Thursday 30 April 2015

సుప్రభాతం

సుప్రభాతం

బాల భానుడు కదిలి  పూర్వాద్రులే  దాటె
కెంజాయ వర్ణమె  గగనంబు  నిండె
వృక్ష  శాఖల లోన  పక్షిజాతులు చేరి

భూపాల రాగాన  సుప్రభాతము పాడె
మేలుకో మేలుకో  జగ మేలుకో వలెనింక   
నిదురెందుకో ...... మేలుకో జగమేలుకో

ఈ ఉషోదయంబే  నీకు నవోదయం
ఈ నవోదయంబే నీచు మహోదయం
మహోదయంబే కావాలి శుభోదయం

మిత్రులందరికి శుభోదయం

ప్రియతమా!

నా గుండె గదిలో గువ్వవు నీవై
నీ చరణ మంజీర మువ్వను నేనై
ఒదిగి పోదాము ఇద్దరం
కలకాలం ఒకరిలో ఒకరం

నా కంటి పాపలో ప్రతి రూపమై
నువ్ నిలిచి ఉంటావు నా చూపువై
నీ యద గుడిలో నీ తలపునై
నే నిలిచి ఉంటాను నీ భావమై

నిశిరాత్రి చీకట్లు ముంచెత్తనీ
నీ దరహాస కాంతులె చాలంటిని
నీ చంద్ర వదనంబె శశి బింబమై
శరత్కాన్తులై విరిసె నీ కన్నులే

లోకంబు నిదురించు యీ యామినీ
నా ఎత్తైన యదపైన తల వాల్చుకో
ఈడైన నను నీ తోడంచు తలచి
సాగిపోను కడదాక చేయందుకో

నీ గుండె లోతుల్లో నను చేర్చుకో
నీ రాగ బందాన నను మలచుకో
నీ అందాల సొగసులే నా కిచ్చుకో
నా ప్రేమ రాజ్యాన్ని నువ్వేలుకో 

 

ప్రకృతి

ఓ ప్రియా........

కోమలమౌ నీ స్వరమును విన్నా
కోకిల పాటని నేననుకున్నా
వసంతమిసంతకొచ్చిందన్న
భ్రాంతి తోడనేననుకున్నా

నాతప్పుల సవరించుచు
ఆగ్రహించి నీ అక్షులు పంచు
తీక్ష్ణతలో గ్రీష్మం కాంచా
పొరపాటెరిగి తలనేవంచా

ఎనలేనిది నీప్రేమని యెంచా
కురిపించిన నీ ప్రేమను గాంచా
దయావర్షపాతములోనా
మునిగి తడిసి ముద్దై పోయా

అధరాలొలికే దరహాసంలోనా
పున్నమి చంద్రుని వెన్నెల కాంచా
శరత్కాల కౌముది వెలుగుల
కాంతులలోనే సేదను తీరా

నీచల్లని చూపులు విసిరే
కన్నులకాంతులె తుషారమై
నా యద మీటిన తరుణంలోన
హిమవత్కాలపు సొబగులు చూసా

హద్దేలేని అనురాగం
అణువణువున నీ ప్రేమసరాగం
శీతలానిలముల హృదయసరాగం
శిశిరంబౌ నీ మమతలబందం

స్వాంతన మొసగు నీ చెంత
ఆరురుతువులే ఓ వింత
ప్రమదే కద ప్రకృతి కాంత
ఒప్పుకుంటుంది ఈ జగమంత

Wednesday 29 April 2015

ప్రార్థన

ప్రార్థన

నా  కళ్ళు  వెదకుతున్నాయి
నిన్ను  తనివి  తీరా  కాంచాలని....
కాని  వాటి  తృష్ణ  తీరనే లేదు
ఏనాడూ వాటికి  నువ్వగుపించలేదు

నా హృదయం ఏనాడూ నీ కొరకు
పరితపించనే  లేదు,  ఎందుకంటే
దానికా  అవసరం రానే రాదుకదా
నువ్వక్కడే  కదా  స్థిరమై  వున్నావు

