Saturday 13 June 2015

నువ్వే నువ్వే ముమ్మాటికి నువ్వే

నువ్వే...నువ్వే...నువ్వే...ముమ్మాటికినువ్వే!

రాజకీయాలకు అవినీతి డిఫాల్టు
అన్యాయాక్రమాలు డౌనులోడులు
అవినీతన్నదే లేనినాడు రాజకీయానికి
అస్తిత్వం లేదు....మనం ఒప్పుకోము

బురదగుంట బురదగుంట అంటూనే
మనమే దానిని రొచ్చుగుంటను చేస్తున్నాం
పొరపాటున నీతిమంతులీ రంగాన కాలిడీతే
బురదలోకి లాగుతున్నాం లేదంటే
శంకరగిరి మాన్యాలకు పంపేస్తున్నాం

ఐదు నిమిషాలైనా ఆలోచించి వేసే
ఓటు కావాలి ...అది అవినీతికి వేటు....
కాని ఆలోచిస్తున్నామా మనం!!
లేదే....,,మనకంత తీరికెక్కడిది!

మనఓటు కాకూడదు అపాత్రదానం
ఉందా యెవరికైనా ఈ మాత్రపు జ్ఞానం
వేసే ప్రతీఓటూ అర్హత నెరుగని అర్భకునికైతే
అది అపాత్రత కాకుంటే పాత్రతెలా అవుతుంది?

ఉచితంగా నువ్వేయాల్సిన ఓటుకే
నోటునాశిస్తుంటే.... అవినీతి కి
ఆరంభమదే......
మూలంలోనే నీతి మృగ్యమైతే  ఇంకా
అవినీతి అంటూ ప్రేలాపన లెందుకో!!

ఏనేత చరిత్ర చూసినా యేమున్నది
గర్వకారణం
అడుగడుగున అవినీతి అక్రమాల
సంచితం
యెందెందు వెదకి చూచిన అందందే
గలరు
అవినీతి పరాక్రమ వీరాగ్రేసాసురులు

నీతి నీతి అనుచు నీవు
అవమానించకు.........
ఈ రాజకీయ వ్యవస్థని

ఓటునమ్ముకున్న నాడే
ఊడెను నీకా అధికారం 

భ్రష్టుపట్టిన వ్యవస్థకు
ఫస్టు కారణమే.... నీవు


వనిత విశ్వరూపం

వనిత విశ్వరూపం

నవతరానికి నాందియై
భావి తరాలకు పునాదియై
నవ జీవన శకానికి ప్రాణాలూదే
మమతాను రాగాల మూలవిరాట్టుయై
త్యాగానికి చిరునామాగా నిలిచే
అపర దైవ స్వరూపం అతివ స్వరూపం

నవ జీవన రూపకల్పనా క్షేత్రమై
జీవామృత సుధా రసధారా విలాసమై
మమతానురాగాంకుర ప్రదీపమై
త్యాగానికీ పర్యాయ పదమై
దైవానికి ప్రతి రూపమై
ఇలలో వెలసిన దివ్య స్వరూపం
ఇంతి స్వరూపం

అమ్మదనం లోని మాధుర్య మకరందపు
కమ్మదనాన్ని పంచే అమృత వాహిని
అనురాగ జలధిలో ఓలలాడించి
ఆప్యాయతానురాగాలను నేర్పే అక్షయప్రదీప్తి
సృష్టికే అమరత్వాన్నందించి సకల చరాచర
సృష్టి జీవన గమనానికి ప్రాణదాత ఈ ప్రణవ మూర్తి

Friday 12 June 2015

మదిలో వెలిగే దేవుడు

మదిలొ నిలిచిన దేవుడు

నాన్నా!
నాలోని నా అన్న వ్యక్తిత్వాన్ని
పెంచేవాడవనే కదా నిన్ను నాన్నా
అని పిలిచింది

ప్రతీ మనిషికి అమ్మ
దేవత నాన్న దేవుడు
ప్రాణి పుట్టుకకి అమ్మ
క్షేత్రమైతె నాన్న బీజం
బీజమే లేని ఏ క్షేత్రం
ఫలించదు కదా నాన్నా!

అమ్మ పదినెలలు కడుపులో
పెట్టుకు కాపాడితే
నువ్ జీవితమంతా భుజాలపై
మోస్తూ కంటిపాపలా కాపాడావే
నీ యెదపై భారమైనా
యేనాడూ అలసటన్నది
నీదరికీ రానీయనే లేదే

నా పొట్ట నింపడానికి 
ఆరాటపడేది అమ్మైతే
నలుగురి పొట్టలు నింపగలిగే
శక్తీనీ నాకిచ్చే యత్నానికే గా నువ్
తాపత్రయ పడింది

భగవంతుడిచ్చినవి మాకు రెండైతే
మూడోకన్నునిచ్చిందీ నీవుకాదా
దేవుడిచ్చినవి రెండూ అమ్మానాన్న
లైతే నువ్వించిన అదృష్యాక్షువు
జ్ఞానం కాదా నాన్నా!!

