Monday 20 April 2015

ఓ బాలకార్మికుడా!

బడి గదిలో గడపాల్సిన బాల్యం
బండలమధ్యన కరిగిన దైన్యం
భారీ భారతనిర్మాణానికి
రాళ్ళెత్తిన ఓ భాస్కరుడా!
రేపు వెలిగే కాంతులరేడుకు
నేడు పట్టిన గ్రహణ మిదేనా?

ఎముకలు ముదరని లేత చేతులు
తెలిసి తెలియన యదగది వ్యధలు
పాలుగారే ప్రాయంలోనే పెద్దవు నీవై
తలకు మించిన భారంతోని కృంగితివోయి

దీనత్వం తొణికిస లాడే
మసిబారిన లేలేత వదనము
కాంతి రహిత నయనాలందున
చిరిగిపోయిన భవిష్యచ్ఛిత్రం

అయ్య తాగే సీసాలకు   కాసులకోసం
అణగారి పోతున్న నీ  బంగరు బాల్యం
కల్మషమంటని ఆ లేతచేతులు
కందిపోయినా కమిలిపోయినా
కాంచే ప్రేమకు  కరువై పోయెను

త్యాగము నీదో  ఖర్మము నీదో
భరతమాతకే  తీరని వ్యధవో
కర్మఫలమని చేతులు దులిపే
దద్దమ్మల నిర్దయ ఫలమువో

No comments:

Post a Comment