Thursday 27 March 2014

పాతసీసాలో..........

                                  పాత సీసాలో .....
                                     విరించి

         ఈ కథ చదువుతుంటే అక్కడక్కడ కాస్త పాత వాసన వస్తుంది, కాని ఇది ఆ పాత కథ కాదు, అలా అని చెప్పి ఈ కథ పూర్తి కొత్తది అని చెప్పను.

       మన తరాని కంటే ముందుతరాల నాడే పుట్టిన ఈ కథను ....తరువాత తరాలకు కాలమాన పరిస్థితుల కనుగుణంగా కాస్త పుటం పెట్టి మెరుగులు దిద్ది తెలుగు పాటకుల కందించాలన్న చిన్న ప్రయత్నం ......పాత కథకు కాస్త పొడిగింపు. అంతే...

       రంగయ్య   ఉరఫ్  రంగడు ఓ పేదవాడు,  ఎంత పెదవాదంటే  ఏ సి గదుల్లో కూర్చొని బర్గర్లు పిజ్జాలు తినలేనంత,... ఘుమ ఘుమ లాడే బిర్యానీ పులిహోరాలు తినలేనంత ...వేడి వేడి నీళ్ళతో మైసూర్ శాండల్, పీయర్స్ సబ్బుతో రుద్దుకుని స్నానం చేయలేనంత... శ్రీచందనాది కలపతో తయారు చేసిన పట్టె మంచం పై హంస తూలికా తల్పం వేసుకుని హాయిగా నిదురించ లేనంత,...పట్టు పీతాంబరాలు కట్టుకుని చందనాది లేపనాలని శరీరానికి పూసుకోలేనంత,... ఇమ్పాలా డాడ్జ్ కార్లలో తిరగలేనంత, పేదవాడు.

       దొడ్డుబియ్యం, జోన్నరొట్టే లతో కడుపు నింపుకుంటూ ఇంటి కి దగ్గరలో ఉన్న ఓ చిన్న చెరువులో స్నానం చేస్తూ , అక్కడక్కడ చిరుగులున్న ముతక బట్టలనే అపురూపంగా వేసుకుంటూ ఓ పన్నెండు చదరపు గజాల వైశాల్యంలో ఎండా వానలనుండి రక్షించే స్థాయిలో ఉన్న ఓ చిన్న గుడిసెలో నివసిస్తూ తన జీవితమనే రైలు బండిని మరణమనే గమ్యాన్ని చేరడానికి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న బహు దూరపు బాటసారి రంగడు.

        ఆ రంగాని జీవితమనే రైలు బండిలోకి  పెండ్లి అనే ఒకానొక మజిలీలో ప్రవేశించిన మరో బాటసారి మంగ.

     మంగ, రంగడు భార్యాభర్తలై కలిమికి లోటైనా ప్రేమకు ఏమాత్రం లోటు లేకుండా ఇరుకైన ఆ ఇంట్లో విశాలమైన మనసులతో సంతృప్తిగా జీవించ సాగారు.

       ప్రొద్దున్నే తన పనులన్నీ ముగించుకుని రంగడు ఓ గొడ్డలిని భుజాన వేసుకుని  క్షత్రీయులని   చంప ప్రతిన బూనిన పరశు రాముని వలె  దగ్గరలోని అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి ఊళ్ళల్లో అమ్మి ఇంటికవసరమైన సరకులని తెచ్చేవాడు, రంగనితో బాటు బయలుదేరి ఆ ఊరి మునసబు గారి తోటలో పనికి వెళ్ళేది మంగ, సాయంత్రం వచ్చేపుడు ఆ తోటలోంచి కాసిని మల్లెపూలు కోసుకోచ్చేది,

    రాత్రి ఆ మల్లెలని సిగలో ముడుచుకుని ఇరుకైన ఆ ఇంట్లో చిరిగినా చాపపై వేసిన ఓ ముతక బొంత పై భర్త సరసన చేరి సరసాలతో ఓటమి లేని క్రీడలో క్రీడించి స్వర్గం అంచులదాకా వెళ్లి అలసి స్వేదంతో తడిసిన శరీరాలతో వేడి వేడి నిట్టూర్పులతో హాయిగా నిదురించే వారు.  

