Wednesday 19 March 2014

చిత్తు కాగీతం

                                                చిత్తు కాగితం
                                                   రచన: విరించి
-------------------------------------------------------------------------------------------------------------
        వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బందురం సిందు రాననం అంగం హరే   పులకభూషణ మాశ్రయంతీ భ్రుంగాంగనేవ....... ..... .......    
       మా ఆవిడ గళం లోంచి కనకధార స్తోత్రం ఎంతో శ్రావ్యంగా వినిపిస్తుంది.

     ప్రతి రోజు  ఉదయం కనకధార స్తోత్రం  ఆ తర్వాత రామరక్షాస్తోత్రం అటు పిమ్మట శ్రీ లక్ష్మీఅష్టకం  ఇలా ఫుల్ స్టాప్ లేకుండా పారాయణం చేస్తూ పనులన్నీ చక చకా చేసుకోవడం ఆమె అలవాటు.

     ముందు గదిలో పడక్కుర్చీలో కూర్చొని మా ఆవిడ గాత్ర మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పేపర్ చదూకోడం నా అలవాటు. ఇది కొత్తదేం కాదు మా పెండ్లైన నాటి నుండి వస్తున్నదే.

      ఈరోజు పారాయణం చేస్తూ పూలు కోస్తున్న మా వరలక్ష్మి మధుర గాత్రం మధ్యలో టక్కున ఆగడంతో నేను డిస్ట్రబ్ అయినట్టుగా ఫీలై పేపర్ లోంచి తలెత్తి గేటు వైపు చూసాను.

       మా ఆవిడ పారాయణం మధ్యలో ఆపిందీ అంటే ఏదో ఉపద్రవం ముంచు కొస్తుందన్న మాటే.

     నా సిక్స్త్ సెన్స్ బ్యాడ్ సిగ్నల్ ఇవ్వ సాగింది.

      క్యోశ్చన్ మార్క్ ముఖం వేసుకొని గేటు వైపు చూడసాగాను .    

      "ఏమండీ! అన్నయ్య పోయాట్ట " ఒక చేత్తో పూలబుట్ట పట్టుకొని పరుగేత్తినట్టుగా   వస్తూ నన్ను చూడగానే అరిచినంత పనిచేసింది.

       ఏ......ఏ......ఏమిటి !?...ఆమె చెబుతున్న ఆ అన్నయ్య ఎవరో అర్థం కాక అడిగాను.

       "విశ్వమన్నయ్యటండీ!......రాత్రి పోయాట్ట, సీతారాం గారు ఇప్పుడే కబురంపారు" చెబుతున్న ఆమె కంటం లో వణుకు స్పష్టంగా తెలుస్తుంది.

        ఆ వార్తని నా మెదడు రిసీవ్ చేసుకోడానికి పది క్షణాలు పట్టింది.

        అది పిడుగు పాటులా నా హృదయాన్ని తాకింది.

      గుండె బరువెక్కింది, చేతుల్లోని పేపర్ జారిపోయింది. ఆవార్తని నమ్మలేక పోతున్నాను.

      "నిన్న రాత్రే కదుటండి మనింటికొచ్చి దాదాపు రెండు గంటల పైగా కూర్చొని వెళ్ళాడు, అంతలోనే ఏమై ఉండొచ్చండి" తిరిగి నన్నే అడిగింది.

     ఆమె ప్రశ్నకు జవాబిచ్చే స్థితిలో నేను లేను  బాధగా ఓ నిట్టూర్పు వదులుతూ

     "ఈ రోజుతో వాడు అవమానాల నుండి కష్టాలనుండి విముక్తి పొందాడు," నాలో నేనే అనుకున్నాను.

     "పదండి వెళదాం చివరిచూపైనా దక్కుతుంది".... అని "ఉండండి అబ్బాయికి కోడలుకి చెప్పొస్తా"

అంటూ లోనికి వెళ్ళింది

      నేనలాగే శూన్యం లోకి చూస్తూ నిస్తేజంగా కూర్చుండి పోయాను.

     ఓ ఐదు నిమిషాలలో లోపలి నుండి వస్తూ "పదండీ! ఇంకా అలాగే కూర్చున్నారేం, తెమలండీ!" అంటూ తొందర పెట్టింది.

     "నేను రాలేను వరం, శవంగా వాణ్ని చూసి తట్టుకోలేను" ఎంతో బాధగా అన్నాను. నా గొంతు లోని జీరను గమనించి నా బాధనర్థం చేసుకుని నా దగ్గరకొచ్చి నా భుజం పై చేయి వేసి

      "ఎం చేయగలం చెప్పండి? ప్రతీ వాళ్ళం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వాళ్ళమే! ఒకరు ముందు ఒకరు వెనుక అంతే! మనమే ఇంతలా బాధ పడుతున్నాం ఇక భార్యా పిల్లలెంతలా బాధ పడుతున్నారో పాపం! త్వరగా వెళ్దాం పదండి" మరీ మరీ తొందర చేయ సాగింది.

