Sunday 31 May 2015

నిరీక్షణ

నిరీక్షణ

చంద్రునికై ఎదిరి చూసే చకోరినై
కమలాప్తుని కమనీయ రూపాన్ని
గాంచ నిరీక్షించిన తామరనై నీ కొసమే
కదా ప్రియా! నా నిరీక్షణ!!

మన కలయికలో మన మాడిన
ఊసుల ఊయలలు..,
శైవలినీ లహరీ తరంగమై  మదినీ
ఊయల లూపుతుంటే....

ఆనందాతీ శయాలతో అంతరంగమే
పతంగమై తేలియాడాల్సిన
నా హృదయం  నీవులేక
కృంగి పోతూ  నీరసించి నిస్తేజమై
నన్ను జీవచ్ఛవాన్ని చేసింది

నీ హృదయ రవళి నన్నావ్
నీ కనుల కాంతినన్నావ్
నీ ఉచ్వాస నిశ్వాసాన్నన్నావ్
నీ ఆరో ప్రాణాన్నన్నావ్

అన్నీ అన్న నీవుధనానికి
బానిసవయ్యావ్ పచ్చనోటు సాధనకు
సాగరాలే దాటావ్ ...నువ్వు నువ్వులా
నా నువ్వులా వస్తావో రావో ననీ
వ్యధాభరీతనై నీ నేను నీరీక్షిస్తున్నా!!


యువతా కదలి రా!

యువతా కదలి రా!!

కదలిరండి కదలిరండి
కదం కదం కలిపి రండి
యువరక్తం ఉరకలేసె
యువజనమా తరలిరండి!

ప్రజాధనం దోచుకునే
ప్రబుధ్ధుల మదమడచగ
ప్రభంజనమై పరువులేత్తి
పరుగులెత్తి వేగ రండి!

అడుగడుగున అక్రమాలు
అవినీతి అరాచకాలు
మానవతకు గ్రహణాలూ
అమానుష పు ఆగడాల
భరతం పట్టగ నీవు
వీర భద్రుడవై వేగ రమ్ము
దుర్మార్గపు కుత్తికలనె
కత్తిరింప కదలి రమ్ము

వాపును చూపి బలుపని చెప్పే
మాయల ఫకీరు మంత్రాంగాలను
తాతలు తాగిన నేతుల మూతుల
వాసన చూపి జోలపాడీ నిద్రపుచ్చి

కల్లల మంత్రాంగాల కపటపు మాయల
దృంచి నడుమంత్రపు బతుకులలో
నాణ్యతనే పేంచాల్సిన బాధ్యతనే
తలకేత్తుకో భారమనక కదలిరా!

భరతమాత వైభవం

భరతమాత స్తుతి

నమో నమో ప్రియ భారత ధరణి
నమోస్తుతే శ్రియ మంగళ చరణి

శ్రీగిరి హిమగిరి  ఆరావళులను
సుందరలోయల  కాశ్మీరమ్మును
సుజల వాహినీ తోయమాలిగను
కలిగిన సుందర భారత ధాత్రి ॥ నమో ॥

సురగణములు వెలసిన ధాత్రి
సుజల సంహిత  సాగర పుత్రి
సుస్వర స్వరయుత వేదధాత్రీ
సుజన శతకొటిసుత భారతధాత్రి ॥నమో॥

హిమ మకుట సంశోభిని జననీ
మహిమాన్విత మమతల ధరణి
నదీ నదముల  భూషణ భూషిణి
జయ జయ భారతి విజయ విహారీ ॥నమో॥

భవిష్యత్కాల దళితుడా!

భవిష్యత్కాల దళితుడా!

ఓ భవిష్యత్కాల దళితుడా!
సర్కారు వారి శత్రువా!!
అగ్రకులము నాది నాదని
అహంభావము యెందుకు?

