Tuesday 2 June 2015

లాలి పాట

పాపలకు జోలపాట అనగానే ఎప్పుడూ పాతపాటలే పాడుతుంటారు ప్రతీ తల్లి  మరీ ఓ కొత్త జోలపాట
నేర్చుకుందామా!

జోల పాట

లాలి ఓ చిన్నయ్య  లాలి కన్నయ్య
మాయింటి మురిపాల  మారాజువయ్యా
జో..... జో......

అందాన చంద్రుడై  సుగుణాన రాముడై
అల్లరీ కృష్ణుడై  ఈ యింట విరిసావు
ఆటపాటల తోడి అలరించ వయ్యా
ఆయురారోగ్యాన  వర్ధిల్ల వయ్యా
జో....... జో........

అలనాటి రామయ్య  ఒకనాటి కృష్ణయ్య
ఈనాడు నీవయ్య  మావరాల మూటయ్య
చిలిపి కయ్యాలేవి మావరకు తేబోకు
వీధిబాలల తోడ  ప్రీతి కలిగుండూ 
జో..... జో,,,,,,

వాగ్దేవి దయతొడ  పారంగతుడవై
వంశానికే నీవు  వన్నె తేవాలి
పంచదారావంటి  పలుకులను నేర్చి
వినయంగ గెలవాలి పెద్దల మనసుల
జో...... జో.......

నలువరాణీ కరుణ నీ పైన నిండుగా
కురవాలిరా మిన్న  సుగుణాల కన్నా
సకల విద్దెలు నీకు సాధ్యమవ్వాలి
నీ యింట భాగ్యాల  బాన నిండాలి
జో..... జో........

మీ యమ్మ మురిపాల  మూటవే నీవు
మీ నాన్న ఆశల  ఊయలవెనీవూ
మురిపాన మీ యమ్మ ముద్దు తీర్చాలి
మీ నాన్న ఆశలకు  రూపమివ్వాలీ
జో....... జో.......

No comments:

Post a Comment