        ఆమె మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు

    ఆ ఇంట్లో వాడికోసం ఏడ్చే వాల్లెవరున్నారని అందామను కున్నాను కాని అనలేక పోయాను.

       "సరే పద !" అంటూ కుర్చీ హండిల్ పై ఉన్న ఉత్తరీయాన్ని భుజం పై వేసుకొని బయటకొచ్చాను  నా వెనుకే వరం.

      ఇంటిముందే ఆటో ఉండడం తో మౌనంగా దాంట్లో కూర్చున్నాం.

     ఒక్క జర్క్ తో ఆటో ముందుకు కదిలింది, నా ఆలోచనలు  వెనక్కి  పరుగెత్త సాగాయ్

       విశ్వం తో నాకున్న అనుబంధాన్ని నెమరు వేసుకోసాగాను.

      నిన్న రాత్రి ఇంటికొచ్చి  రెండు గంటలు పిచ్చాపాటి మాట్లాడుతూ మాటల మధ్యలో వాడు   "ఒరేయ్ దశరథం .......కాశి వెళ్ళాలని ఉందిరా చేతలో చిల్లి గవ్వ లేదు, ఓ ఐదు వేలు సరదా గలవా!? అని అడిగాడు, అలా అడగడానికి ఎంత మొహమాట పడ్డాడో వాడి కళ్ళే చెప్పాయి.

     ఏనాడు ఎవరినీ ఎలాంటి సాయాన్ని అర్థించని వాడు ఈ రోజిలా అడగాల్సోస్తున్నందుకు బాధ పడుతున్నాడని గ్రహించి  టేకిట్ ఈజీ అన్నట్టుగా వాడి తోడ పై చేయి వేసి

    "నువ్వూ సుభద్రా వెలుతున్నారా!? ఐదు వేలెం సరిపోతాయిరా పది ఉండని" అన్నాను

    నా మాటలకు వాడదోలా నవ్వి  " ఆవిడ గారిప్పుడు కొడుకులు కోడలు మనవలూ అన్నలూ వదినలూ అందరితో బిజీ కదా వీళ్ళందరినొదిలి ఆవిడ గారు రారులే, నేనొక్కన్నే వెళ్తాను." అని చెప్పి కొద్దిగా తటపటాయిస్తూ స్వరం తగ్గించి  "ఈ డబ్బుల్ని మల్లి తిరిగి ఎప్పుడిస్తానో, అసలు ఇస్తానో లేదో నీ ఋణం లో పడిపోతానేమో రా" అన్నాడు వాడి కళ్ళల్లో నీళ్ళు,

    ఇన్నాళ్ళ మా స్నేహం లో వాడి కళ్ళల్లో తడిని నిన్ననే చూసి చలించి పోయా.

     ఆప్యాయంగా వాడి భుజం పై చేయివేసి " నీ కంటే నాకు వేరే ఆత్మీయులెవర్రా! నీ కోసం నేనీ చిన్న సాయాన్ని కూడా చేయకూడదా! ఈ చిన్న విషయానికి ఋణాలు అంటూ అంతంత పెద్ద మాట లెందుకురా!? సరే గాని డబ్బులు ఎప్పుడిమ్మంటావ్" అని అడిగాను .

      " రేపుదయాన తీసుకొని టిక్కట్ రిజర్వ్ చేసుకుంటాను టిక్కెట్ ను బట్టి నా ప్రయాణం రా"   అని రాత్రి విశ్వం నాతో అన్న మాటలు ఇంకా నా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయ్.

      ఏనాడు తనకై ఇది కావాలని అడగని వాడు, అడక్క అడక్క ఒకేఒక సాయాన్ని కోరి దాన్ని సైతం అందుకోకుండానే వెళ్ళిపోయాడు.

    అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం ........ అంటారుగా ఇవి రెండూ వీడికి సిద్ధించాయి..... మహానుభావుడు.

      ఈ మాటలు మనసులో మెదలగానే నా కను కోలుకుల్లో నుండి రెండునీటి బిందువులు రాలి చెంపల మీదుగా జారి చోక్కాపై పడ్డాయి. 