నాన్నా! ప్రత్వక్ష దైవానివై
నా రూపానికి మనసుకు
మూలకారకునివై అనుక్షణం
నాయెదుగుదలకు హార్మ్యానివై
కనుసైగలతో మము నడిపించావ్

నీ చేతి స్పర్షచాలు ఈ విశ్వాన్నే
జయించే విశ్వాసం....
నీ పలుకు చాలు అఖండ సామ్రాజ్యాన్ని
జయించగల నవొత్తేజాంకుర భావం

నీవు మము వీడిపోయావని
అందరూ అంటున్నా
యెక్కడికీ వెళ్ళలేదని
వెళ్ళలేవని నామనసుకు
తెలుసు
నామది జ్ఞాపకాల దొంతరవై
హృదయ తరంగ రవళివై
నా ప్రతి కదలికకూ రక్షవై
నా భవితకు సోపానానివై
నిలిచివున్నావని లొకానికి
యెలుగెత్తి చాటాలనుంది

నువ్వు మము వీడి వెళ్ళావు నువ్వు
నువ్వు తప్ప తక్కినవన్ని వున్నాయ్ !
కానీ నీకక్కడ యెవరున్నారు నాన్నా
ఒంటరివై యెంతటి క్షొభననుభ విస్తున్నావో!!

నువ్వున్నన్నాళ్ళు మా కళ్ళని
చెమర్చనీయనే లేదు
నువులేని నేడు కంటిలో చెమ్మ
ఆగడమే లేదు
కొండంత అండను కోల్పోయి
దిక్కులేని పక్షులమే అయినా
నువ్ నేర్పిన సంస్కారం నీవిచ్చిన
ఆత్మస్థైర్యం మాకు యెల్లకాలం రక్ష.



Thursday 11 June 2015

పోతుటీగలున్నాయ్ జాగ్రత్త

పోతుటీగలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త

మమతల మాగాణిలో విరబూసిన
పరిపుష్ఠ మకరంద మందారాలను
గాంచి, మధుర మకరందాన్ని గ్రోల వచ్చె
కొదమతేటులెన్నో...యెన్నెన్నో.........

బంబరాల భ్రమరనాదాలు
సప్తస్వరాల నొలికిస్తూ
మైమరపిస్తాయి.......
రకరకాల విన్యాసాలతో
నిను పరవశింప జేసి
మత్తులో ముంచెత్తుతాయ్ ...
విరులనితమ మధురనాదాలతో
మురిపించి మైమరపించి
మకరంద స్వాదనానంతరం
నినువీడి మరో సుమానికై
వెదుకుతూ  సాగిపోయే
పోతుటీగ లెన్నో .......యెన్నెన్నో......

కుసుమ కోమలమైన పుష్ప
రాజములారా! పూబంతులారా!!
తస్మాత్ జాగ్రతో జాగ్రతా!!

పైపై మెరుగులు మత్తుగొలపే మాటలు
మేకవన్నె పులులు మేధినిపై కోకొల్లలు
కాలికి గాయమైతే మందుపూయను వచ్చు
గాయాన్ని మాన్పనూ వచ్చు.....
మనసుకే గాయమైతే మానిపే మందేది?
బతుకుకే చిల్లు పడితే పూడ్చే మాకేది?

పైపై మెరుగులు కాదు ....
దేవుడిచ్చిన ఆకారం కంటే
సాధనచే సాధించుకున్న సంస్కారం సద్గుణాల కాంచు
అంది పుచ్చుకున్న ఆ  కరం  ఆసాంతం తోడుగా
వుండేలా గమనించు...హృదయాన్నే పరికించూ

అస్తమించిన అమ్మానాన్నలకో లేఖ

అస్తమించిన అమ్మా నాన్నలకో లేఖ

ఓ అమ్మా! ఓ నాన్నా!!

బ్రతికున్నన్నాళ్ళు
పలకరించని వాడు
ఇప్పుడీ ఉత్తరం రాయడమేంటనీ
ఆశ్చర్యమా?

నేనానాడు మిమ్మెల్నెంత
అనాదరించానో
నాకీనాడే అర్థమైంది,
తప్పుతెలుసుకుని
మీ పాదాలపైబడి
ప్రాయశ్చిత్తం చేసుకోవాలని
ఉన్నా నాకందనంత దూరంలో వున్నారే!!

