Saturday 23 May 2015

తరూవిలాపం

తరూవిలాపం

జ్ఞానుల మనుకొని
మురిసే మానవా
మమ్ము తెగ
నరకడమిక మానవా!
మ్రానులమైన నేమి,
మనో హీనులమైన నేమి?
మనోధరులంచు మీకున్న
గొప్ప మన్న నేమి?

నీవు పీల్చే శ్వాసకు
ప్రాణధార నిత్తునేను
నీ వార్థక్యపు గమనములో
సదాతోడు వత్తునేను
మలమల మాడ్చే యెండన
నిలువనీడ నిత్తునేను
నకనకలాడే కడుపుకి
మధురఫలాలిత్తు నేను

పండుగలకు పబ్బాలకు
గుమ్మాలకు తోరణాలు
కడుపారగ భోంచేయగ
వడ్డనకై విస్తళ్ళను
నిరుపేదల నివాసాల
పైకప్పుకు పర్ణాలను
ప్రతిమల చల్లని మెడలో
ప్రమదల నల్లని జడలో
సొబగులీను సుకుమారపు
సొగసుల కుసుమాలను
యెవరిచ్చునొ మరచిపోయి
యెందులకీ దుర్మార్గం

మెరక దున్ను అరకనిస్తి
క్షుత్తునార్పు ధాన్యమిస్తి
గుమ్మాలకు తలుపునిస్తీ
కుర్చీలకు తనువు నిస్తి
వరుణునితో భాషించితి
వర్షాలను కురిపించితి
కరువన్నదీ పారదోలి
కలిమి పంట లందించితి

పరిణయాల వేళ
పందిరినై  నిలిచుందు
పాకశాలలోన నేను
ఇంధనమై కాలుచుందు
పార్థివకాయము మోసే
పాడెనై తోడుందు
అంతిమ సంస్కారమందు
కాడునై కాలిపోదు

మనసన్నదీ లేని
వట్టీ మ్రానునంటు పిలిచేవు
మనసున్న మారాజువు
మానవత్వ మొదిలేవు
హితము గూర్చు రుహమన్న
ఇంగితమే వదిలావు
స్వయంకృతాప రాధంతో
సర్వనాశ మొందేవు

No comments:

Post a Comment