      అప్పటి వరకు భారంగా ఉన్న గుండె బ్రద్దలైందేమో అన్నట్టుగా దుఖం తన్నుకు రాసాగింది. ఆపుకోడానికి ఎంత ప్రయత్నించినా ఆగడం లేదు. ఛాతీ భుజాలూ ఎగిరెగిరి పడసాగాయి, నా పరిస్థితి గమనించిన వరలక్ష్మి నా వీపు నిమురుతూ  "అందరినీ ఓదార్చాల్సిన మీరే ఇలా కృంగి పోతే ఎలా" అంటూ ఓదార్చింది,

     వరలక్ష్మి స్వాంతన వాక్యాలు నాలో దుఖాన్ని రెట్టింపు చేసాయి, మేమున్నది ఆటో లో అని కూడా మరచిపోయి ఆమె ఒడిలోకొరిగి పోయి బోరున ఏడ్చేసా.....ఓ పదినిమిశాలలా ఎడిస్తేనేగాని నా గుండె బరువు తగ్గలేదు.     

      విశ్వం వాళ్ళ ఇంటికి చేరుకున్నాం

    భుజం పైనున్న ఉత్తరీయం తో కళ్ళు తుడుచుకుంటూ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను

   ఆశ్చర్యం

   ఆ ఇల్లు చావింటిలా లేదు

  సోఫా లో కూర్చుని పెద్దబ్బాయి రేహాన్ కాఫీ త్రాగుతున్నాడు. మూడోవాడు  అవినాశ్  లాప్ టాప్   తో కుస్తీ పడుతున్నాడు

    వంటింటి డోర్ కానుకొని సీతారాం తో మాట్లాడుతూ సుభద్ర నిలబడి ఉంది. రేహాన్ భార్య రేఖ వంటింట్లో బిజీగా ఉన్నట్లుంది, గిన్నెల శబ్దం వినిపిస్తుంది. ఎక్కడా శవం కనిపించట్లేదు.

     సీతారాం మమ్మల్ని చూసి  "ఓ! వచ్చారా ! రండి నేనే కబురు పెట్టాను, ఎంతైనా ఆయన గారికున్న ఆత్మీయులు ఆపద్భాందవులు బాల్య స్నేహితులు మీ రొక్కరే గా!" అంటూ లోనికి పిలిచాడు.

    నా మతి పోయింది ఇంట్లో ఓ మనిషి చనిపోతే వీళ్ళింత కామ్ గా ఎలా ఉండగలుగు తున్నారో నా కర్థం కాలేదు

    "పదండి అవుట్ హౌజ్ లో శవం ఉంది" అంటూ అటు వైపు కదలాడు, అతన్ననుసరించి మేము వెళ్లాం .

   మంచానికి ఆరడుగుల దూరంలో నేలపై అస్తవ్యస్తంగా పడి ఉన్నాడు విశ్వం.

    రాత్రి ఎప్పుడో ప్రాణం పోయినట్టుంది, శవం బిర్ర బిగుసుకు పోయింది. కనీసం చెదిరిన లుంగీని సైతం సరిచేయలేదు.

     "రాత్రే పోయాడనుకుంట,ఎవరమూ చూళ్ళేదు, ప్రొద్దున్నే పనమ్మాయ్ గది ఊడ్వడానికొచ్చి చూసి మాకు చెప్పింది వెంటనే మీకు కబురు చేసా" అని సీతారం చెబుతుంటే నా గుండె నెవరో పిండినంత బాధేసింది.

     అందరూ ఉంది ఎవరూ లేని ఏకాకి లా పోయాడు,.......

   శవం దగ్గరకెళ్ళి చెదిరిన గుడ్డలు సరిచేసి సరిగా పడుకోబెట్టి పనమ్మాయి ని కేకేసి తలవడ్డ దీపాన్ని వెలిగించా
     ఈ లోకం లోని రాగాద్వేశాలతోను కుట్రలూ కుతంత్రాలతోనూ పనిలేదని నిశ్చింతగా నిద్రలోకి ఒదిగి పాయినట్టుగా   ప్రశాంతంగా ఉన్న వాణ్ని చూస్తుంటే నా కళ్ళు జల పూరితాలయ్యాయ్
                    ఓ మిత్రమా నువ్వే కదా ఈనాటి విజేతవు

                  " పుట్టిన ప్రతి ప్రాణి జీవన గమ్యం మరణమే అయితే

                   ధనవంతుల బలవంతుల నేన్దరినో ఎందరెందరినో 

                   ఓడించి లక్ష్యాన్ని సాధించిన పందె కాడవు నువ్వు

                  ఈ రోజు విజేతవు నీవు, గమ్యానికామడ దూరం లో

                  ఆగి లకష్యాని చేరలేక మేమోడిపోయాం ఈ పాప కూపం లో మిగిలి పోయాం"

 
అని అనుకున్నాను ,

     "మున్సిపాలిటీ వాళ్ళు మధ్యాహ్నం ఒంటిగంట దాటితే కాని రావడానికి కుదరదన్నారంకుల్" అని సీతారం తో రేహాన్ చెబుతుంటే అర్థం కాక ఏమిటన్నట్టు సీతారం కేసి చూసాను.