ఒక్క సారి మీ ఒడిలొ
తలవాల్చి బోరుమని
ఏడవాలని వుంది
నాకన్నుల్లోంచి వచ్చే
పశ్చాత్తాపాశ్రువులతో
మీ పాదాలను కడిగీ
ఆనీటినీ తలపై జల్లుకోవాలనీ వుంది.......

జ్ఞానమనే  ముసుగును
కప్పుకున్న అజ్ఞానిని
అద్దంలాంటి మీ మనసుల్లొ
నన్ను నేను చూసుకుని
మీరే అజ్ఞానులని భావించిన అహంభావిని నేను

అనుభవాల పొత్తాలైన
మీ మంచి మాటలని
చాదస్తాలని యెగతాళి
చేసిన అవివేకిని నేను

నా భార్యా బిడ్డలే
నా లోకమని మీరంతా
వయసుడిగిన
అక్కరకురాని వృద్ధ జీవులని
అడుగడుగునా కించపరచిన
కిరాతకుడిని నేను

ఏ ఒక్క నాడూ మీతో
నవ్వుతూ   మాటాడలేదు
ఏ ఒక్క నిర్ణయాన్నీ మీతో
చర్చించి గైకొనలేదు
ఏ ఒక్కనాడూ మీతో కలిసి
భోజనమూ చేయలేదు

మీరిచ్చినదే ఈ జన్మని మరిచి....
మీరు యిప్పించిన జ్ఞానాన్ని విడిచి..
.మీరు నేర్పించిన సంస్కారాన్నీ కాదని
యౌవనపు కోరికల బందీనై.........

మీకిష్టం లేని ప్రేమవివాహం చేసుకుని
మిమ్మల్నే శత్రువులుగా భావించి
అనుక్షణం ద్వేషించాను... నాసుఖం
కోరేమీరు నా పెండ్లిననుమతించి కోడలిని
ఆశీర్వదించిన నాడు అవమానించాను.

నాకొరకు నా భార్యను
కొడలిగా స్వాగతించారు
అభిమానించారు ఆదరించారు

యెక్కడా దిక్కులెక దిగివచ్చారని
తూ  లనాడాను
అమ్మానాన్నలన్న ఇంగితాన్ని
మరిచాను...
మీ మనో వేదన గూర్చి ఆలొచించని
పెను రాయినయ్యాను
పశువునయ్యాను.....

చరిత్ర పునరావృతమౌతుంది
భూమి గుండ్రంగా వుండి తన
చుట్టు తానే తిరుగుతుంది.కదూ!

నా కొడుకులూ కోడళ్ళు మము
నిర్లక్ష్యం చేస్తుంటే.... నా మనసు
పడుతున్న ఆవేదనలొ
జ్ఞానోదయమైంది
నేనూ మిమ్మల్నెంత అవమానించానో

మేడలడగ లేదు మీకున్నదే మాకిచ్చారు
మూటలడగ లేదు మీ సంపాదనే నాకిచ్చారు
కేవలం ప్రేమ పంచమన్నారు
మనిషిగా చూడమన్నారు

ఆనాడా మాటల విలువ నెరగలేదు
కాని తెలివొచ్చేసరికి అంతా అయిపోయింది
పశ్చాత్తాపంతో కుములుతున్నా....

అమ్మా ! నాన్నా!! క్షమించమని అడిగే
అర్హతను సైతం కోల్పోయిన దుర్మార్గున్ని
అమృతమయమైన మీ మనసుతో క్షమించరూ!

కొడుకుల ప్రవర్తన చూసి బుద్ధి
తెచ్చుకోకండనీ ఈ తరానికీ చెబుతున్నా
మీరూ మారండీ అమ్మా నాన్నల్ని
గౌరవిస్తేనే మీ పిల్లలు మిమ్మూ
ప్రేమిస్తారని గుర్తుంచుకొండనీ
చెబుతున్నానమ్మా ఇదే నేను
మీపట్ల ఒనరించిన పాపానికి
ప్రాయశ్చిత్తం అమ్మా! నాన్నా!

వివక్షలేని లోకాలకై

వివక్ష లేని లొకాలకై అణ్వేషిస్తున్నా!!

వ్యధాభరితమై  బాధాతప్తమై
భావాభావమై ఎడారిగా మారిన
నా ఎదలోకి సైమానువై
ప్రవేశించావు ప్రేమ ఊసులతో

వ్యధలను సమాధి చేసి కరుణ వర్షాన్ని
కురిపించి, నిర్భావ ఎడారినే
అనంతభావాల ప్రేమ
సాగరంగా మార్చావు

ఘనీభవించి నిశ్చలమైన
భావపాషాణాన్ని నీ అమృత వాక్కులతో
కరిగించి ద్రవింప జేసావు.........

