Thursday 30 April 2015

ప్రకృతి

ఓ ప్రియా........

కోమలమౌ నీ స్వరమును విన్నా
కోకిల పాటని నేననుకున్నా
వసంతమిసంతకొచ్చిందన్న
భ్రాంతి తోడనేననుకున్నా

నాతప్పుల సవరించుచు
ఆగ్రహించి నీ అక్షులు పంచు
తీక్ష్ణతలో గ్రీష్మం కాంచా
పొరపాటెరిగి తలనేవంచా

ఎనలేనిది నీప్రేమని యెంచా
కురిపించిన నీ ప్రేమను గాంచా
దయావర్షపాతములోనా
మునిగి తడిసి ముద్దై పోయా

అధరాలొలికే దరహాసంలోనా
పున్నమి చంద్రుని వెన్నెల కాంచా
శరత్కాల కౌముది వెలుగుల
కాంతులలోనే సేదను తీరా

నీచల్లని చూపులు విసిరే
కన్నులకాంతులె తుషారమై
నా యద మీటిన తరుణంలోన
హిమవత్కాలపు సొబగులు చూసా

హద్దేలేని అనురాగం
అణువణువున నీ ప్రేమసరాగం
శీతలానిలముల హృదయసరాగం
శిశిరంబౌ నీ మమతలబందం

స్వాంతన మొసగు నీ చెంత
ఆరురుతువులే ఓ వింత
ప్రమదే కద ప్రకృతి కాంత
ఒప్పుకుంటుంది ఈ జగమంత

No comments:

Post a Comment