చదవ బోతే సీటులేదు
చదివినాకా కొలువు లేదు
ఏకలవ్యుని శాపమో మరి
ఎవని కొచ్చిన కోపమో

కులాలు కుచ్చితాలని
గద్దెనెక్కి చెప్పుతారు
కులమేదని ఉపకులమేదని
గుచ్చి గుచ్చి అడుగుతారు

ప్రభుత యనే బ్రహ్మ రాక్షసి
పదఘట్టనలో నలిగిపోయి
అణగారెడు జాతి ఇలన
అగ్రవర్ణము మనెడు కులము

కారులున్నా మేడలున్నా
తండ్రి తాతకు కొలువులున్నా
వెనుకబడీన అణచబడిన
కులములంచూ ప్రేమజూపిరి

పూట పూటకు భిక్షమెత్తి
పొట్ట గడవక పస్తులున్నా
అగ్రవర్ణపు వారిపైనే
ఆగ్రహంబూ వీరికెందుకు

అగ్ర వర్ణపు యువకులారా!
సర్కారు వారికి శత్రులారా!
మేలుకొండిక యేలుకోనగ
భవితలో మీజాతి మనుగడ



వాడకూడని సుమాలు

వాడకూడని సుమాలు

నా కవితా  వనంలో  విరబూసిన
కవితాసుమాలెన్నో!  యెన్నెన్నో!!

తెలుపు  యెరుపు  కెంజాయ  నీలి
రకరకాల  వర్ణాల  విరులతో  పాటు
కంటికింపైన  కాగితప్పూల  సొబగులు
నా వన సోయగాన్ని  పెంచుతున్నాయ్

తేట తెల్లని  విరిసొబగులు  స్వచ్జమైన
మానవతా విలువల మానవ నిర్మాణానికై
తహతహ లాడుతుంటే  యెర్రెర్రని కుసుమాలు
అణగారిన తాడిత పీడిత దళిత దగాపడిన
జీవుల  ఆక్రోశమై  ప్రజ్వరిల్లు  తున్నాయి

మానవ ధర్మాధర్మ  విచక్షణ కోసం
కెంజాయి  పూలు  ప్రబోధిస్తుంటే
జారిన  నా జాతి  సౌభాగ్యాలను
తల్చుకుని కుములుతుంటాయ్
నీలి వర్ణపు కుసుమాలు

యదగదులూ  ప్రణయ కలహాలు
అధరాల మధురాలు అధరామృతాలు
వంపు సొంపుల హొయలు సరస శృంగారాల
సుధల సుగంధాలు విరజిల్లే కాగితప్పూలు

ఎన్నెన్నో  వర్ణాలతో సొబగులీనే విరులు
అందరి మదులను దోచుకున్నాయో లేక
వాటంతట అవే విరబూసి రాలుతున్నాయో !
అలా రాలిన నాడీ కవితా సేద్యం అర్థంలేని
శ్రమయై  వృధా ప్రయాసయై వ్యర్థమై పోవదా!


పున్నమి రాత్రి

పున్నమిరాత్రి

చంద్రుడు వెన్నెల
కళ్ళాపి జల్లుతున్నాడు
నిశీధి విస్తరించిన నేలంతా
చల్లని తెలుపుతో
మురిసిపోతూంది

గగన తలంనుండి జాలువారే
తేనెలూరే వెన్నెలకు మైమరిచి
పోయిన నిశీధికాంత రంగురంగుల
రంగువల్లుల నద్ద మరిచి పోయింది

స్వచ్ఛమైన మల్లెల నారబోసిన
తెల్లని చల్లదనం పుడమిని కౌగలించుకుని
నవదంపతుల యదలో యెన్నెన్నో
మధురోహలకు ప్రేరణ నిస్తుంది.

పగలంతా స్వార్థపరుల కుచేష్టలతో
విసిగి పొయిన ధాత్రికి స్వచ్ఛమైన
వెన్నెల స్వాంతన నిస్తుందేమో! అన్నట్లు
హాయిగా సేద తీరుతుంది పుడమితల్లి

రేపటి కొరకు తాను కరుగుతూ   ఆశగా.....
నిద్రిస్తున్న మానవ లోకానికి జ్ఞానోదయం
కలగాలనీ  కృత్రిమంగా తనకు తానుగా
ఆహ్వానించుకున్న స్వార్థపరత్వాన్ని
పారద్రోలి యేనాడో వదులుకున్న
మానవత్వాన్ని రప్పించుకుని  రేపటినుండీ
తిరిగి మనిషిగా మనగలగాలని కోరుకుంటుంది


జయ జయ హే తెలంగాణ

జయజయహే తెలంగాణ    (పాట)