భావవాహినీ తరంగాలు
ఎగసిపడుతున్న నా హృదయ
సాగరంలో ప్రేమ సునామీనే
సృష్టించావు

ఎగసిపడే
ఆ ప్రేమతరంగాలలో
తడిసీ ముద్దయ్యాను

ఓ సఖీ!!

జీవచ్ఛవాన్ని స్పృషించి
పునరుజ్జీవితున్ని జేసి
కనపడకుండా పోయావు

అనంత వాహినీ కెరటాల ఝరులకి
తట్టుకోలేక కొట్టుకు పోతున్న నేను
నీ ఆసరాకై చేయి జాపుతున్నా.......
నిర్దయగా చూస్తున్నావే తప్ప
నాచేయి నందుకొని నన్ను కాపాడవెందుకు

కుల మత జాతీ వివక్షలే
నను నీ నుండి వేరుచేస్తే
ఈ అనంతాంతరాలున్న
అనంత విశ్వాన్నే నేను
బహిష్కరిస్తున్నా....
ఈ వివక్షలే లేని లోకాలకు
పయనమౌతున్నా
ఉన్నదో లేదో తెలియని
మరోజన్మలో నీకై వేచివుంటా

Wednesday 10 June 2015

మత్తు వదలరా! నిద్దుర మత్తువదలరా!!

మత్తు వదలరా నిద్దురమత్తు వదలరా!

ప్రభాత వీచికలు మీటిన
మౌన విపంచి కమరిన
మయూఖ తంత్రుల మౌన
రాగాలకనుగుణంగా కువకువ
రాగాలతో జగతిని జాగృత
మొనరించాలని తహతహలతో
తమ శక్తికి మించి యత్నిస్తున్నాయ్
పక్షిరాజులు.....

తమకంతో తమను తాము మరచిన
అండజాల ఆలాపనలు అర్థంలేని
భూపాల రాగాలై గాలిలో కలిసి
పోతూ నే వున్నాయ్ .....,,,
బలిసిన వాడి పాదాల కింద
నలిగే అన్నార్థుల ఆక్రందనలా

ఆకటి కోసం అలమటించె
బడుగు జీవులు భానుని కంటే
ముందే బద్దకాన్ని వీడి పనుల్లో
పడిపోయారు....జానెడుదరాన్ని
నింపే ధ్యాసతో....పిడికెడు పిట్టల
మేలుకొలుపులపై ఆధారపడకుండానే....

వారసత్వమో! అన్యాయార్జితమో!
మితిమీరిన సంపద బహూకరించిన
అజీర్తి రోగంతో అలమటించే
ఆదివిష్ణు హృదయ సామ్రాజ్య
మహారాజ్ఞి  ఇష్టసుతులు
మద్యపుమత్తూ   నిద్రమత్తునుండి
ఇంకా  తేరుకోనేలేదు.....,,,,

శీతొష్ణానిల చిరుచీకటి ముసిరిన
అద్దాల సౌదంలో....శేషతల్పాన్ని
తలదన్నే హంసతూ లికా తల్ప సమ
విలాసవంతమైన పానుపు పై తమ
గురకలే తమకు జోలపాడుతుంటే
ఆ మాధుర్యాన్నాస్వాదిస్తూ
నిద్రిస్తున్న సుసంపన్నుల చెవికి
విహంగాల సుప్రభాత గీతికలు గానీ
బాల భానుని కవోష్ణ కిరణాలుగాని
చేరలేవు ....వాటికా ధైర్యమూ లేదు

ఎవడాకలి చావు చచ్చినా
ఎవడప్పుల బాధకు పోయినా
ఏ అబల పురుషుని కామాగ్నులకు
బలైతేనేం...,,ఏ కోడలు అత్తల ఆరళ్ళకు
ఆరిపోతేనేం.,,,ఏ నిరుద్యోగి విసిగి
వేసారి పోయినా

సమస్యల వలయంలో మానవాళి
సతమతమౌతున్నా....పట్టించుకునే
తీరిక మెలకువ లేని ఓ స్థిత ప్రజ్ఞుడా!!
మేలుకో ! కొట్టుమిట్టాడే దీనుల నాదుకో

ఇనుప బీరువాలలో దాచిన ధనాన్ని
అప్పనంగా అందరికీ పంచబోకు
ఆ నల్లధనాన్ని శ్వేతవర్ణానికి మార్చు
కార్ఖానాల నెలకొల్పి ఉద్యోగావకాశాలు
కల్పించు.... నీవింకా ధనాన్నార్జించు
ఎండె డొక్కల కింత కూడు కల్పించు
వ్యర్థమౌతున్న శ్రామిక శక్తికి పనికల్పించు

నీవు తినడమే కాదు నీ సాటివారికి తిండి నిప్పించు
అందుకు సమర్థుడవని నిన్ను నీవు తెలుసుకో
సమసమాజ నీర్మాణానికీ ఆద్యుడవీవే కావాలి
మానవసేవలొనె పరమార్థముందని తలుసుకో!!



