Monday 3 March 2014

వృక్షవిలాపం

                                    వృక్ష విలాపము                                                       రచన: విరించి

   1)  నేనొక మఱ్ఱిమాను కడ నిల్చి కరంబున గొడ్డలూని యా
     
        కానల భూరుహాల నరకంగను యోచన చేసినంతనే

        మ్రానులు జాలితో పలికె మమ్ముల చంప దలన్తురేల మీ

       మానవ జాతి కెల్లెడల మంచిని కూర్చెడు వారమే కదా.

  
   2)  గాలిని పంచి జీవులను గాతుము సుందర సౌకుమార్యమౌ
     
        పూలను కాయలన్ మధుర పూర్ణ ఫలంబుల నిచ్చుచున్  సదా

       శ్రీ లను పెంపు జేసి తమ క్షేమము గొరెడు వారమైన మ

       మ్మేల నశింప గోర్తురు మహీ తలమందున స్వార్థ బుద్ధితో.        


   3)  తాలుము చంప బోవకుము ధర్మము కాదని చెప్పు చుంటి  ఈ

       నేలన జీవరాశులకు నిత్యము సేవలనందజేయు మ

       మ్మేల వధింతురో! కనగ ఇమ్మహి పుట్టిన వారి గుండెలే

       రాలుగ మారెనో ! అకట రక్కసు లైరి కదా నరాధముల్.

  4)  ముంతెడు నీరువోసి  మము మోదము మీరగ పెంచినారు మీ

       రెంతటి పుణ్యమూర్తులు మహీ తలమందలి జీవులందు  మీ

       యంతటి త్యాగులీ పుడమి యందున నెచ్చట కాననైతిమే

       సంతస మయ్యె మానవుల సద్గుణ శీలత కాంచినంతనే. 


  5)  తరువులున్న చోట కరువుకే కరువోచ్చు

       తరువులే జగతికి సిరులనిచ్చు

       తరువులన్న నేమి? తరగని పెన్నిధీ

       తరువులగును నిజాము ధరణి రక్ష
  6)   వృక్షరాశి ఘనత విమలుడే యెరుగును

        వృక్ష మొసగు మేలు వేలు వేలు

       వృక్ష రాశి నింక రక్ష సేయని నాడు

       నాశ మగును జీవ రాశి నిజము.


  7)  పాదపములు వీచి ప్రాణవాయువు తోడ

       జీవరాశి కోసగే జీవితంబు

       పాదపములె భువిన భగవంతు డౌనురా

      పాదపములె జనుల ప్రాణదాత.

  8)  చెట్లు  పెంచుకొనిన చీకు చింతల బాపు

       చెట్లు నరుల కెపుడు క్షేమమొసగు

       చెట్లు నరకు వాడు చీడరా జాతికి

       చెట్లు యొసగు మేలు పుట్లు పుట్లు


  9)   నరుల కొరకు సురులు తరువుల సృజియించి

        భువికి పంపినారు భూరుహముల

       వృక్ష జాతి నరుల వేల్పులై నిల్చేను

       భూసురావ లంద్రు భూరుహముల

  10)  భూమి లోన పుట్టి భూజాత సీతమ్మ

          అవని జనుల పూజ లందు కొనియె

         ధరణిలోన పుట్టు తరువులనీనాడు

         వెల్పులనగ నేమి వింత కలదు


   11)  వంట చెరుకు గాను ద్వార బంధాలుగా

          ఉన్నతాసనాలు ఓషధులును

          సెల్పు బొమ్మ లట్లు వివిధ రూపాలతో

          తనువు చీల్చి ఇచ్చు తరువులమ్మ

  12)   శుభము బడయు వేళ శోభించు పందిళ్ళు

          పచ్చదనము తోడ పసిమి తోడ

          పాదపములు మారు పందిరి గుంజయై

          శుభము కలుగునట్లు అభయ మిచ్చు   

  13)  తాను చితిగ మారి తనువునే కాల్చును

         పరమపదము వొందు నరులనిలన

        మరణ మొందు వాని మార్గమందున తాను

        తోడు వచ్చు వాని కాడు వరకు

   14) తరువులున్న నేల హరితమై విలసిల్లు

         హరితమున్న చోట హరియు నిలుచు

        హరి హృదయము నుండు సిరియు తా కదిలొచ్చు

        సిరుల మూల మదియె తరులు సుమ్ము

  15)   హంతకుడైన మానవుడు హత్యలు జేయుచు భూ రుహావళిన్

          అంతము జేయ సిద్ధపదు యల్పుడు  జాతికి మేలు గూర్చు మా
       
          దెంతటి కష్ట జీవనము ఇంచుకనైన చరింపలేని వా

          సంతుల మైతిమోయి పరుశాయుధ ఘాతము తప్పు నెప్పుడో.
                   
      

     

  
        

No comments:

Post a Comment