       ఒక రోజు ఎప్పట్లాగే గొడ్డలి చేత బూని అడవికి వెళ్లి ఓ చెరువు గట్టు మీద వున్న ఎండిన చెట్టును కొట్టసాగాడు, మిట్ట మధ్యాహ్నం ఎండా తీవ్రగా ఉండడంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి, అరచేతులని కూడా వదలలేదు, దానితో గొడ్డలి జారి పోయింది చెరువులో పడిపోయింది.  దిగి గొడ్డలిని తీసుకోవచ్చు కాని తీసుకోలేదు, అలా తీసుకుంటే మన కథ ఇక్కడే ముగిసేది. గొడ్డలి చెరువులో పడిందని ఏడుస్తూ చెరువు గట్టుపై కూర్చుంది పోయాడా అమాయకుడు.

       మనవాడి ఏడుపు విన్న జలదేవతకు  హృదయం కరిగింది, వెంటనే అతని ఎదురుగా ప్రత్యక్షం అయి " రంగయ్యా! ఎందుకేడుస్తున్నావ్?" అని అడిగింది.
  
      రంగడు విషయం చెప్పగానే ఆ దేవత చెరువులో మునిగి తళ తళ లాడే వజ్రపు గొడ్డలితో పైకొచ్చి రంగయ్యకు అందించింది, దాన్ని చూసి రంగయ్య తనది కాదని తిరస్కరించాడు, ఆ తర్వాత మిల మిల లాడే బంగారు గొడ్డలిని అందించ బోయింది, అదీ కాదనడం తో దగద్దగాయ మానంతో ప్రకాశిస్తున్న వెండి గొడ్డలిని తీసుకొచ్చింది, అదికూడా తనకక్కర లేదని తనది కానిది ఏది తాను తీసుకోనని చెప్పడం   తో ఈసారి పాతది తుప్పు పట్టిన ఇనుప గొడ్డలిని తెచ్చింది, దాన్ని చూడగానే సంతోషం తో తీసుకున్నాడు, అతనిలోని నిజాయతికి మెచ్చిన జల దేవత ఆ నాలుగు గొడ్డళ్ళని రంగనికే ఇచ్చి అంతర్ధాన మైంది.

         రంగాని ఆనడానికి అవధులు లేవు వజ్ర బంగారు వెండి ఇనుప గొడ్డళ్ళని   అందుకుని మార్కెట్లోకి పరుగెత్తి అమ్మడం ప్రారంభించాడు, అతనికి బంగారం వెండి ఎక్కడ అమ్మాలో ఎలా అమ్మాలో ఇంతకు అమ్మాలో తెలియదు, చిన్నప్పుడెప్పుడో అంగళ్ళలో రత్నాలు అమ్మినారట ఇచట అన్న పాట విని ఉన్నాడు కనుక అంగట్లోకే వెళ్ళాడు, ఒకడీ అమాయకుని అమాయకత్వాన్ని బాగానే సొమ్ము చేసుకొని ఎంతో కొంత ఇచ్చి నాలుగింటిని హస్తగతం చేసుకున్నాడు.

       ఇంకేం ఆ వచ్చిందే ఎక్కువనుకున్నాడు గుడిసె స్థానం లో మెడ, ముతక బట్టలు పోయి మురిపాల వస్త్రాలు టేకు మంచం యుఫాం బెడ్డు బిపిటి బాస్మతి బియ్యం ఫియర్స్ సబ్బులు ఫేర్ అండ్ లవ్లీ ఫేర్అండ్ హ్యాండ్సం లు వచ్చేసాయ్

     దంపతులు పనుల్లోకి వెళ్ళడం లేదు హానీ మూన్ లే హానీమూన్ లు దేశం లోని అన్ని ప్రాంతాలను చూసొచ్చారు,

     ఇల్లంతా ఏ సి చేయించారు, మల్లెల స్థానంలో కృత్రిమ సెంట్ వచ్చింది               
          
      ఇంతైనా వారి హృదయ వైశాల్యాలు చెక్కు చెదర లేదు.

     ఒకరికి ఒకరి ఇద్దరొకటై జీవిస్తున్నారు.

      ఇంతకు ముందు ప్రతి రాత్రి స్వర్గతీరాలకు వెళ్లి వచ్చేవారు, ఇప్పుడు ప్రతీ రాత్రి స్వర్గాన్ని గదిలోకి తెచ్చుకుంటున్నారు.

      వారి అనురాగంలో మార్పు రాలేదు, ఆప్యాయతలో తేడా రాలేదు ప్రేమ కుదించుకు పోలేదు.ఆనందాల ననుభవించడంలో భేదం రాలేదు.

       మంగ లేనిది రంగడు, రంగడు లేనిదే మంగ ఒక్క క్షణం ఉండేవారు కాదు.

      అందుకే పనులు మానుకున్నారు, శ్రమ సౌఖ్యాన్ని వీడారు, శారీరక సౌఖ్యాల వెంట పరుగు తీసారు.