జయజయ హే తెలంగాణ
జనవందిత హృదయసీమ
గనివనరుల కలిమి సీమ
జయ జయ హే తెలంగాణ

మానవత్వ పరిమళాలు  మహిచాటిన తెలంగాణ
మతమౌఢ్యపు రక్కసుల  మదమడిచిన తెలంగాణ
కాదు కాదు కాదు ఇదీ  కరువు  తెలంగాణ
గల గల గల గోదారి కృష్ణ కదులు తెలంగాణ

పోతనార్యుని భక్తి  కైత పుట్టెనిచ్చోట
కాకతీయ పౌరుషాగ్ని కాలవాలమీ నేల
పొనికి కర్ర బొమ్మ లున్న నిర్మలున్నది చ్చోట
చేనేతల సిరిసిల్ల వలువల గద్వాల నేల

నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన
కొమురం భీమును గన్న అమ్మ మన తెలంగాణ
వీరనారి ఐలమ్మ  మల్లూ స్వరాజ్యమ్మ
ధీరులై వెలసిన  వీరభూమి తెలంగాణ

కోటిరతనాల వీణ మేటైనా తెలంగాణ
దాశరథి భావనలో వెల్లివిరిసె తెలంగాణ
కాళోజి సదాశివా హనుమంతు జగదీశు
ప్రజాకవుల వేదికిది ప్రభలు వెలుగు తెలంగాణ

భద్రాద్రి బాసరా ఎములాడ యాదాద్రి
కొండగట్టు హనుమన్న  వెలసినట్టి పుణ్యభూమి
జయశంకరు కలలు గన్న విజయధాత్రి నాభూమి
తేజమొలుకు సంస్కృతుల  మేళవింపు నా భూమి

Tuesday 26 May 2015

మగజన్మ నెందుకిచ్చావ్ దేవుడా!

మగజన్మమెందుకిచ్చావ్ దేవుడా!

ఓ మగాడా!
మృగాడూ మృగాడూ అనీ
లోకమంతా నిను వేలేత్తి
చూపుతుంటే సాటి
మగాడిగా తలదించు కుంటున్నా!

మగాడు పుట్టాడంటేనే
అమ్మలు అసహ్యించుకునే
రోజులు మరెంతో దూరంలో
లేవనీ రుజువు చేస్తున్నావ్

తల్లిమనసు విశాలమై
నిన్నుపేక్షించినా...
పురుడు పోసీన దాయిచాలదా
నీ ముక్కులో వడ్లగింజకు

ఆడ పిల్లల నల్లరి పెట్టిన్నాడు
ఆకతాయి వని పించుకున్నావు
కన్నె పిల్లల నేడిపించావు
రౌడీషీటరువని పేరుతెచ్చుకున్నావ్
అతివల నత్యాచారం చేసి నరరూప
రాక్షసివయ్యావ్ కీచకునివయ్యావ్
పరమదుర్మార్గునివని పేరు తెచ్చుకున్నావ్

కామాంధునివై వావి వరసలనూ మరచి
కన్నకూతురునే కామాగ్ని జ్వాలల్లో
కాల్చి భస్మం చేయాలనుకున్న నిన్ను
తిట్టడానికి తిట్లేవి పిలవడానికి పేర్లేవి?
ఈ  లోకంలో అంచనాలకే అందని అపరాధం
చేసి యావత్మగజాతికే కలంక మంటగట్టావ్

ఇక లోకంలో తండ్రికి విలువేది?
అన్నయన్నా గౌరవం ఆడవారికుండేనా
వావి వరుసలకిక యేమున్నది విలువ
మగాడంటే చాలు మృగాడుగా మిగలడా!

ఛీ లతొ థూ లతొ ఈలోకం
మగ జాతినే అసహ్యించుకుంటుంటే
మగాడిగా నాకీ జన్మనెందుకిచ్చావ్
భగవంతుడా! అని నిలదీస్తున్నా..,

భయం గుప్పిట్లో......

భయం గుప్పిట్లో,.......

నాన్నా!
భయం భయం గా వుందని
నీ చెంతన చేరి నీ  యదపై
తలానించి నీ గుండె సవ్వడే
జోలపాటగా అభద్రతా భావాన్ని
విడిచి నిర్భయంగా నిద్రించ గలిగా
నొకనాడు .............

