Wednesday 26 March 2014

భారతసిపాయి

                                                భారత సిపాయి
                                                     విరించి

త్యాగము చేసినావు కద ధన్యుడ వోయి సిపాయి మాతృ భూ
భాగపు రక్ష సేయ కడు భారపు దీక్ష వహించి నావు నీ
వా గిరి కానలందున నివాసము జేసి విదేశ వేగులా
డేగలబోలు శాత్రువుల డీకొను నీకు జయంబు నిత్యమౌ

భారత భూమి రక్షణపు బాధ్యత చేకొని తల్లిదండ్రులన్
దార సుతాదులన్ విడిచి ధారణి యంచున కొండ కోనలన్
జేరిన త్యాగ మూర్తులు యజేయ పరాక్రమ శీలులౌ మహా
ధీరులు వారి త్యాగధన దీప్తుల కాంతి మహోజ్వలంబులౌ

శ్రీకర భారతావనిని శ్రీగని కానల రత్నగర్భయౌ
సాకరమొప్పు సంస్కృతుల సంచిత శోభల భారతావనిన్
పోకిరి మ్లేచ్చులీ యవని పుణ్య ధరీత్రిని మ్రుచ్చలింపగా
పోకిరి చేష్టలన్ అణచ పోరిది వారి మదంబు ద్రుంచుమా

ఇమ్మహి పాలకుండవయి ఇద్ధరణీ పరి రక్షకుండవై
కమ్మని యమ్మ నీడన సుఖంబుగా లోకులు సేద తీరు యా
కమ్మని వీలునే జనుల కందగ జేసిన వాడ వోయి యే
యమ్మ సుగర్భ వాసమున యంకురా మొందితి వోయి ధీరుడా

ఆరడి పెట్టు దుర్జనుల నంతము చేయగ రుద్రమూర్తి వై
పోరును సల్పు, రక్కసుల పోకిరి మూకల నాశనంబు నే
కోరితి, నుగ్రవాదమును కూకటి వ్రేలుల సంహరించుమా
భారతి కీవు రక్ష జయ భారతి నీకు సదా సురక్ష యౌ

భారము కాదు నీకు భావ బంధములన్ విడనాడి ద్రోహులన్
మారణ కాండ సల్పుదువు మాన్యుడ వైన సిపాయి వోయి సం
హారము జేసి శాత్రు పరిహారము జేయుము సింగమొప్పగన్
తీరదు ణీ ఋణం బెప్పుడు తీర్చగ జాలరు భారతీయులున్                         

No comments:

Post a Comment