Tuesday 16 July 2013

కవిగారి కళత్రం

                                     కవి గారి కళత్రం

                                                       విరించి

   

ఆరేళ్ళ ప్రాయం లోనే గోడ దూడ పేడ మేడ అంటూ వచన కవిత్వం వ్రాసి పలువురి ప్రశంసల

 నందుకున్న శ్రీనాథ్ ఇహ వెనక్కి తిరిగి చూడకుండా లెక్కకు మించి కవిత్వాలు వ్రాసి జిల్లలో కవిగా పేరు

  తెచ్చుకున్నాడు.


        ఒక మహా కవిగా పేరు గడించాలని,  మహా మహా కావ్యాలని రాయాలనేది మనవాడి జీవితాశయం,
  అందుకే తనలాంటి మహా కవి కావలసిన వాడికి ఏదో మామూలు అమ్మాయైతే సరిపోదని సాహిత్యంలో
  పట్టు కవిత్వంలో ప్రవేశం వున్నఅమ్మాయి భార్యగా వస్తే తనకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నది
  మనవాడి అభిప్రాయం.  

      అందుకే పెండ్లీడు ధాటి ఎనిమిదేండ్లయినా 523 పెండ్లి చూపులను దిగ్విజయంగా పూర్తి
  చేసుకున్నా ఏ అమ్మాయి అతనడిగే ప్రశ్నలకు జవాబివ్వలేక పోయినా తాను మాత్రం రాజీ పడక
  పట్టువదలని విక్రమార్కుడిలా పెండ్లి చూపుల కార్యక్రమాలని జరుపుకుంటూనే ఉన్నాడు    

        ఆ రోజు  అతని 524 వ పెండ్లి చూపులు

         శ్రీనాథ్ తల్లిదండ్రులకు మహా టెన్షన్ గా ఉంది.

        పెళ్ళిచూపుల కెళ్ళడం అక్కడ వారందించే అల్పాహరాది కాఫీ లను సుష్టుగా ఆరగించడం
  తరువాత అమ్మాయినేవో ప్రశ్నలడగడం ఆమె జవబివ్వలేదని రిజెక్ట్ చేయడం ఇదే గత ఎనిమిదేళ్లుగా
  జరుగుతున్న తతంగం, అందుకే వాళ్ళు కొడుకు ని దగ్గరగా కూర్చోబెట్టుకొని

            " ఓరే శీనూ! ఈ ఇంటి కోడలు కవయిత్రో కలెక్టరో కానవసరం లేదురా నీతో బుద్ధిగా కాపురం  
   చేసేదయితే చాలురా, మా బొందిలో ప్రాణముండగా ఈ ఇంటికి కోడలోస్తే చూసి ఆనందించా
   లనుందిరా" అని బ్రతిమాలారు.

       అమ్మానాన్నలంతగా బ్రతిమాలడం తో అయిష్టంగానే ఒప్పుకుని పెండ్లి చూపులకు బయలుదేరాడా
   రోజు.

       పెండ్లి చూపులారంభమయ్యాయి, పొట్టలో అంగుళం కూడా తగ్గకుండగా వివిధ రకాల తిను
  బండారాలను దట్టించి ఆ అంగుళాన్ని కూడా  వదలడా నికిష్టం కాక కాఫీ అనే ద్రవ పదార్థాన్ని
  సేవించి అమ్మాయి కొరకు ఎదురు చూస్తుండగానే పెళ్ళికూతురు సంహిత వచ్చేసింది.

        పాలలో పసుపు కలిపిన దేహ ఛాయ ఐటేక్స్ కాటుకడబ్బా పై వుండే కళ్ళ బొమ్మల్లాంటి
  కళ్ళు లవంగం లాంటి ముక్కు లిప్స్టిక్ వేయకున్న వేసినట్టున్న లేత తమల పాకు పెదాలు 
  చూడగానే సినిమా హిరోయిన్ లా వున్నఅమ్మాయి ని చూడగానే శ్రీనాథ్ తల్లి రెండు చేతులు
  జోడించి ఈ అమ్మాయే తనకు కోడలుగా వాచేలా చేయు తండ్రీ! అని ఇష్ట దైవానికి మొక్కుకుంది
   కూడా.

          అమ్మాయి అలా వచ్చి ఇలా కూర్చోగానే అమ్మాయి తండ్రి, పాపం అమాయకుడు శ్రీనాథ్
   గురించి అంతలా తెలియక పోవడం తో ఇవ్వకూడని అవకాశాన్ని ఇచ్చాడు.

          "బాబూ! అమ్మాయినేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు" అన్నాడు.

          ఆ మాటలు వింటూనే అదిరి పడ్డారు శ్రీనాథ్ అమ్మానాన్నలు, "ఏం అడిగేది లేదు "
   అని అంటుండగానే మన శ్రీనాథ్ రెట్టించిన ఉత్సాహం తో ప్రశ్నలనే బాణాలను
   ఎక్కుపెట్టడం ప్రారంభించాడు.