    నా చూపుల్లోని భావాన్ని గ్రహించిన అతను  " పిల్లలండి, మన ఆచారాలు వ్యవహారాలవేం వాళ్లకు నచ్చవు,శవాన్ని దహనం చేయడమే కదా కావలసింది, అంతోటి దానికి తమ పనులను పాడుచేసు కోడమెందుకని మున్సిపాలిటీ వాళ్ళ కప్పగించాలనుకుంటున్నారు. వాళ్ళు చేసేది కూడా   అదే కదా, బూడిద చేసే దానికి ఎవడైతే ఏంటని సెంటిమెంట్ పేరా తమ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోడమెందుకు అన్నది వీళ్ళ అభిప్రాయం, వాళ్ళ కుటుంబ విషయం లో మనం తల దూర్చడం ఎందుకు అని నేను ఓకే అనేసా,.......... " అంటూ పరోక్షంగా నా నోరు మూయించ డానికో హెచ్చరిక అన్నట్టుగా చెప్పాడు.  

   సీతారాం మాటలు నన్నెంతో బాధించాయ్

    సుభద్ర వద్దకెళ్ళి   " ఏంటమ్మా! ఇది ఇలా చేస్తారా? ఎవరైనా!" అని నిలదీయ బోయాను .

    "అబ్బాయ్ ఎలా చెబితే అలాగే కానివ్వండన్నయ్య" అంది. నెమ్మదిగా.

    ఆమె అలా అనగానే లాగిపెట్టి ఓ చెంపదెబ్బ వేయాలన్నంత కోపం వచ్చింది. కాని నా విజ్ఞత నా ఆవేశాన్ని చల్లార్చింది.

       "ఆర్గ్యుమెంట్లక్కర లేదంకుల్  ఈ మనిషికి ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండనిచ్చి తిండి పెట్టిందే మహా గొప్ప. ఇంకా దహనాలు దశ దిన కర్మలు ........ నాన్సెన్స్ ................
       వీడు అమ్మను వంచించి లొంగదీసుకున్న కామాంధుడు, తన సుఖాల కోసం అమ్మను తన వారందరికీ దూరం చేసిన స్వార్థ పరుడు, మామయ్యల పరువును మంటగలిపి అవమానించిన దుర్మార్గుడు." ఆవేశంగా ఇంకా ఏమేమో అనాలనుకుంటున్న రేహాన్ సీతారాం సైగతో తన మాటలనాపి వగరుస్తూ ఉండిపోయాడు.

     వాడలా ప్రేలుతుంటే నేను ఉగ్ర నారసింహాన్నేఅయ్యాను
    కోపం తో నా కళ్ళు చండ్ర నిప్పులే అయ్యాయ్,ముక్కుపుటాలు ఆదరసాగాయ్, దవడ కండరం బిగుసుకుంది, రెండు పిడికిళ్ళు బిగుసుకున్నాయ్. కోపంగా రేహాన్ కేసి చూసాను, ఆ చూపులకే శక్తి ఉంటె వాడు నిలువునా బూడిదయ్యేవాడే.......
     నా హృదయంలో చేల రేగుతున్న భాడాభాగ్నిని గమనించిన మా వరం తన చేతితో నా చేతిని నొక్కి కళ్ళతో శాంతించండి అన్నట్టుగా చూడ్డం తో ఎంతో ప్రయాస తో నా కోపాన్ని చల్లార్చుకున్నాను.

   కోపం స్థానంలో ఆ కుటుంబమంటేనే అసహ్యం కలిగింది.

     నా ప్రాణ స్నేహితుడు నిలువెత్తు త్యాగమూర్తి, ప్రేమకే పర్యాయ పదం, ఒక ఐనింటి అమ్మాయి కష్టాన్ని చూసి తట్టుకోలేక తన బ్రతుకునే త్యాగం  చేసుకున్న అమృత మూర్తిని అనాధలా మున్సిపాలిటి వారికప్పగించడం నచ్చలేదు, అలా అని స్వతంత్రించే స్థితిలో కూడా లేను.
    రెండు నిమిషాలాలోచించి ఓ నిర్ణయానికొచ్చాను,

   "చూడండి సీతారాం గారు, వాడికి తల కొరివి పెట్టి మీ మీ అమూల్యమైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు.సంస్కారం లేనివాళ్ళు మొక్కుబడిగా చేసే దిన ఖర్మ లేమి  అక్కరలేదు కాని అనాధగా మున్సిపాలిటి వారికి అప్పగించే బదులు ఏదైనా మెడికల్ కాలేజి వాళ్లకు అప్పగిస్తే వాడి ఆత్మ సంతోషిస్తుంది. మీకు ఓకే అయితే కాలేజ్ కి ఫోన్ చేస్తాను" అని నా నిర్ణయాన్ని చెప్పి వాళ్ళ సమాధానానికి ఆగాను.

