Sunday 31 May 2015

పున్నమి రాత్రి

పున్నమిరాత్రి

చంద్రుడు వెన్నెల
కళ్ళాపి జల్లుతున్నాడు
నిశీధి విస్తరించిన నేలంతా
చల్లని తెలుపుతో
మురిసిపోతూంది

గగన తలంనుండి జాలువారే
తేనెలూరే వెన్నెలకు మైమరిచి
పోయిన నిశీధికాంత రంగురంగుల
రంగువల్లుల నద్ద మరిచి పోయింది

స్వచ్ఛమైన మల్లెల నారబోసిన
తెల్లని చల్లదనం పుడమిని కౌగలించుకుని
నవదంపతుల యదలో యెన్నెన్నో
మధురోహలకు ప్రేరణ నిస్తుంది.

పగలంతా స్వార్థపరుల కుచేష్టలతో
విసిగి పొయిన ధాత్రికి స్వచ్ఛమైన
వెన్నెల స్వాంతన నిస్తుందేమో! అన్నట్లు
హాయిగా సేద తీరుతుంది పుడమితల్లి

రేపటి కొరకు తాను కరుగుతూ   ఆశగా.....
నిద్రిస్తున్న మానవ లోకానికి జ్ఞానోదయం
కలగాలనీ  కృత్రిమంగా తనకు తానుగా
ఆహ్వానించుకున్న స్వార్థపరత్వాన్ని
పారద్రోలి యేనాడో వదులుకున్న
మానవత్వాన్ని రప్పించుకుని  రేపటినుండీ
తిరిగి మనిషిగా మనగలగాలని కోరుకుంటుంది


No comments:

Post a Comment