Tuesday 9 June 2015

కూరిమి పట్టని కూరజీవాలు

కూర జంతువునైన కూరిమే లేదా?

నన్ను మృదువుగా నిమురుతూ
నీవు  దగ్గరగా  తీసుకున్నపుడు
నీలో నా తల్లిని చూసానే!
పుట్టిన నాటినుండి ప్రేమగా
పెంచిన వాడివని విశ్వసించానే

నేను పుట్టిన నాడు ప్రేమగా యెత్తుకుని
పురిటి మకిలినంతా..... పూర్తిగా తుడిచి
నా తల్లి కంటెను మిన్నగా ప్రేమనే పంచి
తడబడు అడుగుల వేళ చెంతనే యుండి
వడి వడి అడుగులు వేసే విద్దెనే నేర్పావు

అధిక ఓగిరమైన  అజీర్తి యంటూ
శ్రద్ధగా  పోషించు  భారాన్ని మోసి
పూప పల్లవాలు పూటపూటా దెచ్చి
నోటికందించి  నన్ను  పెంచావే!

కన్న బిడ్డ కన్న కడు ప్రేమ తోడ
మానవతను జూపి నన్ను పెంచావు
నీ మీద ప్రేమనే నేజూపుతుంటి
నీ మీద నమ్మకం నే పెంచుకుంటి
మానవుడవైనా.... నీలోన దాగిన
దానవుడను నేను యిా రోజు కంటి

నా విశ్వాసాన్ని.. నీవు కొల్ల గొట్టావు
కసాయి కత్తితో.... నన్ను నరికావూ
పెంచుకున్నా ప్రేమ పటాపంచలైపోయే
ఒకపూట కూటికే ఇంత రాక్షసమా?

ఇన్నాళ్ళ ప్రేమంత నటన యేనా యది
కూరకోసమె నాపై కూర్మి చూపేవా?
బ్రతికేటి హక్కంటు ......మాకేమి లేదా?
మౌనమెందుకింక ,.,.,.బదులివ్వలేక?

Monday 8 June 2015

ఏక్ తార

https://www.facebook.com/groups/EKTAARA/

నిరాశ వలదు ఓ కవీ

రావాలి భ్రమలు ఫలించే రోజు

దారి తప్పుతున్న సమాజానికి
కళ్ళెం వెసి సరైన మార్గంలొ
పయనింప జేస్తున్నాయ్
నా అక్షరాలని భ్రమపడుతున్నావా కవీ?

నీ కరవాలాన్ని ఝులిపించి
భావతరంగిణీ మాలికల రాల్చి
అక్షర సుమ మాలికనల్లితే
అవి యెంతటి వారినైనా
ఆకర్షిస్తాయని భ్రమపడుతున్నావా?

ఖడ్గాలకే లొంగని లొహపు కుత్తికల
ఈ సమాజానికి కలాల బెదిరింపో లెక్కా?

ఖన ఖన మండే నిప్పురవ్వలలొ
కాల్చిన అంకుశాలను సైతం లెక్కించని
మదగజాలు ఈ పరుషాక్షర ప్రయోగ
మాలికలను లెక్కిస్తాయా?

మీరు  రాసిన అక్షరప్రబోధాలు
కాగితాలకే పరిమితమై పాఠకుల
మన్ననలు ......విమర్శకుల విమర్శలకే
తప్ప  సమాజాన్ని నడిపించే పథ సూచిక
లవుతాయనుకోవడం అత్యాశేనేమో?

ఐనా సరే!........నిరాశా నిస్పృహలు చెందక
నిద్రమత్తుతో తన గమనాన్ని మరచి
తూ లుతుా కదులుతున్న ఈ సమాజాన్ని
అక్షరాంకుశాలతో జాగృత మొనరించు

అభ్యుదయ భావాల అంబారీ కట్టి
స్వాభిమాన యుక్త నీతికే పట్టం కట్టీ
ప్రగతి పథాన పయనించేలా కరుడు గట్టిన
మదగజపు మదమడిచి గమ్యానికి చేర్చ యత్నించు

భావనలన్నీ భ్రమలైనా... బాధెందుకు
విసుగు విరామమెరుగని యత్నంలో
యేదోనాడు నీ ప్రయత్నం ఫలించక పోదు
సమసమాజ నిర్మాణం సఫలం కాకపొదు.