    నా మాటలు వాళ్లకు తోడ గిల్లి జోల పాడినట్టుగా అయిందని వాళ్ళ ముఖాలే చెప్పాయి.

   వాళ్ళు దానికి ఒప్పుకోవడం తో మెడికల్ కజేజ్ కు ఫోన్ చేయడం వాళ్ళు రావడం వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని చక చకా ముగించుకొని అంబులెన్స్ లో శవాన్ని తీసుకెళ్ళడం ఓ మూడు గంటల్లో పూర్తయింది.

     అంబులెన్స్ లో శవాన్ని ఎక్కుస్తుంటే నా కళ్ళనుండి జారే కన్నీటికి అడ్డు కట్ట వేయలేక పోయాను.

   
   "మిత్రమా! క్షమించు, అనాధ లా దహనమై బూదిదయ్యేకంటే నీ శరీరం కొంత మంది భావి వైద్యులకైన ఉపయోగ పడితే నీ ఆత్మ శాంతిస్తుందని నేనీ నిర్ణయం తీసుకున్నా, ..... నా నిర్ణయం సరైనదే అయితే నన్నాశీర్వదించు, ఒక వేల తప్పే అయితే ఓ మూర్ఖ స్నేహితుని తప్పిదం అని క్షమించు." అని మనసులోనే వేడుకొని మా వరాన్ని తీసుకుని ఇంటి ముఖం పట్టాను.

    మౌనంగా నాలుగడుగులు వేసాము, జరిగిన  బాగోతాన్నంతా  దగ్గరుండి చూసిన వరానికి ఏమి అర్థం కాక,  అయోమయ స్థితిలో ఉందని నాకు తెలుసు.

    తన సందేహాలను తీర్చుకోకుండా ఇక క్షణం కూడా ఉండలేడని తెలుసు.

      ఇక ప్రశ్నల పరంపర ప్రారంభ మౌతుందని తెలుసు.

    నా ఆలోచనలు నాలోనే ఉన్నాయ్, మౌనంగానే ముందుకు నడుస్తున్నాం.

    మౌనాన్ని భంగం చేస్తూ "ఎంటండి,వాల్లేంటి అలా ప్రవర్తించారు," నేనను కున్నట్టుగానే తన సందేహాలను నివృత్తి చేసుకోడానికి ప్రయత్నాన్నారంభించింది.

      "ఏమండీ! అన్నయ్య అంత దుర్మార్గుడా,కన్నా కొడుకే అలా అంటున్నాడంటే అయ్యే ఉంటుంది లెండి. నా స్నేహితుడు నా స్నేహితుడు అని వెనకేసుకు రాకండి, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి" అన్నది మా వరం నాకేసి ఏదోలా చూస్తూ.

      ఆవిడతో ఏ విషయాన్ని చర్చించొద్దు అనుకున్నాను కనుక ఆమె ప్రశ్నలకు సమాధానంగా కాకుండా " ఎవ్వరిన తండ్రికి తల కొరివి పెట్టను అన్నాడంటే అర్థం కాలేదా పిచ్చిదానా చచ్చిన వాడి గురించి చెడ్డగా మాట్లాడంటేనే వాళ్ళెంత బుద్ధి మంతులో అర్థం చేసుకోవచ్చు." అన్నాను.

        "అదికాదండీ. అసలు ఈ చనిపోయినాయన దుర్మార్గుడా కాదా అది చెప్పండి ముందు" అని అడిగింది. నేనేం బదులివ్వలేదు, నిశ్శబ్దంగా నడవసాగాను

    తిరిగి అదే ప్రశ్నను కాస్త హెచ్చు స్వరంతో అడిగింది, అయినా నేను నా మౌనాన్ని వీడలేదు.

    నా మౌనం ఆమె నమ్మకాన్ని పెంచిందేమో, " మీ స్నేహితుడని ఎంతో గౌరవించాను ఇలాటి వాడని ముందే తెలిస్తే ఇంట్లోకి కూడా రానిచ్చేదాన్నికాదు" అంది.

