Thursday 6 March 2014

సీనీమాయాష్టకం

                                                       సిని మా(యా)ష్టకం
                                             రచన: విరించి

    1)  ఏ మాత్రము లజ్జనకయె

         భామల యందాల జూపి భాగ్యము గుడువన్

         యేమని జెప్పుదు దీన్ని  సి

         నీ మాయను తెలుప లేను నేనీ జగతిన్.



    2)  ఏమీ? ఒక్కడు పదుగురు
 
         భీమాదుల వంటి వారి పీక మడన్చన్

         ఏమాత్రము వెరవడట సి

        నీ మాయను తెలుపలేను నేనీ జగతిన్


    3) పాములతో నాడింతురు

       గ్రామ శునకముల నయినను రయముగ నాడిం

       చే మన చిత్రాలు గన సి

       నీ మాయను తెలుప లేను నేనీ జగతిన్.



    4)  రోమములే నిక్కబొడుచు

         కామపు కేళీ వికార కావ్యపు దృశ్యా

         లే మార్చు పసిడి మనసు  సి

         నీ మాయను తెలుపలేను నేనీ జగతిన్



    5)  కామిని యందాలను జూ

         పే మాయాలోకము గని పిచ్చిగ వనితల్

         తామూ వదలిరి లజ్జ  సి

        నీ మాయను తెలుపలేను నేనీ జగతిన్


    6)  ఏమియు నుందని చేతుల

       నేమేమో సృష్టించు నంట ఎంతటి చిత్రం

       ఈ మా నేతే ఘనుడు సి

       నీ మాయను తెలుపలేను నేనీ జగతిన్



    7)  భామల బరువగు స్తనముల

         నేమాత్రము జంకుగొంకు నేరక చూపే

        భామే రాణిగ వెలగ సి

        నీ మాయను తెలుపలేను నేనీ జగతిన్



    8)  కామ వికారపు చేష్టలు

         రాములనవమాన పరచు రంకుల దృశ్యం

        బేమి కళా పోషణము సి

        నీ మాయను తెలుపలేను నేనీ జగతిన్. 
                     

No comments:

Post a Comment