నీ వ్రేలు పట్టుకుని  నీ వెంట
నడుస్తుంటే.... దారంట పోయే
వాడెవడూ నావంక తలెత్తి సైతం
చూడలేదే..
నా మాన ప్రాణాలకు రక్షణ కల్పించే
వాడవని యెంతటి విశ్వాసం ఉండేదో
ఆనాడు...........

అమ్మ తరువాత అమ్మంతటి
దేవుడవని నిన్ను ఆరాధించా
అభిమానించా...... నీవే లేనిది
నేనెక్కడ? అని గర్వపడ్డా!

ఎక్కడో యేదో జరిగింది
జరగకూడనిదే జరిగిందీ
సరిదిద్ద లేనిదే జరిగింది
ఆ  దురాగతం నాలో భయాన్ని
మేల్కొలిపింది...  నాన్నంటే
మగాడే నన్న లింగభేదాన్ని
చూపిందీ నా అంతరాత్మ

ఇంతకాలం మన మధ్యనున్న
ప్రేమానుబంధాలను  నెట్టేసింది
భద్రతా భావానికి అభద్రతెదురై
అభద్రతా భావమే నిదురలేచింది

ఇంట్లో సైతం నువ్వుంటే
అమ్మచాటున దాక్కుంటున్నా
యెక్కడ నీ చూపులు నాపై
పడతాయో యని,,,,

స్వచ్ఛమైన నీ ప్రేమ తెలుసు కానీ
నువ్వూ మగవానివనీ మగ మృగానివనీ
నిన్ను నమ్మ లేక పోతున్నా!

నన్ను క్షమించవూ!
నా మాన ప్రాణాలను రక్షించవూ!!

Monday 25 May 2015

పశువులకు కావాలి పాశవిక న్యాయం

పశువులకు కావాలి పాశవిక న్యాయం

వీధికుక్కల కన్న అడవి నక్కల కన్న
బురద పందులకన్న  బుద్ధిలోన
పతనమయ్యెను మనిషి పరికీంచి చూచినా
చెప్పజాలకుంటి సిగ్గుచేత

కామంపు పొరలచే కండ్లు మూసుకు పోయి
కామాంధుడై చెలగె కలియుగాన
కామాగ్ని జ్వాలయై మండుచున్నడు వాడు
ఉచ్ఛనీచంబుల మరిచినా నీచుడయ్యె

కన్నకూతురు నైన కాంచంగ లేడయ్యె
మగజాతీకే వాడు మచ్చ యయ్యె
కంటినే కాచేటి కనురెప్పనే జూడ
కనుగుడ్లు పీకేటి కాలమిదియా

పితృదేవుడంటు చెప్పేటి ఘనమైన
సంస్కృతే మనదంటు చెప్పంగ సిగ్గాయే
పిదప కాలము చేరే నరరూప రక్కసుల
అస్తిత్వమే పేరుగ అబలలేల బతికేరు అవనియందు

మరణ దండన కన్న మరపురాని శిక్ష
విధియించ వలయునీ వంచకులకు
కామాంధులని పట్టి కాల్జేతులన్నరికి
కనుగుడ్లు పీకేసీ ఖాండ్రించి ఉమ్మి

మలమూత్ర గుంటలో మూన్నాళ్ళు ముంచేసి
చెప్పుదెబ్బలతోడ సత్కరించి
చుంచెలుకల దెచ్చి ఒళ్ళంత కొరికించి
యెండు కారము నంత మేని పూసి
శిక్షించకున్ననూ స్త్రీకి రక్షణ లేదు
పసులకు కావాలీ పాశవికము 

Sunday 24 May 2015

కవి ఆత్మఘోష

కవి ఆత్మఘోష

ఓ కవీ!!
నీ భావావేశ తరంగిణీ మాలికల
రసధునిలో నవరసాలనే మేళవించి
అలంకారమనే గుబాళింపులతో
అమ్మ నేర్పిన కమ్మనైన మాతృభాషా
మచరంద మాధుర్యములతో

అమృత తుల్యమైన నలభీమ
పాకమంటి రుచికర వంటకమనే
నీ కావ్య మాధుర్యాన్ని ఆస్వాదించి
ఆనందించే ఇచ్ఛతున్న  పాఠక
మహాశయులకై వెదుకు తున్నావా?

