Friday 22 May 2015

బహుదూరపు బాటసారి

బహుదూరపు బాటసారి

మనసు విరిగిపోయింది
దుస్తులు చిరిగిపోయాయి
చెప్పులు అరిగిపోయాయి
అనుభవం పెరిగి పోయింది
ఆయువు తరిగి పోతుంది

బక్కచిక్కిన బరువైన దేహాన్ని
భారంగా మోస్తున్న కాళ్ళు
బరువుగా అడుగులేస్తూ
గమ్యంతెలియని బాటసారిలా
మౌనంగా మునుముందుకు
కదలి పోతూ నే వున్నాడు
అతన్నెవరూ చూడట్లేదు
చూసినా పట్టించు కోవట్లేదు

సుమ సౌరభాలతో పరిమళాలీనే
నందన వనాల్లాంటి సొబగులను దాటి
పరమదుర్గంధ భూయిష్ట మురికి
కూపాలలోకి అడుగుపేట్టాడు....

సుగుణ ధామున్నీ చూసాడు
పితృవాక్యపాలన గొప్పదనాన్ని
కంటినిండా కన్నాడు... భాతృ భక్తిని
గాంచి ఓస్ ఇంతేనా అని నాడనుకున్నాడు

లీలామానస మూర్తినీ చూసాడు
సామాన్యునికర్థంకానీ యెన్నెన్నో
లీలలు చూసాడు ధర్మాన్ని చూసాడు
భగవానుని చూసాడు., భక్తులను చూసాడు
దనుజులను చూసాడు అసురక్రీడలూ చూసాడు

ఆనాటినుంటి యెన్నెన్నో చూస్తున్నా
యెనాడూ మనసు చెదరని స్థితప్రజ్ఞుడు
ఈనాడు మనిషినని చెప్పుకుంటున్న
ద్విపాద మృగరాశిని గాంచి కలతవడ్డాడు

స్వార్థం కోసం నీడనిచ్చే రుహాల కూల్చి
సుఖాలకోసం కన్నవారినే యనాథలచేసి
ఎదుటి మానాభిమానాల దెబ్బతీసి
విజ్ఞానం పేరిట ప్రకృతికె యెదురోడ్డి
ప్రళయాలను కొనితెచ్చుకునే మూర్ఖ
నరరూప పిశాచాలంకురించిన నేటి లోకి
చూసి ఖిన్నుడై కదులుతూ  నే వున్నాడు
రేపటిలోకి.... తనని తాను మరచిన
కాలమనే బహుదూరపు బాటసారి



No comments:

Post a Comment