ఓ  ప్రభూ!
సతతం  నా  మనసులో నే  నీవున్నా
యెందుకో  నీ  కోరకే  నా  అణ్వేషణ
కోనసాగుతూ  నే  వుంటుంది.........
నీ వున్నావని  నా  అంతరంగ మామోదించినా..
లేవేమో నన్న శంక సందిగ్దావస్తలో కొట్టుమిట్టాడిస్తుంది

నాకోసం  కాకున్నా!  నీ  కోరకైనా
నువ్వున్నావన్న  నిజాన్ని చాటుకోడానికైనా
ఓ సారి  అజ్ఞానాంధకారంలో చిక్కుకు పోయిన
నా జనాల కోరకైనా భువికి దిగిరమ్మని ప్రార్థిస్తున్నా

శుభోదయం

సుప్రభాతం

బాల భానుడు కదిలి  పూర్వాద్రులే  దాటె
కెంజాయ వర్ణమె  గగనంబు  నిండె
వృక్ష  శాఖల లోన  పక్షిజాతులు చేరి

భూపాల రాగాన  సుప్రభాతము పాడె
మేలుకో మేలుకో  జగ మేలుకో వలెనింక   
నిదురెందుకో ...... మేలుకో జగమేలుకో

ఈ ఉషోదయంబే  నీకు నవోదయం
ఈ నవోదయంబే నీచు మహోదయం
మహోదయంబే కావాలి శుభోదయం

మిత్రులందరికి శుభోదయం

కాలం

శుభోదయం

నేడు నేడని ఎగసి పడిన
నేడేమో నిన్నైంది
రేపుగదా యని నిర్లక్ష్యం చేసిన
రేపే నేడైంది

రేపంటూ  మాకుందని తలచిన ఎన్నో జీవులు
రేపుని కాంచకనే అనంతాయువుల్లో కలిసిపోతే

ఊహించని నవ జీవన కుసుమాలెన్నో
కళ్ళు తెరిచాయ్
నిన్నకి నేటికి ఎంతో తేడా
కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే

నిన్న జరగని మంచేదో నేడు జరగాలని
కోరుకోవడం అత్యాశ కాకూడదు

వాయిదాల కాశపడే బద్దకరాయుళ్ళ
బాల్యమిత్రుడైన  ఓ భవిష్యత్కాలమా
 
శుభాల సంచితానివై వచ్చావని తలుస్తాను
నీవు మోసుకొచ్చిన శుభాలను
మా మిత్రులందరికీ అందజేసి ఆనందింపజేయు  

 

రిషిక్ కౌస్తుభ్

ముద్దు లొలుకు చీన్న మురిపాల బాబును
ఇంటి వెలుగు నైతి ఇలన వెలుగు
మీదు దీవే నలుయె   మిక్కుట మనియెంచు
పిన్న వాడను యేను పెద్దలార


నవీన సన్యాసి

బాల సన్యాసినంచు
బలముగా నమ్మించి
మూర్ఖజనులతోడ
పాదపూజల నొంది
పీఠాల నెక్కంగ అర్హతనే పొంది
ఆధిపత్యము జేసి
అపరంజినే పొంది
కోట్లఆస్తులు పెంచి
మేటిగా వెలుగుదు
పిచ్చి లోకుల గాంచ
నవ్వు రాదా యేటి?
నా తెలివి తెలివి తేటలే
నాణ్యమై పోయే

Tuesday 28 April 2015

ఓ మహాత్మా!!

బాపూ!
నీవు పుట్టిన గడ్డ మీదే
మేము పుట్టాము
నీవు తెచ్చిన స్వరాజ్యమందే
మేము   బతికేము
నీవు చెప్పిన నీతులన్నీ
మేము చెప్పేము
నీవు నడిచిన బాట ఘనమని
మేము పొగిడేము
నీదు అడుగున అడుగు వేయ
మేము జంకేము
నిస్వార్థమన్నది యెరుగలేని
నరులమే మేము
నీవు తెచ్చిన రాజ్యమే
రాబందుల భోజ్యమయ్యెను
మమ్ము  కావగ మరల భువిపై  అవతరించమని మేము కోరేము
ఓ బాపూ!! !!