మురుక్కాలువల తీరంలాంటి
బహిష్కరింప దగిన విదేశీ సంస్కృతుల
మోజుతో,,,అంతర్జాలంలోని
సాంఘిక మాధ్యమాల ప్రవాహమనే
ఫాస్టుఫుడ్డులకూ.,. అర్థ పరమార్థాల
నొదిలేసిన జీడిపాక  సీరియళ్ళనబడే
చాటంటూ వుండని చాటుబండారు
కేంద్రాలకు మరిగిన
ఆంగ్ల మాధ్యమాంధులకు విజ్ఞాన
విచక్షణ నిచ్చే ఆరోగ్య ప్రదమైన
రుచులిచ్చగించునే?

నీవు వండి వడ్డించ సిద్ధపరచిన
నీ సాహిత్య కృతుల నన్నింటినీ
కట్టగట్టి అటకెక్కించు కోవలసిన
దుర్దశ దాపురించినదని విచారించుటే
తప్ప అన్య పథమేది?


Saturday 23 May 2015

తరూవిలాపం

తరూవిలాపం

జ్ఞానుల మనుకొని
మురిసే మానవా
మమ్ము తెగ
నరకడమిక మానవా!
మ్రానులమైన నేమి,
మనో హీనులమైన నేమి?
మనోధరులంచు మీకున్న
గొప్ప మన్న నేమి?

నీవు పీల్చే శ్వాసకు
ప్రాణధార నిత్తునేను
నీ వార్థక్యపు గమనములో
సదాతోడు వత్తునేను
మలమల మాడ్చే యెండన
నిలువనీడ నిత్తునేను
నకనకలాడే కడుపుకి
మధురఫలాలిత్తు నేను

పండుగలకు పబ్బాలకు
గుమ్మాలకు తోరణాలు
కడుపారగ భోంచేయగ
వడ్డనకై విస్తళ్ళను
నిరుపేదల నివాసాల
పైకప్పుకు పర్ణాలను
ప్రతిమల చల్లని మెడలో
ప్రమదల నల్లని జడలో
సొబగులీను సుకుమారపు
సొగసుల కుసుమాలను
యెవరిచ్చునొ మరచిపోయి
యెందులకీ దుర్మార్గం

మెరక దున్ను అరకనిస్తి
క్షుత్తునార్పు ధాన్యమిస్తి
గుమ్మాలకు తలుపునిస్తీ
కుర్చీలకు తనువు నిస్తి
వరుణునితో భాషించితి
వర్షాలను కురిపించితి
కరువన్నదీ పారదోలి
కలిమి పంట లందించితి

పరిణయాల వేళ
పందిరినై  నిలిచుందు
పాకశాలలోన నేను
ఇంధనమై కాలుచుందు
పార్థివకాయము మోసే
పాడెనై తోడుందు
అంతిమ సంస్కారమందు
కాడునై కాలిపోదు

మనసన్నదీ లేని
వట్టీ మ్రానునంటు పిలిచేవు
మనసున్న మారాజువు
మానవత్వ మొదిలేవు
హితము గూర్చు రుహమన్న
ఇంగితమే వదిలావు
స్వయంకృతాప రాధంతో
సర్వనాశ మొందేవు

Friday 22 May 2015

చేతులుకాలాకా.....

చేతులు కాలాకా...........!

మనం ఒకరికొరకొకరం
పుట్టామనీ భ్రమించాం
కులమతాలనే కుడ్యాలను
ఛేదించుకొని అంతస్తుల
అంతరాలను ద్రుంచుకుని
కన్నులోకరివైతే చూపు
మరోకరమయ్యాం
గుండెలోకరివైతే స్పందన
మరొకరమయ్యాం
వెచ్చని ఊపిరి తో ఒకరి
కొకరం చలికాచుకున్నాం

ప్రేౌమే ఊపిరనుకున్నాం
నిను వీడినేను నను వీడి
నువ్వూ వుండలేక పోయాం
ఓకరి చెంతమ ఒకరుంటే ఇక
ఆకలి దప్పులవసరమే రాదను
కున్నాం! ప్రేమఊసులే భోంచేసాం!

