Friday 3 April 2015

లంకిణిపై విజయము

ధర్మమెరిగినట్టి కర్మయోగి హనుమ 
            కుడ్యమున్ దాటగన్  గోడనెక్క
లంకాధిదేవత  లంకరాక్షసచట
            కాపుకాచుచు నుండే  కపిని గాంచె
ఎవడవీవు యిటకు  యేలవచ్చితివీవు
           ప్రాణాలపై యాశ  వదలుకొమ్ము
చావుమూడెను నీకు  సత్యాన్ని వచియింపు
           మనుచు  లంఖిని  వచ్చె  నతని  కడకు

ఏల  కోపమమ్మ  ఇలలోన ఇంపైన
పట్టణంబకాంచ వచ్చితేను
వీధి  వీధి గాంచి వెడలిపోదును నేను
అనుమతించవమ్మ అసురమాత

అనెడు  హనుమ  మాట  నాలకించక లంక
చాచి పెట్టి ఒక్క చరుపు చరిచె
ఆడవారిపైన ఆగడ మేలంచు
వదలినాడు ఇంత వరకు  నతడు

అసుర ముష్ఠి ఘాత మాగ్రహంబును పెంచ
కనులు యెరుపు దాల్చె  తనువు  బిగిసె
పడతి పైన నేల  బలముచూ పడమంచు
ముష్థిని విసిరెనామె  ముఖము పైకి

పవన సుతుని  దెబ్బ  ప్రాణాంతకం బాయె
గావుకేక తెచ్చె  చావు  తెలివి
కరములోడ్తు  నీకు  కపివరుండా  నీదు
దర్శనంబు  నాకు  ధన్యతొసగు

రామ పత్నిని వెదుకుచూ  రామబంటు
కపియె వచ్చును శ్రీలంక  కడలి దాటి
నిన్ను గెలుచును  కదనాన  నిజము  సుమ్ము
అసుర  జాతియె యవనిపై నంతరించు

ధాత తెలిపెను  నాకు దయతోడ నొకనాడు
పురము రక్ష జేయు  తరుణమందు
నన్ను  గెలుచు  వాడు  నాశనమొనరించు
లంకపట్టణమును  రక్కసులను

((మిత్రులకు హనుమజ్జయంతి  శుభాకాంక్షలు))

No comments:

Post a Comment