ప్రియా!!

శశాంకుడే వదనము కాగా
కలువరేకులే కనుగవలై
సంపంగియే నాసిక కాగా
దరహాస మొలికేటి అదరాలుగా
దొండపండ్లు జేరె దొరసాని నీకు

మందార చందమౌ
నీ లేత బుగ్గలు
యెరుపెక్కె నెందుకో
యెరిగించవే చెలీ!

మానవాంగనవై 
మహిని చేరిన నీవు
సురకాంత వోలెను
సుధలు కురిపించి

నా యద తలుపులన్
నువ్వు మీటావు
నా తలపులందునా
నీవు నిలిచావు

ని లోని భావుకతను
నిదుర లేపావు
ప్రతి పదము మాటున
నీవు నిలిచావు
యే రీతి పొగడనే
ఇంతి చేమంతి
నా కంటి గవ యందు
నిను నిలుపుకుంటి

సరసానికి రావా మావా

కాడెద్దులు మేతమేయు    కంచెదాపు నున్నట్టి
కాసారం తీరానికి    కలువలిప్పు కునే యేళ 
కలుసుకోను వస్తనని   కబురంపీనావు మావ
కలువల కులుకు జూసి  నన్ను మరువకోయ్
కన్నులలో నిన్నిలిపిన నన్ను వీడకోయ్
సల్లనైన పైరగాలి పులకరింప జేసేను
సరిగంగ స్నానమాడ వేళయిదని చెప్పేను
రావోయి నా మావా రంజయినా వేళ యిది
సల్లనైన యెన్నెల్లో సరస మిడు కుందారి

నిర్వోటులు

నిర్వోటులు

బలహీన క్షణంలో
పెద్దలు చేసిన తప్పుకు
శిక్షననుభవిస్తున్న చిన్నారులు
ప్రేమాను రాగ చ్ఛాయా మూర్తులు

కమ్మనైన అమ్మదనానికి గ్రహణం
అసురాత్మజ ప్రక్రియలీ ధారుణం
అనాధలై  ఈ బాలలు నవ సమాజానికి
సవాలులై  నిలిచిన సమిధలు

భావి భారత పట్టు  కొమ్మలై
భాసుర కాంతుల నందించాల్సిన
మయూఖ తంత్రుల మబ్బులు తాకి
మసక బారిన  మాయా చిత్రం

వీధిన పడిన భావి భారతం
వివర్ణమైన  ప్రగతుల తీరం
అణగారిన మానవతకు సాక్ష్యం
నేతల చూపులు సోకని నిర్వోటుల నిర్లక్ష్యం

స్వర్గపథము

నీ యద పై  నా ఊసులు
నడయాడుచు నీ
యదలో గీలిగింతలు
కలిగించక మానునా

ప్ర తి పదము విరిబాణము
యదనాటక వీడునా
ఓ నా నీలవేణీ !
నీ మదీలో నా రూపము
కనుపాపలొ నా బింబము
కాంచినానని పొంగి పోయితి
అడ్డు తెరలను త్రెంచు కొనుచు
అరమరీకల తృంచుకొనుచు
సాగిపోవలే స్వర్గ  పథముకు

అమృతము

అమృతము

ఇంట్లో అమ్మ తన అమ్మదనం
లోని కమ్మదనాన్నంతా కూర్చి
ప్రేమాను రాగాలను రంగరించి
మమకారంతో ఆప్యాయతను కల్పి
శుచిగా శుభ్రతగా రుచిలో వాసీగా
వండి వడ్డించిన నేమి? ఆ అమృత
సమమైన భోజనం రుచించదు కాని

మల మూత్రాలు విసర్జించే స్థలంలో
మురుక్కాలువల తీరం లో
అత్యంతాసహ్య కరమైన దుర్గంధం
ముక్కు పుటాలనదుర గొడుతుంటే
దోమలు ఈగలు చెవులో భూపాలాలు
పాడుతూ   కాళ్ళపై చేతులపై
చెక్చభజనల చేయిస్తుంటే
పుష్కర పుష్కరాలకు తప్ప
అన్యదివసంబు స్నాన మెరుగని
అపరిశుభ్రావులు నడిపే
ఛాటులు  ఫాస్టుఫుడ్ కేంద్రాల
చుట్టూ ఆవురావురు మంటూ
ఆరగించే  చిరుతిండ్ల రాయుల్లు

ఆహా! ఆకొన్న  కూడు అమృతం..,
అన్నారు  నాడు కాని అదీ నేడు
ఆ   కొన్న కూడు అమృతమైంది


మాన్యాలు కరిగేనా?