అక్కడి కెళ్ళకుంటె ఇక్కడి కెవడు(హాస్యం)

ఇచ్చిపుచ్చుకోవడం

     ప్రొద్దున్నే బెడ్ కాఫీ సేవించి పడక్కుర్చీలో కూర్చొని పేపర్ ని జుర్రుకుంటున్న అపర చండశాసనుడని కీర్తి వహించిన ముత్యాలరావు దగ్గరి కొచ్చి  చే తులు కట్టుకొని వినయాతి వినయంగా అతని సుపుత్ర రత్నం

     "నాన్నా! మా ఫ్రండు వాళ్ళ నాన్నగారు రాత్రి చనిపోయాట్ట, మా
ఫ్రండ్సంతా వెళుతున్నారు, నేనూ వెళ్ళాలను కుంటున్నాను, నాన్నా! వెళ్ళేదా?" అడిగాడు .

          కొడుకలా అడగడం నచ్చని ఆ తండ్రికి కోపం నషాలానికంటింది.

       "ఏం అక్కర్లా! పోయినోడు యెలాగూ పోయాడు, ఉన్నవాళ్ళకి సాయంమందించ డానకీ  చాలా మందుం
టారు....ఇక నువ్వెళ్ళి అక్కడ వెలగబెట్టెదేమి లేదు....లోపలికెళ్ళి పుస్తకాలు ముందే
సుక్కూర్చో...పో!" కసిరాడా తండ్రి.

        " అదికాదు నాన్నా! నా ఫ్రండు నాన్న గారు పోయినపుడు, నేను పోకపోతే..... నా నాన్న గారు పోయినపుడు మన ఇంటికి యెవరొస్తారు" అమాయకంగా నసుగుతూ న్న  సుతుని వంక గుడ్లప్పగించి చూస్తూ  నోరెళ్ళబెట్టాడా చండశాసన చక్రవర్తి.

మావిడి ఫలం అంతరంగం

ఫల మనోభావన

నన్ను చూడగానే  నీ కళ్ళలో
ప్రజ్వరిల్లిన కాంతి కిరణాలను
చూసి నేనెంతో పొంగి పోయాను

కాంక్షలూరె నీ కనులను ఆ కళ్ళలో
ఆకలి చూపులను చూసి సిగ్గుతో
కుంచించుకు పోయిన నన్ను ప్రేమగా
పొదివి పట్టుకుని నాతనువంతా
స్పృషిస్తూంటే నేను అనంతానంద
తీరాలలో తేలిపోయాను

నీపేదవులని నా పెదాలపై చేర్చి
నా లోని మధురామృతాన్ని గ్రోలుతుంటే
నా జన్మకి సాఫల్యత సిద్ధించిందని
మురిసి పోయాను.....పోంగి పోయాను

నీ పెదాలు నా మాధూర్యాన్ని గ్రోలుతుంటే
ఆనంద పారవశ్యంతో నీ కనులు
అరమోడ్పులౌతూ   మధుర లోకాలలో
నీ మనసు తేలిపోతున్న దృశ్యం
నేనెన్నటికీ మరచి పోను........

నీ చుంబనంలోని సుఖాన్నాస్వాదిస్తుంటే
నువ్ నీ చేతులతొ నా తనువంతా  యెక్కడెక్కడో
తడుముతూ  నన్నురెచ్చగొడుతున్నావ్ ....

నీ వెంత తెలివైన వాడివో......
నన్నెక్కడ మీటితె నీకు నేను పూర్తిగా
వశపడతానో తెలుసు..
నన్ను నీకనుకూలంగా మార్చుకుంటూ
నన్ను యేవేవో లోకాలలో విహరింపజేసావ్
నాలో నువ్వే ప్రాంతాన్నీ వదలలేదు

క్రమంగా నా ఆచ్ఛాదననీ తొలగించావ్
వలువల్లేని నన్ను చూసి పులివే అయ్యావ్
విజృంభంచావ్ .........
యెంతో కక్కుర్తీగా నా అణువణువుని
నీ స్వాధీనంలోకి తీసుకొని నన్నాక్రమించడం
ప్రారంభించావు.....

నాలోని నీకు కావలసిందంతా తీసేసుకున్నావ్
నన్ను పొందిన నీ కళ్ళల్లో తృప్తీ చూసాను....
నీ అవసరం తీర్చుకుని విసిరీ వేసినా బాధ లేదు
నీ ఆనందానికంటే నాకింకేం కావాలి..