          ఆమె మాటలు శూలాల్లా నా గుండెని గుచ్చుకున్నాయి.కోపంగా ఆమెకేసి చూసి,

     "వాడి గురించి నీకేం తెలుసని అలా నోరు పారేసుకుంటావ్ తెల్లనివన్నీ పాలు కావు కదా అతనో మహాను భావుడు ఓ త్యాగమయి ప్రేమ తత్వం మానవత్వం మూర్తీభవించిన ఓ గొప్ప వ్యక్తి అతనంటే ఏమిటో తెలిస్తే వీళ్ళు ఎంతటి దుర్మార్గులో అర్థమౌతుంది, " అన్నాను.

     "చెప్పంది ఎలా తెలుస్తుంది చెప్పండి మరి మీ స్నేహితుని మానవత్వం ప్రేమతత్వం" హేళనగా అన్నది.        

     ఆమె కంటం లోని హేళనకు నాకు ఒళ్లంతా కంపరం పుట్టింది. 

     ఆమెకు విషయం చెప్పాలనే నిర్ణయించుకున్నాను. "పద నడుస్తూ చెబుతాను వాడి గురించి," అని ఎలా మొదలు పెట్టాలా అని ఓ నిముషం ఆలోచించి

         "ఒంటు కుదిరేవరకు వాడిన కాగితాన్ని ఒంటు కుదరగానే చిత్తు కాగితమని నలిపి చెత్త కుండీలో పారేస్తాం కదూ" అని అడిగాను.

     "అన్నయ్య గురించి చెప్పవయ్యా అంటే కాగితాలు లెక్కలు అంటూ మొదలు పెట్టావ్ ఎప్పుడూ మీకు ఈ కాగితాలూ కలాలూ లెక్కలూ ఉండేవే. ఆయన గురించి చెప్పండి" విసుక్కుంది.

      ఆమె ఆత్రానికి నవ్వుతూ   
" నాది విశ్వంది సుభద్రది ఒకటే ఊరు, సుభద్ర వాళ్ళు ఎంతో సంపన్నులు, విశ్వం పదెకరాల భూమికి వారసుడైనా తండ్రి చిన్ననాటనే పోవడం తో పెళ్ళికాని ఇద్దరి అక్కలు ఒక చెల్లెలు రోగాలతో మంచం పట్టిన తల్లి బాధ్యత ఉండడం తో పది తర్వాత చదువు నాపేసి వ్యవసాయం చేస్తూ పాతికేళ్ళ వయసులోనే ఇద్దరక్కల ఒక చెల్లెలి పెళ్లి  చేసాడు.

        సుభద్ర  వాళ్ళ కాలేజ్ లో చదివే ఓ ముస్లిం అబ్బాయ్ తో ప్రేమ వ్యవహారం నడిపి ఒక రోజు వాడితో లేచిపోయింది, పరువు ప్రతిష్ట లకు ప్రాణం పెట్టె వారి కుటుంబంలో ఈ వార్త సునామే అయింది.  

      కూతురు ల్ర్చి పోవడం తో పరువు పోయిందని భావించిన ఆమె తండ్రి ఉరి పోసుకుని పోయాడు, కూతురుతో పరువు, పరువుతో భర్త పోవడం తో తట్టుకోలేని ఆమె తల్లి కూడా కొద్ది రోజుల తేడాతో  గుండెపోటుతో పోయింది.    

       వాళ్ళ కుటుంబం ఊళ్ళో తిరగడమే మానుకున్నారు కొంత కాలం,

       దేన్నైనా కాలమే మానిపిస్తుందిగా అందరూ సుభద్ర గూర్చి మర్చిపోయారు, ఐదేళ్ళు గడచిపోయాయ్  ఎవరిపనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అప్పుడు వీళ్ళందరి జీవితాలని  ఒక్క కుదుపు కుదిపిన సంఘటన జరిగింది.

     ఇద్దరు పిల్లలను వెంటేసుకుని సుభద్ర అన్న వాళ్ళిల్లు చేరింది, ఘోర రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడని అత్త మామల వద్ద కెళితే ఇంట్లోకి రానివ్వలేదని ఏడ్చింది, ఇక్కడ అదే జరిగింది, వీళ్ళూ ఒప్పుకోలేదు, ఏడ్చింది, తనకోసం కాకపోయినా ముక్కు పచ్చలారని పసికూనల కోసమయినా చెల్లలిగా కాకపోయినా పనిమనిషిలా అయినా తనకు ఆశ్రయమిచ్చి పిడికెడు మెతుకులు పెడితే చాలంది.

