

మెరుగని అనురాగమూర్తి అమ్మ 


ఎక్కడో పుట్టి మరెక్కడో మెట్టి

రెండుకుటుంబాల శ్రేయోద్ధతికై ఆరాటపడే

యొంటరిజీవి అమ్మ


యుగానికొక్కటి చొప్పననానాడు

ఆదివిష్ణు వవతారెలెత్తాడేమో కాని

ఒకేకాలంలో ననేక యవతారము లెత్తగల

మహిమాన్వితమూర్తి స్వరూపమే

మాతృస్వరూపము


తొలిగురువై వాక్కునందించే వాగ్దేవి యామెయే

ఆకలి వేళ ప్రేమామృతాన్ని రంగరించి

గోటిముద్దలునోటి కందించి ఆకలి తీర్చే 

అన్నపూర్ణ 


భావిపౌరుల భవిష్యన్నిర్మాణానికై 

అణువణువు శక్తిని ధారపోసే శక్తిస్వరూపిణి


అలసి వచ్చిన పతిని సేవించి

సేదతీర్చి ఆనందడోలికలలో 

నోలలాడించే ప్రణయదేవత యామెయే


సంసార సాగరాన్నీదడంలో 

పెనిమిటికి తగు సహాయ సహకారాలందించే

బృహస్పతి స్వరూపమామెయే 


ఇంటెడు చాకిరీని విసుగనక చేసె 

విత్తమాశించని కట్టు బానిస యామెయే


కూర్మి వహించి అత్తమామలను

తల్లిదండ్రులుగా తలచి సేవించి ప్రేమానురాగాల

పంచు అపురూప మనస్కులూ ఆడవారే 


ఆడది లేని యిల్లు అడవితో సమానం 

అతివయె లేనినాడు అభివృద్ధియె శూన్యం

అతివ లేనినాడు అవని లేదు.


Sunday 5 March 2023

శుభోదయం

 🌅🌅🌅🌅  మేలుకొలుపు  🌅🌅🌅🌅



నేడు తానుదయింప నెత్తమ్మి విరివిందు

.               వ్రాలెనిన్ననె గాదె పశ్చిమాన


కంజహితుడు జేరు కాలమాసన్న మై 

.      యిరులు భీతిల్లుచు పరుగు లెత్తె


వెలుగు చీకటులట పెనుగులాడెనొ యేమొ

.         రోదోంతరమ్ముకె రుధిరమంటె 


తల్లిపాలకొరకు తర్ణికములరిసె 

.          మొగవాలమిట వేచె ముగ్గుకొరకు



భాస్కరునికంటె ముందుగ వాయసమ్మె

యీల వేసి ధరణినది మేలుకొలుప 

భంగ మయ్యె నిశ్శబ్దమే వసుధ యందు

కాల చక్రమాగక తాను కదలు చుండె.



🌺🌺🌺🌺  శుభోదయం 🌺🌺🌺🌺



Thursday 2 March 2023

నూత్న ఆంగ్ల సంవత్సర శుభోదయం 2023

 🌅🌅🌅🌅  *శుభోదయం*  🌅🌅🌅🌅



కలకలమును రేపి కన్నీరు కురిపించి

.          నట్టిఖలు కరోన నడ్డుకొనుచు


శోకముందీర్చుచు శుభముల నందించి

.           వెతల దీర్చినతల్లి వెడలి నేడు


కోటియాశల మూట కొంగుకు కట్టుకు

.           వచ్చిచేరెను నూత్న వత్సరమ్ము


ధరణినేలగ వచ్చె నిరువది మూడది

.            స్వాగతింప వలయు సంతసమున



క్రొత్త వత్సరమున కుంభినిన్ మేల్కొల్ప

నిరుటి భానుడేను తిరిగి వచ్చె

నిదుర వీడు మిదియె నీకు శుభోదయ

మనుచు తెలుపు చుంటి హార్దముగను.


🌺🌺🌺🌺  శుభోదయం 🌺🌺🌺🌺


2023 నూతన సంవత్సర శుభాకాంక్షలతో. ..,


.   ....    .....     ......     ......     మీ విరించి.