మనసువిప్పి మాటాడితే మాన్యాలు కరిగేనా?

అరచేతి నడ్డుపెట్టి   సూర్యకాంతి నాపలేరు
గోడమీది రాతలతో మూత్రధార  నాపలేరు
ఉత్తుత్తి  చట్టాలతొ  వరకట్నాన్నాపలేరు
ఉద్యమాల  హోరులతో మద్యపాన మాగిపోదు

రూక కొక్క కిలో రైసు  పేదవాడి నాదుకోదు
గుడిచుట్టు  తీప్పినంత గొడ్డుటావు ఈనీపోదు
వేలు మింగే  శాంతిహోమం వేదనలను తీర్చలేదు
మనసు విప్పి  మాటాడితె మాన్యాలేం కరిగిపోవు

కాషాయం కట్టగానే  కల్మషాలు తొలగి పోవు
బట్టతలయె పెరిగినంత భాగ్యవంతు డైపోడు
ఉపవాసం టేసినంత గ్రహదోషం  తొలగిపోదు
వయసు పేరిగి నంత యెవడు పెద్దమనిషై పోడు

కాలమెపుడు మారబోదు కలియుగ మైననేమి
మనిషి తీరు మారుచుండె మాయలోన మునుగుచుండె
ధనము కొరకు మానవతను తాకట్టే పెట్టు కొనీయే
మానవతను విడిచి తాను దానవుడై చెరగు చుండె

అవాంఛిత సహజీవన యాత్రికుడు

ఓ అవాంచిత  సహ జీవన యాత్రీకుడా!!

ప్రియుడవో!  అప్రియుడవో!!
సఖుడవో!  శత్రువువో యేరగని
ఓ సమకాలీన  సహజీవన యాత్రికుడా!!

నన్ను ప్రేమించానన్నావ్, విన్నాను
నీ కనులలో నా ప్రతిబింబ ముందన్నావ్
కాబోలనే  భావించాను!
నీ యదలో నా ప్రతిరూపాన్ని దాచానన్నావ్
సరియే నన్నాను

నా కళ్ళలో కనులు పెట్టి  నా కనుపాపలో
నీ రూపాన్ని చూసి నాకంటి చూపువు
నీవేనంటూ నీకు నువ్వే భావించి మురిసావ్

నీ అమాయకత్వానికి నవ్వుకోక యేంచేయను ?
అక్కడీతో ఆగలేక
నా గుండేలో నీరూపముందని చూపమన్నావ్
నా కళ్ళలోను యదగదీలోను నీవు లేవన్న
వాస్తవాన్ని చెబితే యెందుకు భరించవూ!

నా గుండెలో నీ రూపాన్ని చెక్కుతానంటూ
భీషణ ప్రతిన చేస్తున్నావ్ నన్ను విసిగిస్తున్నావ్

నా హృదయం పాషాణమన్నావ్
శీలను చేక్కి నన్ను నీ శిల్పంగా
మార్చు కుంటా నన్నావ్

నీరూపం నాయదగదిలో  భద్రమవాలంటే
అసంకల్పిత చర్యలా ప్రవేశించాలే తప్ప
బలవంతంగా యదలో బంధించలేమని
తెలియదా! అది తెలియనంతకాలం
మన మధ్య దూరం  పెరిగేదే  కాని తరిగేది కాదు

నీ ప్రతి చర్యా నీన్ను నా నుండి దూరం చేసేదే
నిన్ను అమాయకుడ వనుకోవాలో
పీచ్చి వాడవను కోవాలో అర్థంకాక
తల బద్దలు కోట్టుకుంటున్నా!!



