Saturday 6 June 2015

ఓ అబలా మేలుకో!!

ఓ అబలా మేలుకో!!

నాడు సతీసహగమనం
పేరిట సజీవ దహనం చేసి
పైశాచికానందంతో
కరాళ నృత్యం చేసిన
నర రూప పిశాచాలనూ
క్షమించిన క్షమాగుణం నీది

పెనిమిటి పొయాడన్న నెపంతో
నీ కెశాలని తీసి నిన్ననాకారిని చేసి
శిరోముండనం చేయించి ఏకవస్త్రం కట్టించి
చీకటి గదిలొ బంధించి
అపశకునానికి చిహ్నానివని
అవహేళన చేసి అవమానించినా
అసుర సమాన అహంకార పూరిత జాతినీ
క్షమించిన క్షమాగుణం నీది

కన్యాశుల్కం నాడు
కన్నవారి ధనదాహానికి బలై
ఈడుజారి కాడుజేరే వగ్గులకు
నిన్ను అమ్ముకున్న ఆ స్వార్థపరులనూ
క్షమించిన క్షమాగుణం నీది

నేడు వరకట్నం కోసం
అత్తారింటి వారి ధనదాహానికి బలైపోతూ 
ఆరళ్ళను పెట్టినా ఆడిపోసుకున్నా
అగ్నికాహుతి జేసినా
హలాహలాన్ని మింగిన పరమ శివునిలా
బాధని గుండెల్లో దాచుకుని వారినీ
క్షమిస్తున్న క్షమాగుణం నీది

కాలం యేదైనా వ్యవస్థ యేదైనా
రూపం యెదైనా అన్యాయమయ్యేది
బలైపోయేది నీవైనా... ఎదురు మాటాడక
మౌనంగా భరిస్తూనే వున్న సహనమూర్తివీవు

పురుషాహంకారంతో నీ స్త్రీ జాతినీ
రూపుదిద్దుకోక ముందే
కడతేర్చాలని చూస్తున్న
అమానుషాన్ని మౌనంగా చూస్తూ క్షమిస్తున్నావ్ 

తిరిగి తిరిగి పురుషాహంకారానికి
జన్మనిస్తున్నావ్  తల్లివై మమకారం
పంచి పోషిస్తున్న నీక్షమాగుణానికి
జోహారులు

ఎన్నాళ్ళు ..........ఇంకెన్నాళ్ళు.........
ఏ జంతు జాలంలొనూ కనరాని అమానుషం
నా నరజాతి ఆడజాతి కే అడుగడుగున అన్యాయం
నేత్రాలలొ రోషాగ్ని రుధిరజ్వాలల నింపుకుని
పురుష జాతి కబంద హస్తాల నుండి
విముక్తి  పొంది.....నువ్వో అపరకాళివై
శివమెత్తి భావితరాల నీజాతి
బానిసత్వానికి విముక్తి కలిగించుకో!!


No comments:

Post a Comment