సంక్రాంతి శుభోదయం

 *సంక్రాంతిశుభాకాంక్షలతో శుభోదయం*




 మాసానికొకమారు వాసమున్ మార్చెడి

 .        కర్మపు సాకిరి కంజ హితుడు


 ధనుసు రాశిని వీడి ఘనముగా మకరమ్ము

 .       సంక్రమణము జేయు సంబరమున


 కోడికూయకముందె కోమలుల్ మేల్కొని

 .        సప్తసప్తిని తాము స్వాగతింప 


 ముంగిట ముత్యాల ముగ్గులన్ వేయుచున్

 .     గంగిరెద్దులనాట్య భంగిమలును 


 హరిలొరంగాయంచు హరిదాసు కీర్తనల్

 .        ద్రాపమున్ దాకు పతంగ ములును


 పట్టు వస్త్రాల రెపరెపల రవళులు

.      నింగిలో భాస్కరున్ నిదుర లేప       


  

  తే.గీ.    

 తూర్పు కొండల నెగబ్రాకి తొవలసూడు

 పౌరుషాగ్నుల విరజిమ్ము పందెములగు

 కోళ్ళ సంగరమును గాంచు కోర్కెతోడ

 కదలి వచ్చెనుచూడు సంక్రాంతి నాడు. 


( మీకూ మీ కుటుంబానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు)


నా తెలుగుభాష



 

శుభోదయం

 🌅🌅🌅🌅  *శుభోదయం*   🌅🌅🌅🌅


కువలయమ్మును మేలు కొలుప తానెంచుచున్ 

.           కోకిలమ్మలు పాడు కూజితముల


నాలకింపగనెంచి యాదిత్యుడె కదలి

.          యుదయాద్రి నెగబ్రాకి కదలివచ్చె


కళుకుల కోటితో గగనము కేతెంచె

.          డివముసూడును గాంచి యిరులు పారె 


నలుపు చీకటి తోడ వెలుగు తెలుపుకల్సి

.          రమణీయ వర్ణమున్ ఖము ధరించె 



ఇరుల ముద్దు లాడ నిచ్ఛతో నుదయాన

తూరుపు దిశ జేరె తొవలసూడు

చీకటమ్మ గాంచి సిగ్గిల్లు రీతిన

నెరుపు రంగు దాల్చి తరణి వచ్చె.

.         


🌺🌺🌺🌺  శుభోదయం 🌺🌺🌺🌺



Monday 27 February 2023

శుభోదయం

 🌅🌅🌅🌅  *శుభోదయం*   🌅🌅🌅🌅


ఆర్తితో కగరాశి యాదరమ్మున బిల్వ

.          నరుదెంచె భానుడే యిరుల ద్రుంచ


యందాల బాలుడై యానంద ముప్పొంగ

.          పూర్వాద్రులన్ జేరె పుడమినేల


కిరణాలె శరములై యురముఁ గ్రుచ్చినవేమొ 

.          గగనమే సిగ్గిల్లె కాంచరండి


సింధూర వర్ణమే చేరఁ నభమునకు

.        చీకట్లు భీతిల్లి చెదరి పోయె 


అంథకారమువిడనజ్ఞానమే తొల్గు

కాంతి రేఖ విరియు కాల మేను

నలుపు చెరగి పోయి తెలుపు వర్ణము నిండె 

నిన్న కరిగి పోయి నేడు చేరె.

  


🌺🌺🌺🌺  శుభోదయం 🌺🌺🌺🌺



శుభోదయం

 .           *శుభోదయం*


నల్లని సిగ్గుతెర కప్పుకుని

నిద్రిస్తున్న ధరణి అందాలను

కాంచాలనే కోరికతో కర్మసాక్షి

తూర్పు కొండల మాటునుంచి

తొంగిచూస్తుంటే .....


అతని కన్నులొలికే కాంతిరేఖలు

పుడమిని స్పృషిస్తున్న వేళ

గోరువెచ్చని యా వెలుగు సోకి

కొమ్మలలో నిద్రిస్తున్న పక్షులు

కువకువరాగాలతో గారాలుపోతున్నాయి


సెలయేరులలోని పద్మాలు

తమ ఆత్మీయుని కరస్పర్షకు

పులకించి తనువంతా విప్పుకుంటుంటే

పరాయిపురుషుని గాంచిన

కలువలు సిగ్గుతో ముడుచుకుంటున్నాయి.


మిత్రమా భిన్నవర్ణశోభితమై

విరాజిల్లే నింగి యందాలు చూడాలంటే 

నీ పద్మనయనాలని వికసించనీ

సకలశోభాయమానమౌ ప్రభాత

భాస్కరున్ని తిలకించ మేలుకోవేమి


నీకు నాకు సకల చరాచర జీవరాశికిదే కావాలి శుభోదయం.