విడదీయరాని బంధం

విడదీయరాని బంధం

ఓ  నేస్తమా  విడదీయరాని బంధమా
ఈ గాలి నేల నింగి నిప్పు  నీరు వున్నంతవరకు
నువ్వు నేనై నేనే నువ్వై మనమిద్దరం
ఓకరికి ఒకరమై  ఇడ్లి వి నువ్వైతే సాంబారునేనై
పెసరట్టును నేనైతే ఉప్మవు నేనై ఇద్దరం పూరి కుర్మాలమై
కంప్యూటరు కీబోర్డువునవ్వై మౌజును నేనై
సెల్ ఫోన్ వు నీవైతే  సిమ్మును నేనై
ట్యూబులైటు ను నేనైతే చౌకువు  నీవై
బూటువు నీవైతే  మే జోడును నేనై
కలిసి వుందాం కలకాలం ఈ కలికాలం


దోపిడి

ఏమండీ! తలుపు తాళం మరువకండీ
దొంగలెక్కువయారు అందిమా ఆవిడ
ఆవిడ మాటలకు నవ్వుకున్నాను...
దోచుకోడానికి నా దగ్గరేముందోయ్
హృదయాన్ని నువ్వెప్పుడో దోచేసావ్
కాలం వయసును దోచేస్తూనే ఉంది
ఈ శరీరాన్ని కష్టం పేరిట ఆఫీస్ వాళ్ళు
ప్రతి నిత్యం దోచుకుంటూనే ఉన్నారు
వాడిచ్చే మూడు ముడికాల జీతం
పాలవాడు పేపర్వాడు ఇలా అందరూ
ఎవరికందినంత వారు దోస్తున్నారు
చివరాకరికి నా ఈ ఈతిబాధలు
నా జుట్టును కూడా దోచేసాయ్
బోడి బట్ట తలతో ఊరేగుతున్నా
ఇంకేం దోస్తారీ పాడుదొంగలు అన్నా..
కోట్ల విలువైన ప్రాణాలున్నాయ్ గా
దాన్ని దోచినా దోచేయ గలరంది.
వెధవ ప్రాణం ఈరోజు వీడు కాకుంటే
మరోనాడు మృత్యువైనా దోచడా
పోతేపోనీ అన్నాను కానీ
చంచలమైన మనసు నా మాట వినదుగా.. వెళ్ళి తాళాలు వేసొచ్చి
పడుకున్నా... విజయ దరహాసం
మా ఆవిడ వదనంలో.....
ఇప్పుడు మీ దగ్గర కొస్తే నేనింకేం
దోచానంటారో వచ్చేదా మానేదా
అన్టు ఓరగా నవ్విందావిడ
అందరూ అన్ని దోచుకున్నప్పుడు
నీకు సాధ్యమైంది నువ్వు దోచుకుంటే నాకానందమేలేవోయ్
అంటూ నేనూ నవ్వాను

Wednesday 22 April 2015

చేతులు కాలాక

చేతులు కాలాకా...........!

మనం ఒకరికొరకొకరం
పుట్టామనీ భ్రమించాం
కులమతాలనే కుడ్యాలను
ఛేదించుకొని అంతస్తుల
అంతరాలను ద్రుంచుకుని
కన్నులోకరివైతే చూపు
మరోకరమయ్యాం
గుండెలోకరివైతే స్పందన
మరొకరమయ్యాం
వెచ్చని ఊపిరి తో ఒకరి
కొకరం చలికాచుకున్నాం

ప్రేౌమే ఊపిరనుకున్నాం
నిను వీడినేను నను వీడి
నువ్వూ వుండలేక పోయాం
ఓకరి చెంతమ ఒకరుంటే ఇక
ఆకలి దప్పులవసరమే రాదను
కున్నాం! ప్రేమఊసులే భోంచేసాం!