    సీతారాం కాళ్ళ మీద పసికూనల వేసింది, అయినా సీతారాం గుండె కరగలేదు, పైగా పసివాడని కూడా చూడకుండా కాలితో తన్నాడు, ఏకంగా ఆమె చిన్నన్నయ్య పొలాలకు వేసే పురుగు మందు డబ్బా తెచ్చి ఆమెకిస్తూ "నువ్వో నీ పిల్లలు తాగి చావండి ఇంకా బ్రతికారని తెలిసిందో నేనే చంపేస్తా నంటూ ఆమె జుట్టు పట్టుకొని ఇంటవతలకి గెంటేసాడు.

         అడ్డు పోయిన మమ్మల్ని వాళ్ళ కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దని బెదిరించాడు, ఆ కుటుంబమంటే మాలో ఉండే భయ భక్తుల వాళ్ళ మేమంతా మౌన ప్రేక్షకుల మయ్యాము, ఆమె పట్ల మాకు సానుభూతి ఉన్న ఏమి చేయలేక పోయాము,

        సుభద్ర ఏడుస్తూ చేసేదేం లేక చెరువు గట్టు పైకి వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చుని ఏడవ సాగింది, ఈ ఆకలి చూపులతో అవకాశం ఎప్పుడొస్తుందా ఎలాగైనా అందాల రాశి ని లొంగదీసుకొవాలని ఎదురు చూస్తున్న మగ మృగాలున్న ఈ లోకంలో    బ్రతకడం కష్టమే నని గ్రహించి తన పిల్లలని చంపి తానూ చావడానికే సిద్దమైన ఆ వేళ

      అప్పుడే పొలం నుండి వచ్చి విషయం  తెలుసుకున్న విశ్వం పరుగు లాంటి నడక తో సుభద్రను చేరి ఆమె చేతుల్లోని విషం డబ్బాని లాక్కుని పిల్లలని తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు, ఆమెకు ఆశ్రయమిచ్చాడు.

       ఈ విషయం తెలిసి సీతారాం రఘురాం లు పంచాయతి పెట్టించారు, ఒక అయినింటి అమ్మాయిని అన్నలమైన మేమే కాదూ కూడదు అని తిరస్కరించాక  నువ్వు నీ ఇంట్లో ఎలా ఏ అధికారం తో ఉంచుకున్నావని అడిగారు. ఆ పంచాయతిలో, అది తమని అవమాన పరచినట్టే నని బెదిరించారు.       
       వయసులో ఉన్న ఆడపిల్లని ఏ హక్కుతో ఇంట్లో పెట్టుకున్నావని అడిగారు, ఏ సంబంధం లేక ఒక అమ్మయినల ఇంట్లో పెట్టుకోవడం వాళ్ళ ఊరు చెడిపోతుందని హెచ్చరించారు.
  
    ఎవరెంత అన్నా విశ్వం తొణక లేదా బెనక లేదు "ఆపదలో ఉన్న స్నేహితురాలిని ఆడుకోవడం తన ధర్మమని మానవత్వం మంట గాలిపె విధంగా ప్రవర్తించిన వారికి తనని ప్రశ్నించే అధికారం లేదని, ఒక అమ్మాయిని ఆదరించా డానికి హక్కులు హోదాలే అవసరమైతే తాను ఆమెకిష్టమైతే ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు భర్త హోదాతో ఆమె పిల్లలకు తండ్రిగా వారిని ఆదరిస్తా నని సభా ముఖంగా చెప్పాడు,

    ఆమెకూడా ఈ పెళ్ళికి తన సుముఖత తెలపడం తొ మేమంతా దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసాం, ఒక ఉన్నత కుటుంబానికి చెందినా అమ్మాయిని ఆ కుటుంబా న్నెదిరించి పెళ్ళిచేసుకొని ఆ ఊరు పెద్దమనుషులను ఎదిరించాడని గ్రామ బహిష్కరణ విధించారు కూడా, ఊళ్ళో వాళ్ళ తీర్పుని గౌరవించి తనకున్న పదేకరాలని అమ్ముకుని దగ్గరున్న టౌన్ కి వలస వెళ్లి పోయాడు, అతని పదేకరాలని చాల చవకలో కొట్టేసాడీ సీతారాం.

    ముసలి రోగిష్టి తల్లిని ఇద్దరు పసి కూనలని భార్యను తీసుకొని టౌన్లో ఇరుకు ఇంట్లో కాపురమారంభించారు,పెద్ద చదువు లేకపోవడం తొ పచారి కోటలో గుమస్తాగా జీవనాన్నారంభించి చాలీ చాలని జీతంతో బ్రతుకు బండి సాగదీసాడు.

   తర్వాత నాకు నీతో పెళ్లయింది ఉద్యోగ రీత్యా మనం ఈ పట్నం వచ్చాం, నా బ్రతుకు నా సంసారం నా బిజీ నాది పోయింది, టౌన్ లో ఎంతో కష్ట పడి తన శక్తికి మించి పిల్లలను చదివించాడు. వీళ్ళిద్దరికీ పుట్టినాడు చిన్నాడు అవినాష్.
 