నావాళ్ళని నేనూ  నీ వాళ్ళని నీవూ
కాదనూకునీ ఇళ్ళుని విళ్ళనీ
వదులుకునీ నీకోసం నేనూ నా కొరకు నువ్వూ
మనమీద్దరం కలకాలం కలిసుండిలనీ
కలిమి తో పనీలేనీ కలల కాపురం చేస్తూ
రోజూ స్వర్గ తీరాలను చేరాలనీ కలగన్నాం

అందరినీ కాదనుకుని
అందరికీ దూరంగా
ఎవరూ పరిచయం లేని
ఏకాంతంలాంటి ప్రాంతానికొచ్చాక
కూడు గూడు నుడల కవస్త పడ్డాం
ఇక్కడి కొచ్టాక తెలిసింది జీవితమంటే!

భ్రమలు తిరాయి
ప్రేమలు కడుపు నింపవని
కడుపునిండని నాడు
ఏ ప్రేమా నిలవదని
ఇపుడు ఒకరికి ఒకరం
వంచకుల్లా కనిపిస్తూన్నాం

నన్ను నీవు వంచించావని నేను
నిన్నే నేను వంచించావని నీవు
అనుకుంటున్నాం ఆక్రోశిస్తున్నాం
అరచుకుంటున్నాం తిట్టుకుంటున్నాం

కాని ఇపుడే తేలిసిన సత్యం
ఒకరినోకరు వంచించుకోలేదని
మనని ప్రేమగా పెంచి పేద్దజేసి
మనపై యెన్నో ఆశలు పెంచుకున్న
మన పేద్దలని వంచించాం
వాళ్ళ నమ్మకాన్ని ముంచాం
పదిలంగా కాపాడుకున్న వాళ్ళ
పరువు ప్రతిష్ఠలని కాటువేసాం
అభిప్రాయ భేదాలంటూ వచ్చాక
ఇక కలిసి వుండడమనవసరం
కనుక నిను వీడి పోతున్నా!



మహాకవికి జోహారులు


హాకవీ జోహారు

పేరులోన  రెండు శ్రీలు
భావంలో నిండు సిరులు
వయసుమళ్ళినా మరిగిన రక్తం
నరనరాలలో నవనవోత్తేజం

అస్తవ్యస్తపు వ్యవస్త పైన
కదనమూర్తివై కలం కదిల్చిన
కవివీరుడు కవికుల తిలకుడు
కష్టజీవుల కాపద్భంధుడు

మరో ప్రపంచ మనని
మహా ప్రస్థానమవని
కావెక్కిన ప్రగతి రథానికి
అరుణారుణ వర్ణమద్దిన

భావా వేశపు తరంగాలతో
మహాకవిగా మహిలో వెలగీ
తారలసరసన తళుకులీనుతూ
నేటి సమాజమును చింతాక్రాంతుడై

తిలకించెడు శ్రామిక ప్రియుడు
పీడిత తాడిత బడుగు వర్గపు
జాతి ప్రేమికుడు జాగృతమూర్తికి
జోహారు జోహారు జోహారు లివియే
 

మారని తరాల అంతరాలు

మారని తరతరాల తలరాతలు

నింగిలో సూర్యుడు నిప్పులు గక్కే వేళ
పక్షులు సైతం పచార్లు మానుకుని
గూళ్ళల్లో కునుకు తీస్తున్న వేళ
కొండదిగువన మాత్రం కూటికోసం
ఎండిన డొక్చల్ని నింపుకోడానికి
యంత్రంలా పని చేస్తున్న
మాంసం కరిగిన రెక్కలు
బలహీనంగా కదులుతూ  నే వున్నాయి

బడా బడా బండరాళ్ళు సైతం 
నుగ్గు నగ్గవుతూంటె ఆ పగుళ్ళనుంచి
పై పై కెగసిన తెల్లని దుమ్ము
పేదవాడి కళ్ళలో దుమ్ము కొడుతూ నే వుంది

అయిన వాడు కట్టుకో బోయె
ఆకాశ హార్మ్యాల్లాంటి
అంతఃపుర మేడలకై
పేదవాడి అలసిన రెక్కలు
శ్రమిస్తూనే వున్నాయి
ఎండిన డొక్కలు నింపడానికి
మరచక్రాలై కదులుతూ నే వున్నాయి

బక్క చిక్కిన దేహంలో
మాంసపు ముద్దలన్ని కరిగి కరిగి
రుధీరమంతా ఘర్మజలమై
ఉత్తుంగ తరంగమై ఉరికి వస్తున్నా
పట్టించుకునే దెవరు?