నావాళ్ళని నేనూ  నీ వాళ్ళని నీవూ
కాదనూకునీ ఇళ్ళుని విళ్ళనీ
వదులుకునీ నీకోసం నేనూ నా కొరకు నువ్వూ
మనమీద్దరం కలకాలం కలిసుండిలనీ
కలిమి తో పనీలేనీ కలల కాపురం చేస్తూ
రోజూ స్వర్గ తీరాలను చేరాలనీ కలగన్నాం

అందరినీ కాదనుకుని
అందరికీ దూరంగా
ఎవరూ పరిచయం లేని
ఏకాంతంలాంటి ప్రాంతానికొచ్చాక
కూడు గూడు నుడల కవస్త పడ్డాం
ఇక్కడి కొచ్టాక తెలిసింది జీవితమంటే!

భ్రమలు తిరాయి
ప్రేమలు కడుపు నింపవని
కడుపునిండని నాడు
ఏ ప్రేమా నిలవదని
ఇపుడు ఒకరికి ఒకరం
వంచకుల్లా కనిపిస్తూన్నాం

నన్ను నీవు వంచించావని నేను
నిన్నే నేను వంచించావని నీవు
అనుకుంటున్నాం ఆక్రోశిస్తున్నాం
అరచుకుంటున్నాం తిట్టుకుంటున్నాం

కాని ఇపుడే తేలిసిన సత్యం
ఒకరినోకరు వంచించుకోలేదని
మనని ప్రేమగా పెంచి పేద్దజేసి
మనపై యెన్నో ఆశలు పెంచుకున్న
మన పేద్దలని వంచించాం
వాళ్ళ నమ్మకాన్ని ముంచాం
పదిలంగా కాపాడుకున్న వాళ్ళ
పరువు ప్రతిష్ఠలని కాటువేసాం
అభిప్రాయ భేదాలంటూ వచ్చాక
ఇక కలిసి వుండడమనవసరం
కనుక నిను వీడి పోతున్మా!



Tuesday 21 April 2015

చిలుక ఎగిరిన పంజరం

చిలుక ఎగిరిన పంజరం

ఓ పంచవన్నెల  రామచిలకా!!
నువ్  పంజరాన్నాశ్రయించుకుని
ఉన్నంతకాలం ఆ పంజరాని కెన్ని హొయలో!

ఇనుప తీగలతొ తయారైనదైనా
ఎన్నేన్ని రంగులో  ఎన్నేన్ని హంగులో
రాజప్రాసాదాలలో ఉన్నతశిఖరాల నంటిపేట్టుకుని
ఎన్నో మన్ననల నందుకున్న ఆ పంజరం

నువ్ స్వేచ్ఛార్థివై అనంతాంతరిక్షంలోకి
ఎగిరిపోయాక దిని పరిస్థితిలో యెంతమార్పు
కళావిహీనమై ఆదరణ కోల్పోయి పాడుబడిన
సామగ్రి కొట్టులోకి విసిరివేయబడింది

చివరికి పాత సామగ్రులు కొనేవాడి
చేతిలో పడీ ఎంతోకొంత ధనాన్ని
ఆర్జించి తన యజమానీకీవ్వగలిగింది

అస్థికలతో తయారైన మా ఈ పంజరంలో
ఆయువనే చిలుక నే ఎగిరిపోయిన నాడు
ఇక ఈ పంజరం  కాలి బూడిదవ్వాల్సిందే
తప్ప సగం ధరనిచ్చి కొనే పాతసామగ్రి
వాడేక్కడనూ లేడే!!

మా ఈ ఎందుకక్కరకు రాని వ్యర్థ
పంజరాన్ని భావి వైద్యులకొక
పాఠంలా ఈపయుక్తమయేలా
మలచగలిగే ధీమంతులకై నా అణ్వేషణ

Monday 20 April 2015

రాబందు(ధువు)లు

హృదయం ముక్కలైందంటే
మాంసపు ముక్కలకాశపడ్డ
రాబందుల్లా హృదయ శకలాలను
నోట కరుచుకు పోవచ్చేమో నని
ఆశపడే బంధువులనే రాబందులు

ముక్కలనేం చేసుకోను  సాంబారు
లో వేయడానిక్కూడా పనికిరావు
కానివ్వండి యెన్నిముక్కలైనా వచ్చే
నష్టమేంటని  అసహనంగా అవహేళనగా
ఈసడింపుగా మాటాడే జీవితభాగస్వామి

