Thursday 11 June 2015

అస్తమించిన అమ్మానాన్నలకో లేఖ

అస్తమించిన అమ్మా నాన్నలకో లేఖ

ఓ అమ్మా! ఓ నాన్నా!!

బ్రతికున్నన్నాళ్ళు
పలకరించని వాడు
ఇప్పుడీ ఉత్తరం రాయడమేంటనీ
ఆశ్చర్యమా?

నేనానాడు మిమ్మెల్నెంత
అనాదరించానో
నాకీనాడే అర్థమైంది,
తప్పుతెలుసుకుని
మీ పాదాలపైబడి
ప్రాయశ్చిత్తం చేసుకోవాలని
ఉన్నా నాకందనంత దూరంలో వున్నారే!!

ఒక్క సారి మీ ఒడిలొ
తలవాల్చి బోరుమని
ఏడవాలని వుంది
నాకన్నుల్లోంచి వచ్చే
పశ్చాత్తాపాశ్రువులతో
మీ పాదాలను కడిగీ
ఆనీటినీ తలపై జల్లుకోవాలనీ వుంది.......

జ్ఞానమనే  ముసుగును
కప్పుకున్న అజ్ఞానిని
అద్దంలాంటి మీ మనసుల్లొ
నన్ను నేను చూసుకుని
మీరే అజ్ఞానులని భావించిన అహంభావిని నేను

అనుభవాల పొత్తాలైన
మీ మంచి మాటలని
చాదస్తాలని యెగతాళి
చేసిన అవివేకిని నేను

నా భార్యా బిడ్డలే
నా లోకమని మీరంతా
వయసుడిగిన
అక్కరకురాని వృద్ధ జీవులని
అడుగడుగునా కించపరచిన
కిరాతకుడిని నేను

ఏ ఒక్క నాడూ మీతో
నవ్వుతూ   మాటాడలేదు
ఏ ఒక్క నిర్ణయాన్నీ మీతో
చర్చించి గైకొనలేదు
ఏ ఒక్కనాడూ మీతో కలిసి
భోజనమూ చేయలేదు

మీరిచ్చినదే ఈ జన్మని మరిచి....
మీరు యిప్పించిన జ్ఞానాన్ని విడిచి..
.మీరు నేర్పించిన సంస్కారాన్నీ కాదని
యౌవనపు కోరికల బందీనై.........

మీకిష్టం లేని ప్రేమవివాహం చేసుకుని
మిమ్మల్నే శత్రువులుగా భావించి
అనుక్షణం ద్వేషించాను... నాసుఖం
కోరేమీరు నా పెండ్లిననుమతించి కోడలిని
ఆశీర్వదించిన నాడు అవమానించాను.

నాకొరకు నా భార్యను
కొడలిగా స్వాగతించారు
అభిమానించారు ఆదరించారు

యెక్కడా దిక్కులెక దిగివచ్చారని
తూ  లనాడాను
అమ్మానాన్నలన్న ఇంగితాన్ని
మరిచాను...
మీ మనో వేదన గూర్చి ఆలొచించని
పెను రాయినయ్యాను
పశువునయ్యాను.....

చరిత్ర పునరావృతమౌతుంది
భూమి గుండ్రంగా వుండి తన
చుట్టు తానే తిరుగుతుంది.కదూ!

నా కొడుకులూ కోడళ్ళు మము
నిర్లక్ష్యం చేస్తుంటే.... నా మనసు
పడుతున్న ఆవేదనలొ
జ్ఞానోదయమైంది
నేనూ మిమ్మల్నెంత అవమానించానో

మేడలడగ లేదు మీకున్నదే మాకిచ్చారు
మూటలడగ లేదు మీ సంపాదనే నాకిచ్చారు
కేవలం ప్రేమ పంచమన్నారు
మనిషిగా చూడమన్నారు

ఆనాడా మాటల విలువ నెరగలేదు
కాని తెలివొచ్చేసరికి అంతా అయిపోయింది
పశ్చాత్తాపంతో కుములుతున్నా....

అమ్మా ! నాన్నా!! క్షమించమని అడిగే
అర్హతను సైతం కోల్పోయిన దుర్మార్గున్ని
అమృతమయమైన మీ మనసుతో క్షమించరూ!

కొడుకుల ప్రవర్తన చూసి బుద్ధి
తెచ్చుకోకండనీ ఈ తరానికీ చెబుతున్నా
మీరూ మారండీ అమ్మా నాన్నల్ని
గౌరవిస్తేనే మీ పిల్లలు మిమ్మూ
ప్రేమిస్తారని గుర్తుంచుకొండనీ
చెబుతున్నానమ్మా ఇదే నేను
మీపట్ల ఒనరించిన పాపానికి
ప్రాయశ్చిత్తం అమ్మా! నాన్నా!

No comments:

Post a Comment