బండలు పగిలాయ్ కొండలు కరిగాయి
మేడలై నిలిచాయ్ కార్మాగారమై వెలిసాయ్
పోగగొట్టాలు చిమ్మే కాలుష్యం
వికట్టాట్ట హాసంచేస్తూ......,.
గుడిసె వాసుల బతుకుల్ని ఛిద్రం
చేస్తున్నా జాలి పడేవాడెవ్వడు?

పదవుల పరుపులపై మధువు మత్తుతో
సొమ్మసిల్లిన పాలక రాజేంద్రుల గురకల
రణగొన ధ్వనిలో  ఆకలి కేకల ఆక్రందనలు
వినిపించే దెవ్వరికి ...తరతరాల దైన్యపు
బతుకులు బాగుపడే దెన్నటికి......

ప్రకృతికాంత

ప్రకృతీమాత

పాంచభౌతిక ప్రకృతికి
ఆమే ఓ నిలువుటద్దం

సహనంలో భూమి ఆమె
ఓర్మితో ఉర్విని మరిపించ గలదు

వాక్చాతుర్యంలో సెలయేరు
ఉత్తుంగ వాహినీ జలపాతమై
మృదు మధుర స్వరాలతో వీణానాదాన్ని
మరిపించగలదు,...కళామతల్లి కళ్యాణీలా

సహనమే సహనం కోల్పోతే
రుధిరాగ్నిజ్వాలలౌతాయా
తామరాక్షువులు.... అపర
చండికా స్వరూపమై
ప్రళయాగ్నుల్నీ సృష్టించ గలదు

కోపాగ్నులతో ఆమె రగిలినవేళ
ఉఛ్వాస నిశ్వాసాల పెను తుఫాను
సృష్టించి ప్రఛండ వాయుప్రవాహంలో
అధఃపాతాళానికి అణచివేయ గలదు
తన శత్రుగణాలని....,

మానిని మానసం అర్థమై అర్థంకాని
గగనసుమం తెలిసీపోయిందను
కునేంతలో యేమి తేలియనీ బ్రహ్మ పదార్థం

పరువాలు చిగుర్చిన వసంతమై
మైమరిపింపగలదు కాదనుకున్న నాడు
గ్రీష్మమై నిప్పులు చెరగగలదు   తానే
మెచ్చెనో దయావర్షాన్ని కురిపిస్తూ
కళ్ళల్లో శరత్చంద్రికల విరబూయించగలదు
ఆమే కురిపీంచే ప్రేమ తుషారంలో నిను
ముంచీ ఆ చల్లనీ కరుణా రస సాగరాన
శిశిరంలోలా వణీకీంప చేయగలదు



బహుదూరపు బాటసారి

బహుదూరపు బాటసారి

మనసు విరిగిపోయింది
దుస్తులు చిరిగిపోయాయి
చెప్పులు అరిగిపోయాయి
అనుభవం పెరిగి పోయింది
ఆయువు తరిగి పోతుంది

బక్కచిక్కిన బరువైన దేహాన్ని
భారంగా మోస్తున్న కాళ్ళు
బరువుగా అడుగులేస్తూ
గమ్యంతెలియని బాటసారిలా
మౌనంగా మునుముందుకు
కదలి పోతూ నే వున్నాడు
అతన్నెవరూ చూడట్లేదు
చూసినా పట్టించు కోవట్లేదు

సుమ సౌరభాలతో పరిమళాలీనే
నందన వనాల్లాంటి సొబగులను దాటి
పరమదుర్గంధ భూయిష్ట మురికి
కూపాలలోకి అడుగుపేట్టాడు....

సుగుణ ధామున్నీ చూసాడు
పితృవాక్యపాలన గొప్పదనాన్ని
కంటినిండా కన్నాడు... భాతృ భక్తిని
గాంచి ఓస్ ఇంతేనా అని నాడనుకున్నాడు

లీలామానస మూర్తినీ చూసాడు
సామాన్యునికర్థంకానీ యెన్నెన్నో
లీలలు చూసాడు ధర్మాన్ని చూసాడు
భగవానుని చూసాడు., భక్తులను చూసాడు
దనుజులను చూసాడు అసురక్రీడలూ చూసాడు

ఆనాటినుంటి యెన్నెన్నో చూస్తున్నా
యెనాడూ మనసు చెదరని స్థితప్రజ్ఞుడు
ఈనాడు మనిషినని చెప్పుకుంటున్న
ద్విపాద మృగరాశిని గాంచి కలతవడ్డాడు