అలసిన హృదయం ఆగేది నేడో రేపో
ముక్కలైతేమి ముడతలు పడితే నేమి?
వెలగబెట్టె రాచ కార్యాలేమున్నాయని
ముక్చలగోలేందుకు ముడుచుకు పడుకో
అంటూ కసురుకునే రక్తం పంచుకున్న వారు

ముక్చలన్న మాట వింటూనే ముఖాన్ని
చాటేసుకుని తప్పుకు తిరిగే స్నేహితులు
ఇదే మన చుట్టూ వున్న సమాజం

లాటరి గెలిచిన్నాడు అభినందించ
వరుసలు గట్టి మరీ వచ్టేసే వీళ్ళంతా
మన కష్టాల సమయాన  కన్నీళ్ళు
తుడవడానికి మాత్రం యే ఒక్కడూ రాడు

ఓ బాలకార్మికుడా!

బడి గదిలో గడపాల్సిన బాల్యం
బండలమధ్యన కరిగిన దైన్యం
భారీ భారతనిర్మాణానికి
రాళ్ళెత్తిన ఓ భాస్కరుడా!
రేపు వెలిగే కాంతులరేడుకు
నేడు పట్టిన గ్రహణ మిదేనా?

ఎముకలు ముదరని లేత చేతులు
తెలిసి తెలియన యదగది వ్యధలు
పాలుగారే ప్రాయంలోనే పెద్దవు నీవై
తలకు మించిన భారంతోని కృంగితివోయి

దీనత్వం తొణికిస లాడే
మసిబారిన లేలేత వదనము
కాంతి రహిత నయనాలందున
చిరిగిపోయిన భవిష్యచ్ఛిత్రం

అయ్య తాగే సీసాలకు   కాసులకోసం
అణగారి పోతున్న నీ  బంగరు బాల్యం
కల్మషమంటని ఆ లేతచేతులు
కందిపోయినా కమిలిపోయినా
కాంచే ప్రేమకు  కరువై పోయెను

త్యాగము నీదో  ఖర్మము నీదో
భరతమాతకే  తీరని వ్యధవో
కర్మఫలమని చేతులు దులిపే
దద్దమ్మల నిర్దయ ఫలమువో

Sunday 19 April 2015

అనవసర జీవన యానం

పరుగెడుతున్న  కాలంతో
సరిసమానంగా  పరుగెత్తే
వయసు నన్ను వ్యధా సాగరంలో
ముంచెత్తుతూ నే  వుంది

వయసు  పెరుగుతుంది
ఆయువు  తరుగుతుంది
జవసత్వాలుడుగు తున్నాయ్
పరిస్థితులు  చేజారుతున్నాయ్

నేను  ఇష్టంగా  కట్టించుకున్న
నా బొమ్మరింటిలోనే పరాయినయ్యా
నా వాళ్ళనుకున్న పేగు బంధాలకు
పరాయినౌతున్నా! భారాన్నౌతున్నా!

నా ఇంటిలోనే ఓ మూల నా అస్తిత్వం
నా దనుకున్న గూడే ఇక అన్యాక్రాంతం
నా స్వతంత్ర్యాన్ని  కొల్లగొట్టే నా వారసత్వం
ఇదేంటని అడగలేని చేతగాని వార్తక్యం

తినాలన్నా తిండికక్కర లేదు నా ఇచ్ఛ
కునుకొస్తే పడుకోడానికీ లేదంట స్వేచ్ఛ
నేను మాట మాటాడితే నే వారికో రోత
పైగా ఇది నీ కాలం కాదంటూ మరో వాత

ప్పుడు పోతాడా అంటూ
ఎదురు చూస్తాయి వారి కళ్ళు
పోక పోతాడా చూద్దాం అనే
ఆశా వాదంలో వారి  మనసు

నేను యెత్తుకు  పెంచిన  పిల్లలే
నా  చావుకై  యెదిరి  చూస్తుంటే
ఈ  భారమైన బతుకే పెను భారం
ఇంకెందుకు? ఈ అనవసర జీవన యానం