           శ్రీనాథ్ ప్రశ్నలన్నీ ఓపిగ్గా విన్న సంహిత చిరునవ్వుతో ఇలా అంది

          "అయ్యా! కవిగారూ ! మీ ప్రశ్నలన్నింటికి జవాబిస్తాను, అయితే ఒక షరతు నేనిచ్చే ఒక
   సమస్యను మీరు పూరించాలి, సమస్యా పూరణం తర్వాత మీ సవాలుకు నా జవాబు ఓకే
   నా" అని అడిగింది.

               ఆమె మాటలు విన్న శ్రీనాథ్ మహదానందపడిపోయాడు, ఇంత కాలానికి తనకు
   తగిన అమ్మాయి కనిపించిందని మురిసి పోతూ "సరే" అని ఒప్పుకున్నాడు.



                " చెప్పు సమస్యా పూరణం పెద్ద కష్టమేం కాదు, నీ సమస్యని ఇలా చిటికెలో పూరిస్తా "
   అని చిటిక వేస్తూ ఏక వచన సంబోధనతో అన్నాడు.

         ఆ విషయాన్ని గ్రహించిన సంహిత నవ్వుతూ సమస్యని చెప్పింది.

        "స్తనము లున్న మగడు ధన్య జీవి " అని చెప్పి ఇదండి సమస్య పూరించండి అని

   అడిగింది.

      పది నిమిశాలాలోచించాడు,

       ఉహు లాభం లేక పోయింది, కాని ఓటమిని అంగీకరించడానికి అహం అడ్డైంది. కాని ఏం చేయాలో
  అర్థం కాలేదు.

                "ఇది తప్పు,! సమస్యనే తప్పుగా ఉంటె పూరించడ మెలాగ? అసలు మగవారికి స్తనము
   లుంటాయా? అయినా ఇది అవధాన ప్రక్రియ అందుకే నాకు కాస్త ఇబ్బంది," అంటూ తన ఓటమిని
   ఒప్పుకున్నాడు                            

     ఇక ఈ పెండ్లి కూడా జరగదని అందరూ స్థిర నిశ్చయాని కొచ్చారు
   
     శ్రీనాథ్ తల్లిదండ్రుల మనసులు  ఉస్సూరు మన్నాయి.

           కాని సంహిత అందరి ఆలోచనలని తలక్రిందులు చేస్తూ పెళ్ళికి ఒప్పుకుంది, పెల్లిచూపుల్లోనే
   ఓడించిన ఈవిడ గారిని చేసుకుంటే జీవితాంతము ఓడక  ఏడవక తప్పదని మొదట కాస్త
   బెట్టుచేసినా  అవధాన ప్రక్రియ లో ప్రవేశమున్నఅమ్మాయి  భార్య గా దొరకడం అదృష్టం గా భావించి
    అంగీకరించాడు.

      చివరికి సిగ్గుని కూడా ప్రక్కన పెట్టి సమస్యకు పూరణ మేంటో తెలపమని కూడా అడిగాడు.

      అందుకామె పెళ్ళయ్యేవరకు ఆగక తప్పదని సున్నితంగా మందహాస వదనం తో చెప్పింది.

     వేదమూర్తులు నిర్ణయించిన శుభ ముహూర్తాన సంహిత శ్రీనాథ్ ల వివాహం అంగ రంగ
    వైభవంగా జరిగింది.

         శోభనం ఎప్పుడా అని ఎదురు చూడ సాగాడు శ్రీనాథుడు. శోభనంలో ఇంత కాలం అందనివేవో
    అందుతాయని కాదు. ఇంత కాలం ఊరించిన సమస్యకు పూరణం తెలుసుకో వచ్చని,

    ఆ పుణ్యకాలం కూడా వచ్చింది,

          గదిలోకి పాలగ్లాస్ తో వచ్చిన భార్యను బాహువుల్లో బంధించాలని ప్రేమ ఊసులాడాలని ఇంకా
     ఏమేమో చేయాలని స్వర్గంలో విహరించాలన్న విషయాన్ని కూడా మరచి పోయి  భార్యను
     చూడగానే  " సమస్యకు పూరణ మేమిటి?" అని ఆతృతగా అడిగాడు.

            భర్త ఆతృత ను చూసి నవ్వుతూ
        

            " పాల మీగడందు పసుపు కల్పిన రీతి

               మిసిమి కాంతి తోడ మెరయు సతికి

               ఘన నితంబులున్ జఘన మురువులు, ఎత్తు

               స్తనములున్న, మగడు ధన్య జీవి."


       ఈ పద్యాన్ని విన్న శ్రీనాథుడు భార్య తెలివి తేటల కబ్బుర పడి తానూహించు కున్నటువంటి భార్య
    లభించినందుకు ఆ దేవునికి థాంక్స్ చెప్పుకున్నాడు.
                      


No comments:

Post a Comment