స్వార్థం కోసం నీడనిచ్చే రుహాల కూల్చి
సుఖాలకోసం కన్నవారినే యనాథలచేసి
ఎదుటి మానాభిమానాల దెబ్బతీసి
విజ్ఞానం పేరిట ప్రకృతికె యెదురోడ్డి
ప్రళయాలను కొనితెచ్చుకునే మూర్ఖ
నరరూప పిశాచాలంకురించిన నేటి లోకి
చూసి ఖిన్నుడై కదులుతూ  నే వున్నాడు
రేపటిలోకి.... తనని తాను మరచిన
కాలమనే బహుదూరపు బాటసారి



పెరుగుతున్న విజ్ఞానం వినాశానికా?

పెరుగుతున్న విజ్ఞానం పెడదారికి మూలమా?

ఆధునిక మానవుడు
కదులుతున్న విజ్ఞాన
సార్వభౌముడు
తలచుకుంటే చాలు వాడు
సాధించలేనిది లేదంటాడు
మైసూరుబజ్జీలో  మైసూరు
నేతి బీరలో నేయిని తప్ప

సాధించాడెన్నెన్నో...
అసాధ్యాలనే సుసాధ్యాలుగా
ఇంకేమి సాధించనున్నాడో
మితిమీరిన విజ్ఞాన ధనంతొ

పోయే ప్రాణాన్ని ఆపనూ వచ్చు
ఉరికే కాలాన్ని బంధించనూ వచ్చు
సూర్యునికే ప్రతిరూపమ్ము
సృష్టించనూ వచ్చు..,రేయన్న
దానినే రూపుమాపను వచ్చు

నవమాస గర్భాన్ని నాతులు మోసేటి
పనికింక సెలవిచ్చు కాలంబె వచ్చునో
నాల్గు మాసాల గడువింక సరిపొవునేమో

కలవారి కోడండ్లు కాపురాలకె తప్ప
కాన్పుల కష్టాలు మోసేటి బరువుల
తప్పించు తరుణమే  ముందున్నదేమో!

అద్దెగర్భాలు మోసేటి అద్దెతల్లులు కూడా
అవనిలో వెలసేటి కాలంబు వచ్చునో
పిండమార్పిడి జేసి గర్భాన్ని మోయించి
రెడిమేడు పిల్లలనే పెంచుకొందురు,.యేమో?

పెరుగుతున్న విజ్ఞానం పెడతోవలు పట్టునా
పెడదారిన జ్ఞానమదీయు వినాశనానికీ మూలమా

ఆకాంక్ష

కాలాన్ని క్యాసెట్ గా చేసి
కాలయంత్రంలో వేసి
మనం కోరుకున్న కాలానికి
చేరుకునే వీలుంటే
యెంత బావుండేదో!!

తెలిసీ తెలియని తనంతో
అమ్మ అంటే యేమిటో తెలియని
ఆ చిన్నారి ప్రాయంలో
నా అల్లరి చేష్టలతో ఆమెనెంత
విసిగించానో! ..తెలుసుకుని
క్షమించమని అడగాలనుంది

యౌవనంలో మిడిమిడి జ్ఞానంతో
నేనే తెలివిగల వాడినన్న భ్రమలో
పాతరోతనీ విసుగు దలతోకించపరచి
అనాదరించిన ఆరోజులలోకి పయనించి
క్షమించమని అడగాలనుంది

నాన్న భుజాల నెక్కి తిరగాలనీ
నాన్న కళ్ళతో నాయిా భవిష్యత్తు
లోకి తొంగి చూడాలని అతని
వేలుపట్టుకొని అడుగులు వేస్తూ
ఈ ప్రపంచాన్ని మరో సారి చూడాలనీ

నాన్న యదపై  సోలి
అభద్రతా భావానికే
అభద్రత నిచ్చిన ఆ ధైర్యాన్ని
తిరిగి పొందాలని వుంది

అమ్మా నాన్నల సాన్నిధ్యంలో
బాధ్యతెరుగని బాల్యాన్ని మరోసారి
నిండుగా ఆస్వాదించాలని
బాధ్యత నెరిగి వారి ననాదరించిన
నా తెలివిహీనతకు ప్రాయశ్చిత్తాన్ని
చేసుకోవాలనీ వుంది