Monday 24 March 2014

హాస్యం

                                        హాస్యం                                                విరించి

నవరసాలలోన నాణ్యమై విలసిల్లు
రసము కలదె హాస్య రసము కన్న
రసము లందు హాస్య రసముయే రారాజు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

మంచి నవ్వు యొకటె మనుజుని సర్వంబు
లేమి లోటు కదియు క్షామ కరము
సిరులు లేని వేళ చిరునగవే చాలు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

ఉగ్గుపాల తోడ ఊయలందు శిశువు
కబ్బినట్టి విద్య హాస్య మొకటి
చాట నాటి వరము కాటి వరకె కదా
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

నెయ్యమున్న చోట కయ్యాలు కలగని
మిత్రు డైన మారి శత్రు వవని
హాస్య మెపుడు యప హాస్యంబు కారాదు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

వలచినట్టి కాంత వదనాన చిరు నవ్వు
కాంచనెంచు ప్రియుడు కాంక్ష తోడ,
చెలియ నవ్వు కన్న సిరులు గొప్పవి కావు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

భాష లోని భేద భావంబు పలుకుచు
నత్తి మాటలాడి నరులు ఇలను
హాస్య మొలుకు ననుచు యత్నాలు చేసేరు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మన్నదదియు అక్షయంబిలలోన
నశ్వరంబు లేదు నవ్వుకిలను
తాను శాశ్వతంబు ధన ధాన్యముల కన్న
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

విఫణి వీధులందు విక్రయింపగలేరు
దాన మడగ బోవ ధనము కాదు
ఇలను హాస్యమన్న ఈశ్వర తత్వంబు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

గంతు లేసి యొకడు గమ్మత్తు సేయును
అలవి గాని పనులు హాస్య మనుచు
రోత పనులు సల్ప రుగ్మతే హాస్యమా?
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

పదుగురొక్కసారి పాక పకా యని నవ్వ
పరిసరంబులన్ని పరవశించు
పెళ్లి మండపమున వెళ్లి విరియు నవ్వు
కాంతు లీన జేయు కన్నె యదన

నేత నవ్వు గాంచి దూతలు నవ్వేరు
 తల్లి నవ్వినంత పిల్ల నవ్వు
పెద్ద వారి నగవు పిల్లల మురిపించు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

సరస మేల  చిట్టిమరదళ్ల తో బావ
చిలిపి మాటలేల చేష్ట లేల?
హాస్య రసము యన్న యభిమాన మదికాద,
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

దవడ కండరముల దారుడ్యమును పెంచు
మదిన కుత్సితంబు మట్టు పెట్టు
మనసు శాంత పరచు మందురా నవ్వంటె
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

అపరిచితుల తోడ హాస్య మాడెడువాడు
ఆత్మ బంధువగును అవని జనుల
హాస్య మన్నదొకటె ఆప్యాయతను పెంచు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

కలువ రేకులంటి  కనులు సైతము చూడ
మూసికోనును హాస్య మూల మదియు
హాస్య మిచ్చు సుఖము అంతరాత్మ యె  గాంచు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

నవ్వ లేని వారు నరలోక మందున
ఇమడ లేక మొదట ఇల్లు,పిదప
సతిని వీడి చివర సన్యాసు   లయ్యేరు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

పదుగురున్నచోట పక పక వినిపించు
జ్ఞాని యొక్క డున్న మౌనముగను
వెల్లి విరియు నవ్వు విపుల పుడమి యందు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

దాన మందు యన్న దానంబు మిన్ననీ
అవని జనులు పొగడి యాచరింత్రు
హాస్య మున్న చోట అన్నదానములేల
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

భాషలోన భేద భావాలు యున్నను
తీరు తెన్నులందు తేడయున్న
హాస్య మందు యెట్టి అంతరాలుండవు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

చెలియ నవ్వు గాంచి చెంగలించని వాడు
ఉండబోడు  నిజము యుర్వి యందు
ప్రేమ పంచు నవ్వు కామంబు కాదురా!
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మన్న నేమి? అవహేలనా?  కాదు,
హాస్య మన్న బూతు యసలు కాదు,
హాస్య మన్న యదియు అపురూప యోగంబు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

యోగ సాధనంబు రోగ నాశన కారి
హాస్య మనెడు క్రియయే యవని యందు
హాస్య మొక్కటున్న అవని నే గెలవొచ్చు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మవదు ఎపుడు యవనికి భారంబు
మీదు జనుల కదియు మేలు సేయు
జనుల హృదయ మందు జాగృతౌ హాస్యంబు
  హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము 

భువన విజయ మందు భూరి సాహితి సేవ
జరుపు వేళ యచట జనులు మెచ్చు
కవిత జెప్పు వికట కవిదిరా హాస్యంబు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

స్మిత వదనుని చుట్టు స్నేహితులుండేరు
నవ్వ నాడు కాడు నాయకుండు
నవ్వు వాడి బతుకు నగుబాటు కాదురా
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

తెల్ల దొరల తోడ ధీరుడౌ మన గాంధి
పోరు సల్పి స్వేచ్ఛ  కోరనేల
నవ్వు మరచినట్టి నా జాతి కోసమే
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

సఖియ తోడ ప్రియుడు సరస సంభాషణ
చేయు వేళ యతని చేష్ట లందు
హాస్య ముండు గాని అన్యమెక్కడయుండు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

విశ్వ జనులు మెచ్చు వీరుఁడు మెచ్చును
భిక్షుకుండు మెచ్చు బీద మెచ్చు
సర్వ జగతి మెచ్చు సాధనే హాస్యంబు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మొలుకు చోట ఆనంద   వర్షంబు
కురిసి మురియు నంట కువలయంబు
బాధలన్ని మాపి భాగ్యాల పండించు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

మానవత్వమున్న మనిషిలో సతతంబు
సురులు మెచ్చు హాస్య సుధలు కురియు
మంచి హాస్య మన్న మాధవుండే మెచ్చు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము 

సిగ్గు పడెడు వేళ చిన్నదానికి నవ్వు
శోభ నిచ్చి యామె షోకు పెంచు
చిత్రమైన యట్టి చిరునవ్వె యందము
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

కలువ రేకులంటి చిలిపి తనము నిండి 
కాన్తులూరు తుండు కలికి కనులు
తెలుపు భాష హాస్య మలరించు జగతిని
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము             

          
  
   

    

No comments:

Post a Comment