నీ ఆరాటాన్ని అర్థం చేసుకోగలను
ఫలాలకే మహరాణీగా కీర్తించ బడీనా
అన్ని కాలాలలో నేనందను మీకనీ తెలుసు

రుచిలోనూ రూపంలోనూ మహారాణీనే
దేవతలు అమృతం తాగితే నేం
మారుచి నాస్వాదించలేదే...
కేవలం ఓక్క కాలానికే పరిమితమైన
మామిడిపండుని  మీసేవ కొరకే అవతరించాను


Sunday 7 June 2015

తిరుగుబాటు

తిరుగుబాటు

హృదయంలో పిడుగు పాటు....
భువన భోంతరాలే
దధ్ధరిల్లే కఠోర శబ్దాలకు
శరఘాత శశకమే అయిందామే

భూమే.. కంపించిందేమో
స్యేదగ్రంథులే కట్టలు తెగాయేమో!
కన్నీటి కడలిలొ సునామే వచ్చిందో!
మేదడు ఆలోచనా శక్తినే
కోల్పోయిందేమో!

కళ్ళలో  పెను చీకట్లావరించుకోగా
తూ లి పడబోయిన
ఆమెకు ప్రాణం లేని గోడే ఆసరా అయింది
ప్రాణమున్న వారు ఆసరా కూలుస్తుంటే!!

గ్రీష్మంతో రోహిణీ మమేక మైనట్టుగా
అత్తగారి మాటలకు భర్తగాడి వత్తాసు

రేపు తన గతేమిటో అన్న భయం కాదు....,
ఇంతకాలం వారిపట్ల పెంచుకున్న నమ్మకం
కూలిపోయిందే అన్న విచారం.....బాధ

మేక వన్నె పులులతోనా  ఇంతకాలం
సహ జీవనం చేసిందీ? అన్న అపనమ్మకం

అగ్ని పర్వతం బ్రద్దలైన హృదయం
లావాను విరజిమ్ముతుంటే.....
వెచ్చని ఆ లావాద్రవం కన్నీరైంది
కళ్ళు అగ్ని కణికలను రాలుస్తూ
యెర్రని యెరుపెక్కి రెప్పవేయడం
మరిచిపోయాయి.....

ఆ కళ్ళకే గనక శక్తి వుంటే భస్మమే....
యెదురుగా వున్నవారు.
అప్పటివరకు ధారగా కురిసిన
కన్నీటి ధార ఆగిపోయింది.

ఆమెలో యేదో మార్పు...అదే చైతన్యం
చదువుకున్న సంస్కారమిచ్చిన .... చైతన్యం

శరీర కంపనం ఆగింది
పిడికిళ్ళు బిగుసుకున్నాయ్
దవడ కండరం ఉబికి వచ్చింది
ముక్కుపుటాలు అదరుతున్నాయ్
కళ్ళల్లో కాఠిన్యం క్రమక్రమంగా..
చేరుతుంది వదనంలో గాంభీర్యం
ఆమె కంఠం లో నుండీ ఓ రణన్నినాదం
అక్కడున్న వారందరూ ఉలికి పడేలా.....

వీల్లేదు!

నేనొప్పుకోను....
లోపం యెవరిదో తెలుసుకోకుండానే
నన్ను దోషిని చేసి.... మీ వాడికి మళ్ళీ పెళ్ళా?
పరీక్ష చేయించండి నా లోపం వుంటే
ఆయనకీ మరో పెళ్శ చేయండి
అయితే.....
ఆయన లోపమే వుంటే.... నాకు మరో పెళ్ళి
మీరే చేయాలి ...
అలా అగ్రిమేంటుకు సిద్ధం కావాలి ముందు.
ఇది సమ్మతమా?

పిల్లలంటే మీకే కాదు మాకూ ఇష్టమే!
మీకోక న్యాయం  మాకో న్యాయం చెల్లదు..,
ఇకపై  సాగదు  ఈ దమన నీతి.
సమ్మతమైతే...రాయండి అగ్రిమెంటు!

అవాక్కయారా శ్రోతలు ....అపర చండిలా
రౌద్రాకారంలో నిప్పులుకక్కుతున్న ఆమెను
చూసి నోటమాటరాక నిశ్చేష్టులయారు.

బిల్లు కలెక్టరు

బిల్ కలెక్టర్

రెక్కాడితే గాని డొక్కాడని
కుటుంబానికి
బిల్లు వసూలుకు ఎప్పటిలాగే
వచ్చాడతను
మున్సిపాలిటీ బిల్లు కలెక్టరా?
కాదతను
అల్లారు ముద్దుగా పెంచుకున్న
బిడ్డకు మగడు

బిందెడు నీళ్ళతొ కాళ్ళుకడిగి
కూతురునిస్తే....
ఆ నీళ్ళనే తిరిగి యా కూతురి
కళ్ళవెంట తెప్పిస్తూ
అల్లుడిగా తన ప్రతాపాన్ని నిత్యం
ప్రదర్శించే ఉత్తమాధముడు
పశుత్వమే తప్ప మానవత్వ మెరుగని
పరమ కిరాతుడు
భార్యను మనిషిలా కాక పశువులా
చూసే పశువుకన్నా హీనుడు.


