Wednesday 10 June 2015

మత్తు వదలరా! నిద్దుర మత్తువదలరా!!

మత్తు వదలరా నిద్దురమత్తు వదలరా!

ప్రభాత వీచికలు మీటిన
మౌన విపంచి కమరిన
మయూఖ తంత్రుల మౌన
రాగాలకనుగుణంగా కువకువ
రాగాలతో జగతిని జాగృత
మొనరించాలని తహతహలతో
తమ శక్తికి మించి యత్నిస్తున్నాయ్
పక్షిరాజులు.....

తమకంతో తమను తాము మరచిన
అండజాల ఆలాపనలు అర్థంలేని
భూపాల రాగాలై గాలిలో కలిసి
పోతూ నే వున్నాయ్ .....,,,
బలిసిన వాడి పాదాల కింద
నలిగే అన్నార్థుల ఆక్రందనలా

ఆకటి కోసం అలమటించె
బడుగు జీవులు భానుని కంటే
ముందే బద్దకాన్ని వీడి పనుల్లో
పడిపోయారు....జానెడుదరాన్ని
నింపే ధ్యాసతో....పిడికెడు పిట్టల
మేలుకొలుపులపై ఆధారపడకుండానే....

వారసత్వమో! అన్యాయార్జితమో!
మితిమీరిన సంపద బహూకరించిన
అజీర్తి రోగంతో అలమటించే
ఆదివిష్ణు హృదయ సామ్రాజ్య
మహారాజ్ఞి  ఇష్టసుతులు
మద్యపుమత్తూ   నిద్రమత్తునుండి
ఇంకా  తేరుకోనేలేదు.....,,,,

శీతొష్ణానిల చిరుచీకటి ముసిరిన
అద్దాల సౌదంలో....శేషతల్పాన్ని
తలదన్నే హంసతూ లికా తల్ప సమ
విలాసవంతమైన పానుపు పై తమ
గురకలే తమకు జోలపాడుతుంటే
ఆ మాధుర్యాన్నాస్వాదిస్తూ
నిద్రిస్తున్న సుసంపన్నుల చెవికి
విహంగాల సుప్రభాత గీతికలు గానీ
బాల భానుని కవోష్ణ కిరణాలుగాని
చేరలేవు ....వాటికా ధైర్యమూ లేదు

ఎవడాకలి చావు చచ్చినా
ఎవడప్పుల బాధకు పోయినా
ఏ అబల పురుషుని కామాగ్నులకు
బలైతేనేం...,,ఏ కోడలు అత్తల ఆరళ్ళకు
ఆరిపోతేనేం.,,,ఏ నిరుద్యోగి విసిగి
వేసారి పోయినా

సమస్యల వలయంలో మానవాళి
సతమతమౌతున్నా....పట్టించుకునే
తీరిక మెలకువ లేని ఓ స్థిత ప్రజ్ఞుడా!!
మేలుకో ! కొట్టుమిట్టాడే దీనుల నాదుకో

ఇనుప బీరువాలలో దాచిన ధనాన్ని
అప్పనంగా అందరికీ పంచబోకు
ఆ నల్లధనాన్ని శ్వేతవర్ణానికి మార్చు
కార్ఖానాల నెలకొల్పి ఉద్యోగావకాశాలు
కల్పించు.... నీవింకా ధనాన్నార్జించు
ఎండె డొక్కల కింత కూడు కల్పించు
వ్యర్థమౌతున్న శ్రామిక శక్తికి పనికల్పించు

నీవు తినడమే కాదు నీ సాటివారికి తిండి నిప్పించు
అందుకు సమర్థుడవని నిన్ను నీవు తెలుసుకో
సమసమాజ నీర్మాణానికీ ఆద్యుడవీవే కావాలి
మానవసేవలొనె పరమార్థముందని తలుసుకో!!



No comments:

Post a Comment