Friday 5 June 2015

వీలునామా

వీలునామా!

వీలున్నప్పుడే ఆ వీలునామా
యేదో రాసేయండి ....
ఆనక పిల్లలు పోట్లాడుకునే
బాధవుండదు...... నా శ్రీమతి
సతాయింపు రోజు రోజుకీ
యెక్కువవుతుంటే......
ఓ సారి ఆమెకేసి ఎప్పటిలానే
ఓ చిరునవ్వు విరిరేసి
పేపర్లో తలదూర్చేసా..ఇదీ ఎప్పట్లానే.....

తాడో పేడో తేల్చేయాలన్న
కృతనిశ్చయంతో వున్న నా తాళిబంధం
విసురుగా వచ్చి పేపర్ లాగేసి
కసురుకుంటున్నట్టుగానే.......

నేనెన్ని మారులు చెప్పినా
ఉలకరూ పలకరూ అసలు
నేనంటే లక్ష్యం ఉంటేగా?
యెప్పుడైన నా మాట వింటేగా?
ఇదీ వినడానికి,,,, మిమ్మల్ని
కట్టుకున్న నాటినుంచి
సుఖపడ్డదేముందని సన్నాయి
నోక్కులు నొక్కుతూ   ముక్కు చీదింది
కొంగుతో  కళ్ళల్లో కనిపించని
నీటినీ తుడుచుకుంది.

ఆమె కోపానికి బాధకూ ఓ
అర్థముందని పించింది
ఔను.... ఆమె మాటలని
ప్రతీసారీ పెడచెవినే పెట్టాను.......

ఇంట్లో విలాస వస్తువు లేవీ లేవు
ఆఫీసులో అవకాశమున్న అదనపు
ఆదాయాల నందుకోమని చెప్పిన నాడూ
ఇలాగే నవ్వాను కాని లంచానికి లొంగలేదు

ఇల్లు కొందామండి ఇన్ స్టాల్ మెంట్లొ,..
ఊ అనండీ అని షంటిన రొజు ఊహూ
అన్నానే గాని ఊ అనలేదు

అబ్బాయిలకు లక్షల
కట్నాలిచ్చే కలవారి
సంబంధాలనూ
ఒప్పుకుందాం కష్టాలు
తీరతాయని బ్రతిమాలితే
కాదన్నానే కాని తగ్గలేదు

అమ్మాయికి అమెరికా సంబంధం
షన్ని విధాల కలిసోచ్చే సంబంధమని
అంగీకరించమని పోరినా
అనంగీకారమే నానుండి

అందుకే ఆమెపై జాలివేసింది
వీలునామా రాయడానికేముందని
ఇస్తానన్న పుచ్చుకునే వీలైనవేవి
లేనపుడు ఇక వీలునామా ఎందుకో?

మనిషి నన్న పేరు సంపాదించా
మంచి యన్న మాటతెచ్చుకున్నా
ఈ రెంటిని యెవరికేం రాయమంటావు
అని నవ్వుతూ  చూసానామె కళ్ళలోకి

చదువూ చదువంటూ ఎవరెవరికో
అంతలేసి ఇచ్చారుగా వాటిని
వడ్డీతో రాబట్టండి...
విసురుగా షంటున్న ఆమెతో....

అప్పుగా ఇవ్వలేదు
అప్పనంగా ఇచ్చాను
వారంతా ప్రయోజకులై
తిరిగిస్తామంటే వద్దనను
ఇమ్మని మాత్రం అడగను

మీరు వీలునామా కొరకు
కాకుండా వీలుంటే నా
అడుగులో అడుగేసి నడవండి
ఇంతకంటే నేను రాసే వీలునామా
ఏమీ లేదు అంటూ
ఖండితంగా చెప్పేసి బయటకు వెళ్ళిపోయా



No comments:

Post a Comment