Saturday 6 June 2015

ఓ అబలా మేలుకో!!

ఓ అబలా మేలుకో!!

నాడు సతీసహగమనం
పేరిట సజీవ దహనం చేసి
పైశాచికానందంతో
కరాళ నృత్యం చేసిన
నర రూప పిశాచాలనూ
క్షమించిన క్షమాగుణం నీది

పెనిమిటి పొయాడన్న నెపంతో
నీ కెశాలని తీసి నిన్ననాకారిని చేసి
శిరోముండనం చేయించి ఏకవస్త్రం కట్టించి
చీకటి గదిలొ బంధించి
అపశకునానికి చిహ్నానివని
అవహేళన చేసి అవమానించినా
అసుర సమాన అహంకార పూరిత జాతినీ
క్షమించిన క్షమాగుణం నీది

కన్యాశుల్కం నాడు
కన్నవారి ధనదాహానికి బలై
ఈడుజారి కాడుజేరే వగ్గులకు
నిన్ను అమ్ముకున్న ఆ స్వార్థపరులనూ
క్షమించిన క్షమాగుణం నీది

నేడు వరకట్నం కోసం
అత్తారింటి వారి ధనదాహానికి బలైపోతూ 
ఆరళ్ళను పెట్టినా ఆడిపోసుకున్నా
అగ్నికాహుతి జేసినా
హలాహలాన్ని మింగిన పరమ శివునిలా
బాధని గుండెల్లో దాచుకుని వారినీ
క్షమిస్తున్న క్షమాగుణం నీది

కాలం యేదైనా వ్యవస్థ యేదైనా
రూపం యెదైనా అన్యాయమయ్యేది
బలైపోయేది నీవైనా... ఎదురు మాటాడక
మౌనంగా భరిస్తూనే వున్న సహనమూర్తివీవు

పురుషాహంకారంతో నీ స్త్రీ జాతినీ
రూపుదిద్దుకోక ముందే
కడతేర్చాలని చూస్తున్న
అమానుషాన్ని మౌనంగా చూస్తూ క్షమిస్తున్నావ్ 

తిరిగి తిరిగి పురుషాహంకారానికి
జన్మనిస్తున్నావ్  తల్లివై మమకారం
పంచి పోషిస్తున్న నీక్షమాగుణానికి
జోహారులు

ఎన్నాళ్ళు ..........ఇంకెన్నాళ్ళు.........
ఏ జంతు జాలంలొనూ కనరాని అమానుషం
నా నరజాతి ఆడజాతి కే అడుగడుగున అన్యాయం
నేత్రాలలొ రోషాగ్ని రుధిరజ్వాలల నింపుకుని
పురుష జాతి కబంద హస్తాల నుండి
విముక్తి  పొంది.....నువ్వో అపరకాళివై
శివమెత్తి భావితరాల నీజాతి
బానిసత్వానికి విముక్తి కలిగించుకో!!


నర విక్రయ సంతలు

నర విక్రయ సంతలు

అది పశువుల సంతేమి కాదు
కాని అక్కడ జరుగుతున్న దదే!

సంతలో పసులని కోనేముందు
దాని గుణగణాలను లక్షణాలను
నఖశిఖ పర్యంతం పరీక్షించి పరీక్షించి
బేరమాడతాడు ...కానీ.....ఇక్కడ?

అమ్ముకునే వాడూ అమ్ముడు పోయే వాడూ
కొనేవారి గుణగణాలనూ అందచందాలనూ
పరీక్షించి బేరాలాడుతున్నారు...చిత్రంగా

సభ్యసమాజం తలదించు కోవలసిన
దురాచార దుర్మార్గపు ప్రక్రియ
తరతరాలుగా కొనసాగుతున్న
మానవత్వం తలదించు కోవలసిన
ఏహ్యాతి యేహ్యమైన ప్రక్రియ......

ఎన్ని చట్టాలు చేసినా...ఎంతమంది
అభ్యుదయ వాదులు అరిచి గీ పెట్టినా
ఆగిపోనీ అత్యంతావమానాల ప్రక్రియ

పెళ్ళిచూపులంటు పెద్దలంతా చేరి
కాలొంక చేయొంక వంపుసొంపులవంక
కలికీ వ్యక్తిత్వాన్ని సవాలు చేసే కన్నెత్వపు
పరీక్షలంటూ కాంక్షలూరె కన్నులతొ
కోసరి కోసరి చూసుకుంటు  బేరమాడె
విఫణులయ్యె పెళ్ళిచూపు తంతులు
పశువుల సంతకన్న అధ్వాన్నపు తంతులు