     పెద్దన్ని కెమికల్ ఇంజనీర్ను చేసాడు రెండోవాడు డాక్టర్ మూడోవాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వీళ్ళంతా ఫారిన్ లో యం యస్  చేసోచ్చిన వారే.

    ఉద్యోగాల పేరిట ఎప్పుడైతే వీళ్ళు పట్నం గడ్డ నెక్కారో అప్పుడే సీతారాం రఘురాం దృష్టిలో పడ్డారు, చదువుల్లో బాగా స్థిరపడిన పిల్లలను చూసి వాళ్లకు క్రమంగా దగ్గరయ్యారు పెద్దాడికి సీతారాం కూతురుని రెండోవాడికి రఘురాం కూతురిని ఇచ్చి పెళ్లి చేసి విశ్వం పై ఎన్నో ఎన్నెన్నో అభూత కల్పనలు చెప్పి పిల్లల మనస్సులో విష బీజం నాటారు.

     పిల్లలకు విశ్వమంటే అసహ్యం కలిగేల మార్చడంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు చూసిన విన్న తతంగం...... ఇప్పుడు చెప్పు విశ్వం దుర్మార్గుడా నరరూప రాక్షసుడా?" అని అడిగి ఆమె జవాబు కొరకు ఎదిరి చూసాను.

    "అమ్మో! ఈవిడ గారు మహా గడుసు పిండమే, అంతలా ఉపకారం చేసిన భర్తని అలా అనాధలా ఎలా వదిలెయ గలిగిందండి పాపం అన్నయ్య జీవిత మంతా కష్టాలే"  అని మళ్ళి "మీరావిడ గారిని నాల్గు మాటలు కదిగేలేక పోయారా?"అంది

      "ఆమెదేం  తప్పోయ్  మీ ఆడవాళ్ళ సహజగుణమే అంత, పుట్టింటి వాళ్ళన్నా కన్నా పిల్లలన్నా మమకారం ఎక్కువ ఒక వయసంటూ వచ్చాక భర్తతో నవ్వుతూ మాట్లాడాలన్న భయమే పిల్లలెక్కడ
చూస్తారో అని పిల్లలు భర్తతో అంటి ముట్టి ఉంటె ఏమనుకుంటారో అని సిగ్గు,

    రాత్రి భర్తతో పడుకోవడానిక్కూడా ఇష్టపడరు కదా అందుకేగా నువ్వు పిల్లలు పెద్దయ్యారు అంటూ మనవలతో పడుకుంటున్నావ్. నాకోక్కడికి ఔట్ హౌజ్  ఇచ్చినట్టు వేరే గది నిచ్చారు, కనీసం మీ  స్పర్శ కూడా   తగల నీయకుండా జాగ్రత్త పడతావ్, ఎప్పుడో నేను కూడా విశ్వం గాడిలా ఏ రాత్రో ఏ గుండె నేప్పో వచ్చి అనాధలా పోతాను, తెల్లవారి కాఫీ తెచ్చి నా శవానికి త్రాగిద్దువులే ." నిష్టూరంగా అన్నాను.

   నా మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుందేమో మా వరలక్ష్మి

       "క్షమించండి, మీరెన్ని సార్లో చెప్పారు కానీ నేను మీ చిలిపి వేషాల కోసం అంటున్నా రానుకున్నా నండి" అంది.

      " ఏం చిలిపి పనులు చేస్తే తప్పేంటి, వయసు శరీరానికే గాని మనసుకు కాదోయ్, శృంగారం లో బాగా ఎంజాయ్ చేసే వాళ్లకు రోగాలు అంతల బాధించవు  తెల్సా  ఈ ఊబకాయాలు కీళ్ళ నెప్పులు మానసిక సమస్యలు ఉండవ్ పైగా పూర్ణా  యుష్యులై బ్రతుకుతారు. ఇటీవలి పరిశోధనల్లో బహు భార్యలున్న వాళ్ళు దీర్ఘాయుష్యులని తేలిందట తెల్సా?"......... నవ్వుతూ అన్నాను

  " ఛీ పొంది మిమ్మల్ని మాట్లాడనిస్తే శృంగారం గూర్చి ఏకధాటిగా నలభై రోజులు అంటే ఒక మండలం పాటు మాట్లాడతారు చిరునవ్వుతో అంటున్నా మా వరం ముఖం సిగ్గుతో ఎర్రబడడం చూసాను.            




           

                                       

No comments:

Post a Comment