Tuesday 26 May 2015

భయం గుప్పిట్లో......

భయం గుప్పిట్లో,.......

నాన్నా!
భయం భయం గా వుందని
నీ చెంతన చేరి నీ  యదపై
తలానించి నీ గుండె సవ్వడే
జోలపాటగా అభద్రతా భావాన్ని
విడిచి నిర్భయంగా నిద్రించ గలిగా
నొకనాడు .............

నీ వ్రేలు పట్టుకుని  నీ వెంట
నడుస్తుంటే.... దారంట పోయే
వాడెవడూ నావంక తలెత్తి సైతం
చూడలేదే..
నా మాన ప్రాణాలకు రక్షణ కల్పించే
వాడవని యెంతటి విశ్వాసం ఉండేదో
ఆనాడు...........

అమ్మ తరువాత అమ్మంతటి
దేవుడవని నిన్ను ఆరాధించా
అభిమానించా...... నీవే లేనిది
నేనెక్కడ? అని గర్వపడ్డా!

ఎక్కడో యేదో జరిగింది
జరగకూడనిదే జరిగిందీ
సరిదిద్ద లేనిదే జరిగింది
ఆ  దురాగతం నాలో భయాన్ని
మేల్కొలిపింది...  నాన్నంటే
మగాడే నన్న లింగభేదాన్ని
చూపిందీ నా అంతరాత్మ

ఇంతకాలం మన మధ్యనున్న
ప్రేమానుబంధాలను  నెట్టేసింది
భద్రతా భావానికి అభద్రతెదురై
అభద్రతా భావమే నిదురలేచింది

ఇంట్లో సైతం నువ్వుంటే
అమ్మచాటున దాక్కుంటున్నా
యెక్కడ నీ చూపులు నాపై
పడతాయో యని,,,,

స్వచ్ఛమైన నీ ప్రేమ తెలుసు కానీ
నువ్వూ మగవానివనీ మగ మృగానివనీ
నిన్ను నమ్మ లేక పోతున్నా!

నన్ను క్షమించవూ!
నా మాన ప్రాణాలను రక్షించవూ!!

No comments:

Post a Comment