      గాలిలో ఉంచిన కర్పూరం ఆవిరవక మానదు, కూర్చుని తింటుంటే సిరి కొండంతున్నా కరగక మానదని పెద్దలేనాడో  చెప్పారు, ఇక్కడా అదే జరిగింది, కొన్నాళ్ళకే ఆస్తులు కరిగి పోయాయ్, తిరిగి చిన్నా చితక పనుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది.

        తినే నోరు తిరిగే కాలు ఆగవుగా ..........  కొన్నాళ్ళకు గోదావరి పుష్కరాలు వచ్చాయ్, జనులు తండోప తండాలుగా గోదావరి తీరానికి వెళ్లి స్నానాలు చేసి వస్తున్నారు, ఈ విషయం తెలిసి మన ఆదర్శ దంపతులు సైతం వెళ్లాలని అనుకోని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని డబ్బులు అప్పు తీసుకొని బాసర్ ప్రయాణమయ్యారు. బాసరలో జనసంద్రాన్నే చూసారు.

         అక్కడే ఉన్న పురోహితున్ని మాట్లాడుకుని  జనాలను చేదిస్తూ నదిలోకి దిగి పురోహితుడు మంత్రాలు చదువుతుంటే దంపతులు సరిగంగ స్నానాలు చేయసాగారు, విపరీతమైన రద్దీ ఉండడం వాళ్ళ ఎవరో నెట్టడం తో మంగ నదిలో పడిపోయింది, ప్రవాహం విపరీతమైన వేగంతో ప్రవహించడం తో చాలా వేగంగా కొట్టుకు పోసాగింది మంగ, క్షణ క్షణానికి దూరం పెరగ సాగింది,  అక్కడున్న వాళ్ళు కాపాడడానికి ఎంతో ప్రయత్నించి చాలించుకున్నారు.

       కర్తవ్య మూడుడై కిం కర్తవ్యం అన్నట్లుగా నిలబడిపోయిన రంగనికి భార్య నీటి పాలవడం తో ఏడుపు ముంచుకొచ్చి  బావురు మని ఏడ్చాడు.

       రంగాని ఏడుపు వింటేనే కరిగిపోయే జలదేవత అతని ముందు ప్రత్యక్షమై " ఎందుకొరకు ఏడుస్తున్నావ్ రంగా!" అని ఆప్యాయంగా అడిగి విషయం తెలుసుకుని వెంటనే గోదావరిలో మునిగి రెండు క్షణాలలో అనుష్క లాంటి అందమైన అమ్మాయితో తిరిగి ప్రత్యక్షమైంది , ఇదిగో నీ భార్య అంటూ ఆ అమ్మాయ్ ని ముందుకు నెట్టింది, రంగడు అయోమయంగా కాసేపు చూసి ఆ వెంటనే ఆ అమ్మాయ్ చేయిపట్టుకొని తనవైపు లాక్కున్నాడు.

         ఈసారి అవాక్కవడం దేవత వంతైంది, రంగని చర్యకు కోపంతో ఉడికిపోతూ  " ఇదేంటి రంగయ్యా! ఈవిడ నీ భార్య మంగ కాదుగదా, ఎలా స్వీకరించావ్?.........నీలోని నిజాయతి చచ్చి పోయిందా  లేక నీ భార్య మీద మోజు తగ్గి కొత్త రుచులకోసం కొత్త పెళ్ళాం కావలిసోచ్చిండా?" అని అడిగింది.

        ఆ మాటలకు రంగయ్య  " తల్లీ! నా నిజాయతి చావలేదు నా భార్య పై ప్రేమ తగ్గలేదు, కాని నీవు తెచ్చిన ఈ అమ్మాయ్ నా భార్య కాదూ అన్నానే అనుకో అప్పుడు మరో ఇలియానా లాంటి అమ్మాయ్ ని తేస్తావ్ ఆ తర్వాత సమంత చివరికి గంగను తేస్తావ్ ఆ పిమ్మట నా నిజాతతికి మెచ్చి  ఈ నలుగురిని నాకే అప్పగిస్తావ్, పేదవాన్ని నలుగురు భార్యలని పోషించే శక్తి సామర్థ్యాలు నాకు లేక మొదటమ్మాయ్ తోనే సరిపెట్టుకుందామనుకున్నా!" అంటూ చెబుతున్న రంగని మాటలకు నవ్వుతూ అంతర్దానమై రెండు క్షణాల తర్వాత మంగతో ప్రత్యక్షమైంది జలదేవత.           

  
   

No comments:

Post a Comment